Monsoon Hair Care | వానాకాలంలో మీ జుట్టును సంరక్షించండి.. ఈ చిట్కాలు పాటించండి!
20 June 2022, 9:13 IST
- తల మీద జుట్టు ఉన్నప్పుడే సరైన సంరక్షణ చర్యలు తీసుకోండి. ఒక్కసారి పోయిన జుట్టు మళ్లీ తిరిగి రావడం కష్టం. ముఖ్యంగా ఈ వానాకాలంలో జుట్టు సమస్యలు అధికమవుతాయి. కాబట్టి ఈ చిట్కాలు పాటించండి.
Hair Care
సుదీర్ఘకాలం పాటు వేడి, ఉక్కపోతలను అనుభవించిన తర్వాత రుతుపవనాలు వచ్చి ఇప్పుడు వాతావరణాన్ని చల్లబరిచాయి. ఈ మాన్‌సూన్ సీజన్ మళ్లీ మనల్ని రిఫ్రెష్ చేస్తుంది, సజీవంగా అనిపించేలా చేస్తుంది, చల్లగా ఉంచుతుంది. అదే సమయంలో ఈ కాలంలోనే అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఎక్కువే. చర్మసమస్యలు, జుట్టు సమస్యలు కూడా అధికమవుతాయి. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే ఎక్కువ మంది చర్మంపై చూపించే శ్రద్ధ, జుట్టుపై చూపించరు.
ముఖ్యంగా ఈ వానాకాలంలో వాతావరణంలో ఉండే అధిక తేమ కారణంగా వెంట్రుకలు జిగటగా మారి తలలో జిడ్డు పేరుకుపోతుంది. జుట్టు నిర్జీవంగా మారడం, రాలిపోవడం, చుండ్రు ఇతరత్రా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం తగదు.
అందుకే, ఈ వర్షాకాలంలో మీ జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను అమలుచేయండి.
1. మీ జుట్టును పొడిగా ఉంచండి
వర్షాకాలంలో మీ స్కాల్ప్ పొడిగా ఉంచుకోవడం అనేది మొట్టమొదటి సంరక్షణ చర్య. వానలో తడవడం బాగానే ఉంటుంది కానీ వర్షపు నీరు మురికిగా, ఆమ్లంగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ నీరు సుమారు 5.6 pH ఉంటుంది. ఇది మీ జుట్టుకు చాలా అనారోగ్యకరమైనది. కాబట్టి వానల్లో తడిస్తే వెంటనే ఒక మృదువైన మైక్రోఫైబర్ టవల్ ఉపయోగించి తుడుచుకోండి. ఇలాంటి టవల్ నీటిని వేగంగా గ్రహిస్తుంది, జుట్టుపై రాపిడిని తగ్గిస్తుంది, తత్ఫలితంగా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
2. కొబ్బరి నూనె రాయండి
షాంపూ చేసుకోవాలనుకుంటున్నప్పుడు 15 నిమిషాల ముందు శుద్ధమైన కొబ్బరి నూనెను అప్లై చేయండి. ఇలా చేయడం వలన మీ జుట్టు గ్రీజీగా మారుతుంది. దీంతో తలలో నీరు నిలిచి ఉండదు. షాంపూ నురగను కూడా తలకు అలాగే అంటుకొని ఉంచదు. దీంతో చాలావరకు జుట్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది స్త్రీ, పురుషులు ఎవరికైనా వర్తిస్తుంది.
3. సరైన దువ్వెన ఎంచుకోండి
మీ జుట్టు తడిగా ఉన్నప్పుడు బలహీనంగా మారుతుంది. కాబట్టి తడి జుట్టును దువ్వితే వెంట్రుకలు తెగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే జుట్టు బాగా ఆరబెట్టుకొని దువ్వుకోవాలి. దువ్వెనను కూడా సరైనది ఎంచుకోవాలి. ఖాళీలు ఎక్కువగా ఉండే దువ్వెన ఎంచుకోండి. దువ్వెన దంతాలు ఇరుకుగా ఉంటే అది మీ జుట్టును సులభంగా విడదీస్తుంది. కాబట్టి దువ్వెన దంతాల మధ్య తగినంత ఖాళీ ఉండే మృదువైన దువ్వెనను ఎంచుకోండి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి వేరొకరు ఉపయోగించిన దువ్వెనలు ఉపయోగించరాదు. చుండు, దురద ఇతర సమస్యలకు ఇది కూడా ఒక కారణం.
4. వేప, పసుపు పేస్ట్
వర్షాకాలంలో చుండ్రు (ఫంగల్ ఇన్ఫెక్షన్) నుంచి బయటపడటానికి పసుపు, వేప గుణాలు కలిగిన పేస్టును తలకు పట్టించడం ఎంతో మంచిది. ఈ రెండింటిలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్, యాంటిసెప్టిక్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి తాజా పచ్చిపసుపును అలాగే వేప ఆకులను నూరుకొని తలకు రాసుకొని ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇది మీ జుట్టును కుదుళ్ల నుంచి ఆరోగ్యవంతం చేస్తుంది. శిరోజాలు బాగా పెరుగుతాయి, జుట్టురాలడం, పేను, చుండ్రు సమస్యలు తొలగిపోతాయి.
5. సరైన ఆహారం తీసుకోండి
మీ జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు తినే ఆహారం మీ జుట్టు నాణ్యతను నిర్ణయిస్తుంది. గుడ్లు, వాల్‌నట్‌లు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు మొదలగు ప్రోటీన్-రిచ్ ఫుడ్‌ను మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోండి, అవి మీ జుట్టుకు మెరుపును అందిస్తాయి. అలాగే బెర్రీ ఫ్రూట్స్, నట్స్, పాలకూర, చిలగడదుంప వంటివి తీసుకోవడం ద్వారా అవి మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. హైడ్రేట్ గా ఉండంటి. తాగినంత నీరు తాగండి.