తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heat Pack Or Cold Pack: వేడి కాపడమా, చన్నీటితో కాపడమా.. ఏ నొప్పికి ఏది ఉపయోగకరం?

Heat pack or cold pack: వేడి కాపడమా, చన్నీటితో కాపడమా.. ఏ నొప్పికి ఏది ఉపయోగకరం?

29 August 2023, 13:30 IST

google News
  • Heat pack or cold pack: కోల్డ్ ప్యాక్ , హాట్ ప్యాక్.. ఎలాంటి నొప్పులకు, ఇబ్బందులకు ఏ ప్యాక్ వాడితే మంచిదో తెలుసుకుందాం. 

కోల్డ్ థెరపీ లేదా హీట్ థెరపీ
కోల్డ్ థెరపీ లేదా హీట్ థెరపీ (Freepik)

కోల్డ్ థెరపీ లేదా హీట్ థెరపీ

కోల్డ్ ప్యాక్ లేదా హాట్ ప్యాక్.. మన భాషలో చెప్పాలంటే వేడి కాపడం, లేదా చల్లటి నీళ్ల కాపడం. కొన్ని రకాల నొప్పులకు హాట్ ప్యాక్ వాడితే, కొన్నింటికి కోల్డ్ ప్యాక్ వాడాలంటారు. అంతే కానీ ఒకదాని బదులుగా ఇంకోటి వాడితే ఫలితం ఉండదు. వాపు, గాయాలకు వేడి కాపడం కన్నా కోల్డ్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. కండరాల నొప్పులు, నరం పట్టుకోవడం లాంటి వాటికి హాట్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఈ విషయంలో సందేహాలుంటే కొన్ని విషయాలు తెలుసుకోండి. స్పష్టత వచ్చేస్తుంది.

హీట్ థెరపీ:

హాట్ ప్యాక్ లేదా హీట్ థెరపీ జాయింట్, స్కిన్ టిష్యూ ఉష్ణోగ్రతను పెంచుతుంది మరియు జీవక్రియను పెంచుతుంది, వాసోడైలేటేషన్‌కు కారణమయ్యే రక్త ప్రసరణను పెంచుతుంది, కండరాలకు సాంత్వననిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.

క్రయోథెరపీ:

కోల్డ్ ప్యాక్ లేదా క్రయోథెరపీ హీట్ థెరపీకి వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటాయి. చల్లదనం వల్ల చర్మ కణజాలం, కీళ్ల ఉష్ణోగ్రత తగ్గుతుంది. తద్వారా జీవక్రియ డిమాండ్‌ను తగ్గిస్తుంది, మొదట్లో రక్తనాళాల సంకోచం ద్వరా రక్త ప్రసరణ తగ్గిస్తుంది. తర్వాత జరిగే ఆకస్మిక రక్త ప్రవాహం లేదా వాసోడైలేటేషన్‌ను లూయిస్ హంటింగ్ రియాక్షన్ అని పిలుస్తారు. ఇది త్వరగా నయం కావడానికి సాయం చేస్తుంది. కోల్డ్ థెరపీ కూడా వాపు, కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

ఎలాంటి సమస్యలకు ఏ థెరపీ వాడాలి?

1. కండరాల నొప్పులు:

ఏదైనా కసరత్తు లేదా పని చేసిన తర్వాత కండరాల్లో నొప్పి రావచ్చు. మొదటి 24 నుంచి 48 గంటల వరకు ఈ నొప్పి ఎక్కువగా ఉండి కొన్ని సార్లు 72 గంటల వరకు కూడా ఇబ్బంది పెడుతుంది. ఈ సందర్భాల్లో హాట్ థెరపీ వాడాలి. ఇది చర్మ కణజాలం, కీళ్ల ఉష్ణోగ్రత పెంచి వేడి కోల్పోకుండా చేస్తుంది. దీనివల్ల రక్తనాళాలు వ్యాకోచం చెంది నొప్పి నయమయ్యే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

2. బెణకడం, కీళ్ల నొప్పులు:

మొదట్లో వాపు, ఉబ్బు తగ్గడానికి కోల్డ్ ప్యాక్ వాడాలి. అది కూడా చిన్న గాయమై, వాపు మరీ ఎక్కువనిపిస్తేనే ఐస్ పెట్టుకోవచ్చు. అంత ఇబ్బందేం లేకుండా, ఉబ్బు కూడా అంత లేకపోతే ఐస్ వాడాల్సిన పని కూడా లేదు.

3. దీర్ఘకాల కండరాలు, కీళ్ల నొప్పులు:

దీర్ఘకాలంగా వేధిస్తున్న మెడనొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పులకు హాట్ థెరపీ ఉపయోగకరం.

4. కండరం పట్టినట్టు అవ్వడం:

కండరాలు, కీళ్లు పట్టేసినట్లు అయితే హాట్ థెరపీ వాడాలి. ఇది కణజాలం, కీళ్లు సులభంగా కదిలేలా చేస్తుంది.

5. పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి:

గర్బాశయ సంకోచం వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి వస్తుంది. గర్భాశయ కండరాలకు హీట్ ప్యాక్‌తో సాంత్వన దొరుకుతుంది. రక్త నాళాల వ్యాకోచం ద్వారా రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది.

6. పురిటి నొప్పులు:

ఈ సమయంలో కూడా హాట్ ప్యాక్స్ పనిచేస్తాయి. అయితే ఈ హాట్ ప్యాక్‌లను వీపు కింద భాగం దగ్గర వాడొచ్చు. పొత్తికడుపు కండరాలపై నేరుగా ఉపయోగించకూడదు. ఈ హీట్ ప్యాక్ ద్వారా నొప్పి కాస్త తగ్గుతుంది.

నొప్పి రకాన్ని బట్టి హాట్ లేదా కోల్డ్ థెరపీని వాడొచ్చు. కాబట్టి సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఏ థెరపీ వాడాలని నిర్దరణకు రావాలి.

తదుపరి వ్యాసం