Beetroot Vada: బీట్‌రూట్ వడల రెసిపీ, ఈ ఆరోగ్యకర దుంపను చేర్చుకునేందుకు మంచి మార్గం
13 October 2024, 6:30 IST
- Beetroot vada: బీట్‌రూట్ చాలా ఆరోగ్యకరమైన దుంప. దీన్ని ఆహారంలో చేర్చుకోడానికి ఓ మార్గం బీట్‌రూట్ వడలు. వీటి సింపుల్ రెసిపీ ఎలాగో చూసేయండి.
బీట్‌రూట్ వడలు
బీట్‌రూట్ వడలు
బీట్‌రూట్‌తో ఆరోగ్యానికి మేలు అని తెలిసినా కూడా దాని రుచి నచ్చక ఎక్కువగా తినలేరు. అలాంటప్పుడు ఇలా అల్పాహారంలో గానీ, స్నాక్స్ కోసం కానీ బీట్‌రూట్ వడలు చేసుకోవచ్చు. హెల్తీగా, సింపుల్ గా ఉండే ఈ రెసిపీ ఎలాగో చూసేయండి.
బీట్‌రూట్ వడల తయారీకి కావాల్సినవి:
1 కప్పు శనగపప్పు
1 కప్పు బీట్ రూట్ తురుము
3 పచ్చిమిర్చి
అంగుళం అల్లం ముక్క
అంగుళం దాల్చిన చెక్క ముక్క
1 కరివేపాకు రెమ్మ
3 చెంచాల బియ్యం పిండి
అర టీస్పూన్ జీలకర్ర
అరచెంచాడు ఉప్పు
డీప్ ఫ్రై సరిపడా నూనె
బీట్‌రూట్ వడల తయారీ విధానం:
- ముందుగా శనగపప్పును నీళ్లతో కడిగేసి నానబెట్టుకోవాలి. పప్పు కనీసం నాలుగైదు గంటలైనా నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు శనగపప్పులో నీళ్లు వంపేసి, కాస్త పప్పును అలాగే పక్కన తీసి పెట్టుకోవాలి.
- మిగతా పప్పును మిక్సీలో వేసి బరకగా ముద్దలా పట్టుకోవాలి. పప్పుతో పాటే దాల్చిన చెక్క, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాలి.
- ఈ ముద్దను పెద్ద గిన్నెలోకి తీసుకుని అందులో బియ్యం పిండి, కరివేపాకు తురుము, జీలకర్ర, ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న శనగపప్పు వేయాలి.
- అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలు చేసి వడల్లాగా ఒత్తుకోవాలి.
- గ్యాస్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసుకుని బాగా వేడెక్కాక ఈ వడల్ని వేసుకోవాలి.
- కాస్త రంగు మారే వరకు వేయించి తీసుకుంటే బీట్‌రూట్ వడలు తయార్.