టైప్ చేసే వారి కంటే చేతితో రాసేవారే చాలా స్మార్ట్! ఓ అధ్యయనంలో వెల్లడి
28 February 2022, 14:28 IST
- డిజిటల్ లెర్నింగ్ బాగా పెరిగిపోయింది. కీబోర్డ్ టైప్ చేయడం తప్ప, రాయడం అనేదే గతంతో పోలిస్తతే కొంచెం తగ్గింది.
- టైప్ చేయడంతో పోలిస్తే ఉత్తమ అభ్యాసం, మంచి జ్ఞాపకశక్తి చేతితో రాస్తేనే లభిస్తుంది.
Writing by hand
మీరు 80-90వ దశకానికి చెందిన పిల్లలైతే మీ చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాల్లోకి ఒకసారి వెళ్లండి. అప్పుడు మీ టీచర్లు అందమైన చేతిరాతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. అందమైన చేతిరాత కోసం ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చేవారు. ముత్యాల్లాంటి అక్షరాలతో జవాబులు రాసిన వారికి ప్రశంసలతో పాటు, అదనపు మార్కులు కూడా లభించేవి. కానీ, ఇప్పుడంతా డిజిటల్ మయం. పేపర్-పెన్ను, పలక -బలపం మాయమైపోయాయి. ప్రతి ఒక్కరి కళ్లు, చేతులు ఇప్పడు వివిధ రకాల డిజిటల్ స్క్రీన్ల మీదే ఉంటున్నాయి. ఈ కాలం పిల్లలు ఇదే ధోరణికి అలవాటుపడిపోతున్నారు. వారికి ఎన్ని రకాల ఆటవస్తువులు అందించినా.. ఒక్క స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు దానికే అతుక్కుపోతున్నారు.
డిజిటల్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం..
కరోనా కారణంగా ఇంటికే పరిమితమై డిజిటల్ లెర్నింగ్ పెరిగిపోయింది. కీబోర్డ్ టైప్ చేయడం తప్ప, రాయడం అనేదే ఉండటం లేదు. అయితే పిల్లలకు చేతితో రాయటం కూడా అలవాటు చేయాలని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. ఇప్పటికీ రాయడం తెలియని చిన్నారులు ఎంతోమంది ఉన్నారని, కనీసం చేతిరాత శిక్షణను ఇప్పించాలని సూచిస్తున్నారు. టైప్ చేయడంతో పోలిస్తే చేతి రాతతోనే ఉత్తమ అభ్యాసం, మంచి జ్ఞాపకశక్తి లభిస్తుందని వారంటున్నారు.
చేతిరాతతో జ్ఞాపకాలు పదిలం..
చేతితో రాసేటపుడు వారికి చదవడం కూడా అవుతుంది, అలా చదివింది చాలాకాలం పాటు గుర్తుంచుకుంటారని తమ అధ్యయనాలు నిరూపించాయని చెబుతున్నారు. నార్వేజియన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధక బృందం చేసిన అధ్యయనం ఈ విషయాన్ని ధృవీకరించింది. "పెన్, పేపర్ వాడకం ద్వారా ఆ జ్ఞాపకాలను పదిలంగా ఉంచడానికి మెదడుకు మరింత ఊతం ఇస్తుంది. చేతితో రాయడం మెదడులోని సెన్సార్‌మోటర్ భాగాలలో మెరుగైన కార్యాచరణను సృష్టిస్తుంది" అని NTNU లో ప్రొఫెసర్ ఆడ్రీ వాన్ డెర్ మీర్ అన్నారు.
"కాగితంపై పెన్ను నొక్కడం, మీరు రాసే అక్షరాలను చూడటం, ఏకాగ్రతతో రాసేటప్పుడు మీరు చేసే ధ్వనిని వినడం ద్వారా చాలా ఇంద్రియాలు సక్రియం చేసినవారవుతారు. ఇది మెదడులోని వివిధ భాగాల మధ్య కనెక్టివిటీని పెంచుతుంది. దీంతో ఒక విషయం పట్ల సరైన అవగాహన ఏర్పడుతుంది. ఏదైనానేర్చుకోవడం సులభం అవుతుంది. ఇలా నేర్చుకున్నది చాలాకాలం పాటు గుర్తుంచుకుంటాము" అని ఆయన తెలిపారు.
సృజనాత్మకత పెరుగుతుంది..
మెదడు చురుకుగా పనిచేస్తున్నపుడు అది విద్యుత్ ప్రేరణలను ఉత్పత్తి చేస్తుంది. ఈ చురుకుతనం కీబోర్డ్‌పై టైప్ చేసేటప్పుడు కంటే చేతితో రాసేటప్పుడు మైరుగ్గా ఉందని తమ ఫలితాలు చూపించాయని, సుమారు 250 మంది పిల్లలు, యువకులపై తాము అధ్యయనం చేసినట్లు ఫ్రాంటియర్ సైకాలజీ జర్నల్స్ లలో ప్రచురించారు.
క్లిష్టమైన చేతి కదలికలు, అక్షరాల ఆకృతి అనేవి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. అందమైన దస్తూరి కలవారు డ్రాయింగ్, పెయింటింగ్ లాంటి కళల్లో రాణించేలా మంచి స్కిల్స్ కలిగి ఉంటారు. వారిలో క్రియేటీవిటీ కూడా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి టైపింగ్ చేయాల్సిన అవసరం ఉన్నా, అప్పుడప్పుడూ చేతితో రాయడం కూడా చేస్తూ ఉంటే అది మిమ్మల్ని నిత్యం చురుగ్గా ఉండేలా చేస్తుంది అనేది నేటి మాట.