తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ugadi Recipes: ఉగాదికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఇవిగో, వీటి రెసిపీలు చాలా సులువు

Ugadi Recipes: ఉగాదికి సమర్పించాల్సిన నైవేద్యాలు ఇవిగో, వీటి రెసిపీలు చాలా సులువు

Haritha Chappa HT Telugu

08 April 2024, 11:30 IST

google News
    • Ugadi Recipes: ఉగాదికి నైవేద్యంగా ఏం వండాలో ఆలోచిస్తున్నారా? ఇక్కడ మేము కొన్ని సింపుల్ రెసిపీలు చెప్పాము. వీటిని వండితే తక్కువ సమయంలోనే పూర్తవుతాయి. ఉగాదికి ఇవి సరైన నైవేద్యాలు.
ఉగాది రెసిపీలు
ఉగాది రెసిపీలు

ఉగాది రెసిపీలు

Ugadi Recipes: తెలుగు ఏడాదిలో మొదటి రోజు ఉగాది. ఈ రోజున గుళ్ళు గోపురాలు కిటకిటలాడిపోతాయి. ఇంట్లో నోరూరించే నైవేద్యాలతో ఇంటి దైవాన్ని పూజిస్తారు. అయితే ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలో ఎక్కువమంది ఆలోచిస్తూ ఉంటారు. తక్కువ సమయంలోనే సిద్ధమయ్యే రెసిపీలను ఇక్కడ మేము ఇచ్చాము. వీటిలో తీపి నైవేద్యాలు ఉన్నాయి. అలాగే కొత్త మామిడి తో వండే నైవేద్యాలు ఉన్నాయి. వీటిని వండి పెడితే చాలు.. దైవం తప్పకుండా మిమ్మల్ని కటాక్షిస్తారు.

అటుకుల లడ్డు

అటుకులు - ఒక కప్పు

పెసరపప్పు - అర కప్పు

సేమియా - పావు కప్పు

పంచదార - ఒక కప్పు

నెయ్యి - పావు కప్పు

జీడిపప్పు - గుప్పెడు

యాలకుల పొడి - అర స్పూను

అటుకుల లడ్డు రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి చిన్న మంటపై అటుకులను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

2. అందులోనే సేమియా, పెసరపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.

3. అటుకులు, పెసరపప్పు, సేమియాను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని విడివిడిగా పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి పొడి చేసుకున్న పెసరపప్పును అందులో వేయించి తీసి ఒక గిన్నెలో వేయండి.

5. మళ్ళీ ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి వేయించిన పొడి చేసుకున్న అటుకులను ఒకసారి వేయించి తీసి మళ్ళీ పక్కన పెట్టుకోండి.

6. ఒక పెద్ద గిన్నెలో ఈ మూడు పొడులను వేసి కలపండి.

7. అందులోనే సన్నగా తరిగిన జీడిపప్పులను, చక్కెర పొడిని, యాలకుల పొడిని కూడా వేసి బాగా కలపండి.

8. నెయ్యిని గోరువెచ్చగా చేసి ఇందులో వేసి బాగా కలపండి.

9. వీటిని చేత్తోనే లడ్డూల్లా చుట్టి పక్కన పెట్టుకోండి.

10. అంతే అటుకుల లడ్డు రెడీ అయినట్టే. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి .

..............................

పెసరపప్పు బొబ్బట్లు

పెసరపప్పు - ఒక కప్పు

పంచదార - ఒక కప్పు

మైదా - ఒకటిన్నర కప్పు

నీరు - సరిపడినంత

ఉప్పు - రుచికి సరిపడా

నెయ్యి - తగినంత

యాలకుల పొడి - అర స్పూను

పెసరపప్పు బొబ్బట్లు రెసిపీ

1. ఒక గిన్నెలో మైదా, ఒక స్పూన్ నూనె, అర స్పూను ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

2. అందులో తగినంత నీటిని వేసి పూరీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి రెండు లీటర్ల నీటిని వేయాలి.

4. అవి బాగా మరుగుతున్నప్పుడు పెసరపప్పును వేసి ఉడికించాలి.

5. పప్పు బాగా ఉడికాక పప్పును వడకట్టుకొని పెసరపప్పును తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.

6. లోతుగా ఉండే గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో ఉడికించుకున్న పెసరపప్పు, చక్కెర వేసి బాగా కలిపి చిన్న మంట మీద ఉడికించాలి.

7. పంచదార కరిగి... పప్పు అంతా బాగా ఉడుకుతుంది.

8. పప్పు హల్వా లాగా ముద్దలా అయ్యేంతవరకు ఉడికించాలి.

9. దీనికి కనీసం పావుగంట నుంచి 20 నిమిషాలు పట్టొచ్చు.

