Benefits with Wooden Comb : ఈ విషయాలు తెలిస్తే.. మీరు చెక్క దువ్వెననే వాడుతారు..
16 June 2022, 12:55 IST
- ప్లాస్టిక్ దువ్వెనలతో మీ జుట్టును బ్రష్ చేయడం వల్ల మీ స్కాల్ప్ దెబ్బతింటుంది. తద్వారా హెయిర్ బ్రేక్ అయిపోతుంది. అందవిహీనంగా మారిపోతుంది. కాబట్టి మీ స్కాల్ప్‌కు మంచి పోషణ ఇచ్చి.. హెయిర్‌ను కాపాడుకోవాలి అనుకుంటే.. చెక్క దువ్వెనలను వాడటం మంచి ఎంపిక అంటున్నారు.
చెక్క దువ్వెనతో ఉపయోగాలు
Wooden Comb : హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసుకోవడానికి.. చుండ్రును తగ్గించుకోవడానికి.. పలు జుట్టు సమస్యలను దూరం చేసుకోవడానికి చెక్క దువ్వెనలను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. చెక్క దువ్వెనలు మీ స్కాల్ప్‌కు పోషణను అందించడంలో సహాయం చేస్తాయని తెలిపారు. ఈ దువ్వెనలు తేలికగా ఉండి.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి అంటున్నారు. ఇవి పర్యావరణానికి అనుకూలమైనవి కూడా. మరి ఈ దువ్వెనలను వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చుండ్రును తగ్గిస్తుంది
మెటల్, ప్లాస్టిక్ దువ్వెనలు మీ తలపై చికాకు కలిగిస్తాయి. మీ జుట్టుకు హాని కలిగించే చుండ్రు సమస్యలను ప్రేరేపిస్తాయి. కానీ చెక్క దువ్వెన మాత్రం మీ హెయిర్‌కు రక్షణ ఇస్తుంది. ఎందుకంటే ఇది మీ జుట్టుపై మృదువుగా, సున్నితంగా పనిచేస్తుంది. చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ తలపై నూనె ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది చుండ్రు సమస్యలను దూరంగా ఉంచేలా చేస్తుంది.
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది
ప్లాస్టిక్ హెయిర్ దువ్వెనతో మీ జుట్టును లాగడం వల్ల జుట్టు చిట్లడం, జుట్టు రాలిపోయే అవకాశాలను పెంచుతుంది. ఇది చిక్కును విడదీయడానికి బదులుగా.. జుట్టు రాలిపోయేలా చేస్తుంది. కానీ చెక్క దువ్వెనలు వెంట్రుకలకు ఇబ్బంది లేకుండా చిక్కును విడదీస్తాయి.
తలలో జిడ్డు లేకుండా..
మనలో చాలామంది స్కాల్ప్ మీద జిడ్డు సమస్యను ఎదుర్కొంటారు. ఇది మన జుట్టును అందవిహీనంగా చేస్తుంది. సేబాషియస్ గ్రంథులు ఉత్పత్తి చేసే సహజ నూనెలు తలలో జిడ్డును ఏర్పరుస్తాయి. చెక్క దువ్వెనలు సెబమ్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి. మీ స్కాల్ప్, జుట్టు ద్వారా నూనెలను సమానంగా పంపిణీ చేస్తాయి.
తలలో రక్త ప్రసరణను పెంచుతాయి..
ప్లాస్టిక్ దువ్వెనలు సాధారణంగా మీ జుట్టుపై కఠినంగా ఉంటాయి. చెక్క దువ్వెనలు మాత్రం మృదువైన అనుభూతిని కలిగిస్తాయి. అంతేకాకుండా ఇవి మీ జుట్టు నాణ్యతను మెరుగు పరుస్తాయి. చెక్క దువ్వెనలు కార్బన్-ఆధారితంగా ఉంటాయి. ఇవి మీ నెత్తిమీద మసాజ్ చేసిన అనుభూతిని ఇస్తాయి. అవి మీ తలలో రక్త ప్రసరణను పెంచుతాయి. సున్నితమైన మసాజ్ మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది.
స్కాల్ప్ అలర్జీలను నివారిస్తుంది..
మీకు సున్నితమైన స్కాల్ప్ ఉంటే చెక్క దువ్వెనలు మంచి ఎంపిక. ప్లాస్టిక్ లేదా మెటల్ దువ్వెనలు కొన్నిసార్లు తలపై అలెర్జీలు లేదా చికాకులను కలిగిస్తాయి. మరోవైపు చెక్క దువ్వెనలు చికాకును కలిగించవు. అలెర్జీలను అరికడతాయి. కాబట్టి జుట్టు ఆరోగ్యాన్ని కోరుకునే వారు చెక్క దువ్వెనలు వాడటం మంచిది.
టాపిక్