తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Haritha Chappa HT Telugu

17 May 2024, 15:30 IST

google News
    • Godhuma Laddu: పిల్లలకు సాయంత్రం పూట ఒక గోధుమ పిండి లడ్డూను ఇలా చేసి ఇస్తే ఎన్నో పోషకాలు అందుతాయి. వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. గోధుమపిండి లడ్డూల రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
గోధుమ పిండి లడ్డూ రెసిపీ
గోధుమ పిండి లడ్డూ రెసిపీ

గోధుమ పిండి లడ్డూ రెసిపీ

Godhuma Laddu: లడ్డూ అనగానే పంచదారతో చేసినవే గుర్తొస్తాయి. బెల్లంతో చేసిన లడ్డులే ఆరోగ్యానికి మంచిది. పంచదారతో చేసిన ఆహారాలు తినడం వల్ల అనేక అనారోగ్యాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బెల్లం, గోధుమపిండి కలిపి చేసే గోధుమపిండి లడ్డూల రెసిపీ ఇచ్చాము. ఈ రెసిపీ చాలా సులువు. దీన్ని పిల్లలకు రోజుకి ఒకటి తినిపిస్తే చాలు, వారికి కావలసిన పోషకాలు అందడంతో పాటు శరీరం శక్తివంతంగా మారుతుంది. ఈ గోధుమపిండి లడ్డూలు చేయడం చాలా సులువు.

గోధుమ పిండి లడ్డూలు రెసిపీకి కావలసిన పదార్థాలు

గోధుమపిండి - అరకప్పు

బెల్లం తురుము - ఒక కప్పు

నెయ్యి - అయిదు స్పూన్లు

కొబ్బరి తురుము - మూడు స్పూన్లు

జీడిపప్పు - గుప్పెడు

బాదం - గుప్పెడు

కిస్ మిస్ -గుప్పెడు

ఉప్పు - చిటికెడు

యాలకుల పొడి - అర స్పూను

గోధుమపిండి లడ్డూలు రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి గోధుమ పిండిని వేసి వేయించండి. ఉండల కట్టకుండా పిండి పొడిపొడిగా ఉండేలా చూసుకోండి.

2. అది పచ్చివాసన పోయి కాస్త రంగు మారేవరకు వేయించండి.

3. తర్వాత ఆ పిండిని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి.

4. ఇప్పుడు అదే కళాయిలో బెల్లం తురుమును కొంచెం నీటిని వేసి వేడి చేయండి.

5. అలా ఉడికిస్తున్నప్పుడు బెల్లం తీగపాకంలా వస్తుంది.

6. ఆ సమయంలో ముందుగా పెట్టుకున్నా గోధుమ పిండిని కూడా వేసి బాగా కలపండి.

7. అలాగే బాదంపప్పులు, కిస్ మిస్ లు, తరిగిన జీడిపప్పులు, కొబ్బరి తురుమును కూడా వేసి బాగా కలపండి.

8. యాలకుల పొడిని కూడా వెయ్యండి.

9. ఈ మొత్తం మిశ్రమం కాస్త గట్టిపడేదాకా కలుపుతూ ఉండండి.

10. ఆ తర్వాత పావు కప్పు నెయ్యిని అందులో వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని చల్లారే వరకు అలా వదిలేయండి.

11. తర్వాత దాన్ని ఉండలుగా చుట్టుకొని గాలి చొరబడని డబ్బాలో వేసుకోండి. అవి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. రుచిగా కూడా ఉంటాయి.

12. వీటిని తినడం వల్ల పిల్లల్లో రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది.

13. ఒక్కసారి వీటిని చేశారంటే మీకు చేయడం సులువుగా మారిపోతుంది. రోజుకో లడ్డుని పిల్లలకు తినిపించడం వల్ల వారు శక్తివంతంగా మారుతారు.

ఇందులో వాడిన గోధుమపిండి, నెయ్యి, బెల్లం, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇందులో మనం అధిక ఉష్ణోగ్రతల వద్ద వేటినీ ఉడికించలేదు. కాబట్టి అన్ని ఆరోగ్యానికి సురక్షితమైనవనే చెప్పాలి. ఈ లడ్డును రోజుకు ఒకటి తిన్నా చాలు. పిల్లలు, పెద్దల్లో రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. ఈ లడ్డూలు చేయడానికి కనీసం అరగంట నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కసారి చేసుకుంటే రెండు నుంచి మూడు వారాలు పాటు తాజాగా ఉంటాయి.

తదుపరి వ్యాసం