10. ఆ మిశ్రమంలోనే యాలకుల పొడిని, పావు స్పూను ఉప్పును కూడా వేసి బాగా కలపాలి.

11. స్టవ్ కట్టేసి ఆ మిశ్రమం చల్లారే వరకు వేచి ఉండాలి.

12. తరువాత మైదా నుంచి చిన్న ఉండను తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి.

13. మధ్యలో పెసరపప్పు మిశ్రమాన్ని పెట్టి మడత పెట్టాలి.

14. తిరిగి దాన్ని బాగా ఒత్తుకోవాలి. ఇలా చేశాక స్టవ్ మీద పెనం పెట్టి దీన్ని రెండు వైపులా వేయించుకోవాలి.

15. వేయించడానికి నెయ్యిని ఉపయోగిస్తే మంచి టేస్ట్ వస్తుంది.

16. ఇలా అన్ని బొబ్బట్లను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు కాల్చుకుంటే సరి. పెసరపప్పు బొబ్బట్లు సిద్ధమైపోతాయి.

17. తినే ముందు కూడా నెయ్యి రాసుకొని తింటే బాగుంటుంది.

.............................

మామిడి కాయ పులిహోర

ఉగాది రోజే మామిడి కాయను తొలిసారిగా తినేవారు ఎంతోమంది. అలాంటివారు మామిడికాయ పులిహోరను నైవేద్యంగా సమర్పించి తర్వాత దాన్ని ప్రసాదంగా తింటే మంచిది.

మామిడికాయ పులిహోర రెసిపీ

వండిన అన్నం - మూడు కప్పులు

పచ్చిమామిడి తురుము - ఒకటిన్నర కప్పు

వేరుశెనగ పలుకులు - గుప్పెడు

జీడిపప్పు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత

ఆవాలు - ఒక స్పూను

శనగపప్పు - ఒక స్పూను

మినప్పప్పు - ఒక స్పూను

ఎండుమిర్చి - మూడు

పచ్చిమిర్చి - ఆరు

తురిమిన అల్లం - ఒక స్పూను

ఇంగువ - పావు స్పూన్

పసుపు - పావు స్పూను

కరివేపాకులు - గుప్పెడు

మామిడికాయ పులిహోర రెసిపి

1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

2. నూనెలో ఆవాలు వేసి చిటపటలాడించాలి. తర్వాత శెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చి మిర్చి, తురిమిన అల్లం, కరివేపాకులు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి.

3. అందులోనే తురిమిన మామిడి కాయను కూడా వేసి వేయించుకోవాలి.

4. అలాగే వేరుశెనగ పలుకులు, జీడిపప్పులు కూడా వేసి వేయించాలి.

5. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఆ మిశ్రమంలో ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి పులిహోర కలిపినట్టుగా కలుపుకోవాలి.

6. రుచికి సరిపడా ఉప్పును కలుపుకోవాలి. అంతే మామిడికాయ పులిహోర రెడీ అయినట్టే.

.........................

కొమ్ము శెనగల తాళింపు

ఉగాది రోజు కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యాలలో కొమ్ము శెనగల తాళింపు ఒకటి. దీన్ని చేయడం చాలా సులువు.

కొమ్ము శెనగల తాళింపు చేయడానికి కొమ్ముశెనగలను మూడు నాలుగు గంటల ముందే నానబెట్టుకోవాలి.

కొమ్ము శెనగలు - ఒక కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - ఒక స్పూన్

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

మినప్పప్పు - అర స్పూను

పచ్చిమిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

కొమ్ము శెనగల తాళింపు తయారీ

1. కొమ్ము శెనగలను కనీసం మూడు నుంచి నాలుగు గంటల ముందే నానబెట్టుకోవాలి.

2. తర్వాత వాటిని కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.

3. నీటిని వడకట్టి ఈ కొమ్ము శెనగలను ఒక గిన్నెలో వేసుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. నూనెలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి చిటపటలాడనివ్వాలి.

6. తర్వాత పచ్చిమిర్చి తరుగు, కరివేపాకులు వేసి వేయించాలి.

7. అందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి.

8. 20 సెకన్లు వేగాక ఉడికించుకున్న కొమ్ము శెనగలను అందులో వేసి బాగా కలుపుకోవాలి.

9. కొంతమంది పైన కొబ్బరి తురుమును కూడా చల్లుకుంటారు.

అది మీ ఇష్టం. అంతే కొమ్ము శెనగలు తాలింపు రెడీ అయినట్టే.

పైన చెప్పిన నైవేద్యాలను ఉగాది రోజు దేవునికి సమర్పించిన తరువాత ప్రసాదంగా స్వీకరిస్తే అంతా మేలే జరుగుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం