Tuesday Motivation: వివేకానంద చెప్పిన సూక్తులు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సినవి ఇదిగో, ఈ వాక్యాలు నిరాశ నుంచి బయటపడేస్తాయి
22 October 2024, 5:30 IST
- Tuesday Motivation: వివేకానంద పేరు చెబితేనే యువతలో రక్తం ఉరకలేస్తుంది. అతని బోధనలు యువతను మాత్రమే కాదు, యావత్ ప్రపంచాన్ని చైతన్యవంతం చేశాయి.
వివేకానంద కోట్స్
మన భారతదేశ ఐక్యతకు నిజమైన పునాదులు వేసిన వ్యక్తుల్లో స్వామి వివేకానంద ఒక్కరు. ఆయన వైవిధ్యాలతోనే కలిసి జీవించడం ఎలాగో నేర్పించాడు. తూర్పు, పశ్చిమ దేశాల సంస్కృతి మధ్య వర్చువల్ వంతెనను నిర్మించాడు. అతను ఉపన్యాసాలు, రచనలు, కవితలు, లేఖలు, ఆలోచనలు భారతదేశంలోని యువతను మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని ప్రేరేపించాయి. అతను చెప్పే ప్రతి మాట ఇప్పటికీ యువతకు మేల్కోలపుతూనే ఉంటుంది.
ప్రపంచానికే ఆధ్యాత్మిక ఆలోచనా పాఠాలను నేర్పించిన దార్శనికుడు స్వామి వివేకానంద. ప్రతీ వ్యక్తికి వివేకానంద సూక్తులు ఎంతో అవసరం. వాటి సారాంశం డిప్రెషన్ బారిన పడిన సమయంలో ప్రేరణ పొందేందుకు ఉపయోగపడుతుంది.
లేవండి మేల్కోండి లక్ష్యాన్ని సాధించేవరకు ఆగకండి అంటూ స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన పిలుపు ఈనాటికీ మారుమోగుతూనే ఉంటుంది.
ఒక ఆలోచన తీసుకోండి, ఆ ఒక్క ఆలోచనను మీ జీవితంగా మార్చుకోండి. దాని గురించి ఆలోచించండి. దాని గురించే కలను కనండి. ఆ ఆలోచన పైనే జీవించండి. మెదడు, నరాలు, కండరాలు, మీ శరీరంలోని ప్రతి భాగం ఆ ఆలోచనతోనే నిండిపోవాలి. అప్పుడే మీరు విజయానికి మార్గం వేయగలరు. అంటూ యువతను మార్గదర్శకత్వం చేశారు.
విశ్వంలోని అన్ని శక్తులు ఇప్పటికీ మానవాళివేనని, కళ్ళ ముందు చేతులు అడ్డుపెట్టుకొని చీకట్లు కమ్మేలా చేసుకుంటుంది మనమేనని ఆయన పలుసార్లు చెప్పారు. దీనికి అర్థం మన జీవితాన్ని మనమే మార్చుకోవాలని. చీకట్లోకి మిమ్మల్ని తోసేది మీరే, ఆ చీకటి నుంచి బయటికి లాగాల్సిన శక్తి కూడా మీకే ఉందని వివేకానంద ఎన్నోసార్లు వివరించారు.
మిమ్మల్ని మీరు ముందు నమ్మండి, మీ లోపల నుండి ఆ నమ్మకం బలంగా ఉండాలి. అప్పుడే ఏ అడ్డంకి వచ్చినా కూడా మీరు ముందుకు సాగగలరు అని యువతను విజయం వైపు నడిపించేందుకు ఎన్నోసార్లు చెప్పారు. వివేకానంద మంచి పని చేయడానికి ఉన్న ఏకైక మార్గం మీరు చేసే పనిని ప్రేమించడం. అలా ప్రేమించి చేసే పని కచ్చితంగా విజయవంతం అవుతుందని అంటారాయన.
గుండె లేదా మెదడు ఈ రెండింటిలో ఏది చెప్పింది వినాలో అన్న సంఘర్షణలో మీరు పడితే... కచ్చితంగా మీ హృదయాన్ని అనుసరించండి అని చెప్పారు స్వామి వివేకానంద. జీవితంలో ఎప్పటికీ వైఫల్యం చెందని విషయం ఒకటి ఉంది. అదే నేర్చుకోవడం విషయంలో ఎప్పుడూ నిత్య విద్యార్థిలా ఉండండి... మీ జీవితంలో ఓటమి రాదు అని అన్నారు వివేకానందా.
వివేకానంద చెప్పిన కోట్స్ లో అతి ముఖ్యమైనది ... మీ జీవితంలో రిస్క్ తీసుకోండి, గెలిస్తే నాయకత్వం వహించవచ్చు, ఓడిపోతే మార్గ నిర్దేశం చేయవచ్చు. ఇది ఎంతో మంది జీవితాలలో మార్చింది. ఇప్పటికీ మారుస్తూనే ఉంది. ఇతరుల నుండి మంచి నేర్చుకోండి, కానీ మీ సొంత మార్గంలోనే దాన్ని గ్రహించండి. ఇతరులు వేసిన బాటలో నడవకండి అంటూ యువతను రంజింప చేసేలా మాట్లాడారు వివేకానందా. అతని ప్రసంగాలు ఎంత విన్నా ఇంకా వినాలనిపించేలా ఉంటాయి. మీ జీవితంలో నిరాశ కమ్మినప్పుడు డిప్రెషన్ బారిన పడినప్పుడు ఖచ్చితంగా వివేకానంద జీవిత చరిత్రను చదివేందుకు ప్రయత్నించండి. అతను చెప్పిన సూక్తులను పదేపదే చదవండి. మీరు చీకటి నుంచి వెలుగులో ఒక ప్రయాణం మొదలు పెడతారు.