Goat milk benefits: వారానికి ఒక్కసారైనా మేకపాలు తాగడం అలవాటు చేసుకోండి, వీటితో ఎన్నో లాభాలు
19 January 2024, 10:00 IST
- Goat milk benefits: గాంధీగారు మేకపాలు తాగేవారు. అప్పట్లో చాలామంది మేకపాలును తాగే వారు. ఇప్పుడు పూర్తిగా మానేశారు.
మేకపాలు ఎందుకు తాగాలి?
Goat milk benefits: గాంధీగారి ఆరోగ్య రహస్యం మేకపాలేనని చెబుతారు. అప్పట్లో మేకపాలను తాగే వారి సంఖ్య ఎక్కువగానే ఉండేది. కాలం గడిచే కొద్ది మేకపాలు వినియోగించే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు కేవలం ఆవు, గేదె పాలని మాత్రమే తాగుతున్నారు. నిజానికి మేకపాలలోనే అధికంగా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా లాక్టోజ్ ఇంటాలరెన్స్ వంటి సమస్యలతో బాధపడే వారికి మేకపాలు ఎంతో మేలు చేస్తాయి. ఆవు, గేదె పాలల్లో లాక్టోస్ అధికంగా ఉంటుంది. దీన్ని అరిగించుకునే శక్తి అందరికీ ఉండదు. దీనివల్ల లాక్టోజ్ ఇన్‌టోలరెన్స్ అనే సమస్య వస్తుంది. ఈ సమస్య ఉన్నవారికి పాలు జీర్ణం కావు. విరేచనాలు, వాంతులు అవుతూ ఉంటాయి. పొట్ట ఇబ్బందిగా ఉంటుంది. గ్యాస్ ఉత్పత్తి పెరుగుతుంది. మేకపాలు తాగితే ఆ సమస్య ఉండదు. ప్రతిరోజూ మేకపాలు దొరకడం కష్టమే, కాబట్టి వారానికి ఒకసారి అయినా మేకపాలు తాగే ప్రయత్నం చేయండి. దానిలో ఉండే పోషకాలు మన శరీరానికి అవసరం.
మేకపాల సరఫరా చాలా తక్కువగానే ఉంది. ప్రపంచంలో కేవలం రెండు శాతం మాత్రమే మేకపాలు లభిస్తున్నాయి. వీటి ఖరీదు కూడా ఎక్కువే. అలాగే వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. మేక పాలలో ఆవు పాలలో ఉండేంత కొవ్వు ఉంటుంది, కానీ మేకపాలలోని కొవ్వు జీర్ణించుకోవడం చాలా సులభం. శరీరంలోని జీర్ణక్రియకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. మేకపాలలో రెండు బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
ఆవుపాలతో పోలిస్తే మేకపాలలో 12 శాతం తక్కువ లాక్టోస్ ఉంటుంది. కాబట్టి లాక్టోస్ అరిగించుకోలేని వారికి మేకపాలు మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆవుపాలతో పోలిస్తే మేకపాలలో ప్రీ బయోటిక్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ప్రీబయోటిక్స్ మన పొట్ట ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ఈ ప్రీబయోటిక్స్ ఉపయోగపడతాయి. మేకపాలు తాగడం వల్ల పొట్టలోని మంచి బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వారానికి ఒక్కసారైనా మేకపాలు తాగడం అలవాటు చేసుకోవాలి.
మేకపాలలో క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆవుపాలలో లభించే వాటికన్నా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు శరీరం ఈ ఖనిజాలను సమర్థవంతంగా గ్రహించగలదు. కాబట్టి ఎముకల ఆరోగ్యము చక్కగా ఉంటుంది. ఆవు, గేదె పాలతో పోలిస్తే అన్ని విధాలుగా మేకపాలు ఎంతో ఆరోగ్యకరమైనవి. కాబట్టి అప్పుడప్పుడు మేకపాలు తాగేలా ప్లాన్ చేసుకోండి.