Beetroot Sambar | రంగు రుచి పోషకాలు నిండిన బీట్‌రూట్ సాంబార్.. లంచ్‌లో తింటే అవుతారు హుషార్!
24 March 2023, 13:43 IST
Beetroot Sambar Recipe: బీట్‌రూట్ సాంబార్ ను అన్నంలో కలుపుకొని తింటే ఆహా అనాల్సిందే. దీనిని ఎలా చేసుకోవాలో రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Beetroot Sambar Recipe
Beetroot Health Benefits: మీ ప్లేట్‌ను మంచి రంగు, రుచి, పోషకాలతో నింపాలంటే బీట్‌రూట్ వడ్డించుకోవాలి. దీనిలో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. బీట్‌రూట్ విటమిన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన సూపర్ ఫుడ్. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తహీనతను నివారిస్తుంది. ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. బీట్‌రూట్ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండెజబ్బుల ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. ఈ వెజిటెబుల్‌లో కేలరీలు తక్కువ ఉంటాయి, బరువు తగ్గడానికి మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మీకోసం ఇక్కడ బీట్‌రూట్ సాంబార్ రెసిపీని అందిస్తున్నాం. బీట్‌రూట్ సాంబార్ అనేది బీట్‌రూట్‌లని ఉపయోగించి చేసే ఒక సాంప్రదాయ దక్షిణ భారతీయ వంటకం. ఇది మంచి రంగు, రుచితో ఉండటమే కాకుండా ఎంతో ఆరోగ్యకరమైనది. బీట్‌రూట్ సాంబార్ ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Beetroot Sambar Recipe కోసం కావలసినవి
- 1 బీట్‌రూట్
- 1 ఉల్లిపాయ
- 1 కప్పు కందిపప్పు
- 1 కప్పు చింతపండు నీరు
- 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్
- 1 టీస్పూన్ కారంపొడి
- 1/2 టీస్పూన్ పసుపు పొడి
- 1 టీస్పూన్ నువ్వులు నూనె
- 1 టీస్పూన్ ఆవాలు
- 1 చిటికెడు ఇంగువ
- 2 రెమ్మలు కరివేపాకు
- 1 ఎండు ఎర్ర మిరపకాయ
- ఉప్పు రుచికి తగినంత
- కొత్తిమీర గార్నిషింగ్ కోసం
బీట్‌రూట్ సాంబార్ తయారీ విధానం
- ముందుగా పప్పును కడిగి 10-15 నిమిషాలు నానబెట్టండి, ఈలోపు ఉల్లిపాయను, బీట్‌రూట్‌ను ముక్కలుగా కోసి పెట్టుకోండి, మిగతా పదార్థాలను సిద్ధం చేసుకోండి.
- ఇప్పుడు ఓ రెండు కప్పుల నీరు తీసుకొని అందులో నానబెట్టిన పప్పు వేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఆవిరి మీద ఉడికించండి.
- ఆపైన ఉడికిన పప్పును ఒక గిన్నెలోకి తీసుకొని మెత్తగా చేసి కాసేపు పక్కన పెట్టండి.
- ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో బీట్‌రూట్ ముక్కలు, ఉల్లిపాయలు,సాంబార్ పొడి వేసి, కొన్ని నీళ్లుపోసి మెత్తగా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- అనంతరం ఒక బాణాలిలో ఉడికించిన పప్పు, ఆపైన ఉడికించిన బీట్‌రూట్ రసం రెండు వేసి చిన్న మంటపై మరిగించాలి.
- మరుగుతున్న సాంబార్‌లో ఉప్పు, కారం, సాంబార్ పొడి వేసి రుచిని చెక్ చేసుకోవాలి.
- చివరగా, ఒక కడాయిలో నూనె వేడిచేసి, అందులో పైన పేర్కొన్న మిగతా పదార్థాలను నూనెలో వేసి పోపు పెట్టుకోవాలి.
ఈ పోపును సాంబార్‌లో కలిపేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఘుమఘుమలాడే బీట్‌రూట్ సాంబార్ రెడీ. అన్నంలో కలుపుకొని తింటే ఆహా అనాల్సిందే.