Oral Hygiene Tips। దంతాలను ఎన్ని డిగ్రీల కోణంలో బ్రష్ చేయాలి? చిగుళ్ళకు మసాజ్ ఎలా చేయాలి?
13 July 2023, 9:45 IST
- Oral Hygiene Tips: మీ దంతాలు దృఢంగా ఉండాలంటే సరైన దంత సంరక్షణ అవసరం. ఇక్కడ నోటి ఆరోగ్యానికి సంబంధించి నిపుణులు అందించిన కొన్ని చిట్కాలను మీకు తెలియజేస్తున్నాం.
Oral Hygiene Tips:
Oral Hygiene Tips: నోటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజంతా నోటి ద్వారా వివిధ రకాల ఆహారాలు, పానీయాలు తీసుకుంటారు. మీ దంతాలు ఆ పదార్థాలలోని సమ్మేళనాలకు గురికావడమే కాకుండా, వేడి చల్లని అనుభూతులకు గురవుతాయి. దీంతో మీ దంతాలపై మురికిగా మారడమే కాకుండా వాటికి రక్షణ కవచంగా ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. ఫలితంగా దంతాలు చెడిపోవడం, దంతక్షయం, చిగుళ్ళ వాపు మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ఈ రకంగా నోటి ఆరోగ్యం కూడా చెడిపోయి అది అనేక ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది.
మీ దంతాలు దృఢంగా ఉండాలంటే సరైన దంత సంరక్షణ అవసరం. ఇక్కడ నోటి ఆరోగ్యానికి సంబంధించి నిపుణులు అందించిన కొన్ని చిట్కాలను మీకు తెలియజేస్తున్నాం. ఈ చిట్కాలు మీ రోజూవారి దంత సంరక్షణ చర్యలలో భాగంగా ఉంటే అందమైన, ఆరోగ్యమైన దంతాలను కలిగి ఉండవచ్చు.
సరైన విధానంలో బ్రష్ చేయండి
మృదువైన బ్రష్ ను ఉపయోగించి రోజుకు రెండు సార్లు దంతాలను తోముకోవాలని డెంటిస్టులు సిఫారసు చేస్తున్నారు. దంతాలను అన్ని మూలలో బ్రష్ చేయండి, ముఖ్యంగా ఆహారాన్ని నమిలే దంతాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టండి. 45 డిగ్రీల కోణంలో దంతాలను బ్రష్ చేయాలని సూచిస్తున్నారు. అలాగే మీ టూత్ బ్రష్ ను ప్రతీ రెండు నెలలకు ఒకసారి మార్చండి. వివిధ ప్రయోజనాల కోసం ఆమోదించిన మోతాదు కలిగిన ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించండి. ఇందుకోసం లేబుల్ మీద సమాచారం చదవండి.
ఫ్లాస్ చేయండి
బ్రషింగ్‌తో పాటుగా మీ దంతాలను క్రమం తప్పకుండా ఫ్లాస్ చేయండి. దంతాల సందులలో టూత్ బ్రష్ చేరుకోలేదు. అయితే ప్లాసింగ్ చేయడం వలన ఇరుకైన ఖాళీలలో కూడా దంతాలు శుభ్రపడతాయి. బ్రష్ చేయడానికి ముందు లేదా తర్వాత ఎప్పుడైనా, రోజుకు ఒకసారి ఫ్లాస్ చేయండి. ఇది మీ దంతాల మధ్య చిక్కుకున్న సూక్ష్మ ఆహార కణాల కారణంగా చిగుళ్ళు నిరంతరం ఎర్రబడకుండా నిరోధిస్తుంది. కనీసం 18 అంగుళాల పొడవు గల ఫ్లాస్ తీగను ఉపయోగించి దంతాల మధ్య ఖాళీలలో శుభ్రం చేసుకోవాలి. మీకు సున్నితమైన చిగుళ్ళు ఉండి ప్లాసింగ్ చేయడం కష్టంగా ఉంటే వాటర్ గ్లోసర్ ఉపయోగించవచ్చు.
చిగుళ్ళపై ప్రత్యేక శ్రద్ధ
వయస్సు పెరిగే కొద్దీ చిగుళ్ళు క్షీణిస్తూ ఉంటాయి. ఇది దంతాల నష్టానికి దారితీస్తుంది. కాబట్టి చిగుళ్ళపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిగుళ్లను మసాజ్ చేయడం ద్వారా వాటిని బలోపేతం చేయడానికి సహాయపడవచ్చు. ఇందుకోసం మీరు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌ను ఉపయోగించి గమ్ మసాజ్ ఫంక్షన్ ద్వారా మసాజ్ చేయండి లేదా సింపుల్ గా కొద్దిగా కొబ్బరి నూనెను ఉపయోగించి మీ వేళ్లతో మీ చిగుళ్లను సున్నితంగా మసాజ్ చేయవచ్చు.
నోరు పొడిబారటాన్ని నివారించండి
నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గితే నోరు పొడిబారుతుంది. ఇది అనేక నోటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి మీ నోటిని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోండి. నోరు పొడిబారకుండా పుష్కలంగా నీరు త్రాగండి. ధూమపానం, చక్కెర, కెఫిన్ కలిగిన పానీయాలను నివారించండి.
పోషకాహారం తీసుకోండి
ఆకు కూరలు, పండ్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ దంతాలు, చిగుళ్లకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. సరిపడా నీటిని తీసుకోవడం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది. విటమిన్ సి, బి-12, విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోండి.