Winter Morning Routine । చలికాలంలో త్వరగా లేచి, స్నానం చేసేయాలి.. ఎందుకంటే?!
22 November 2022, 7:41 IST
- Winter Morning Routine: చలికాలంలో సమయం త్వరగా గడిచిపోతుంది, పనులకు ఆలస్యం అవుతుంది. ఈ సీజన్ లో ఉదయం మన దినచర్య మార్చుకోవాలి, అందుకు ఇక్కడ చిట్కాలు ఉన్నాయి.
Winter Morning Routine:
శీతాకాలంలో రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది, పగటి సమయం తక్కువ ఉంటుంది. సాయంత్రం 5:30 అవగానే చీకటి అవుతుంది. అదే సమయంలో ఉదయం 8 దాటినా సూర్యుడు కనిపించడం లేదు, తెల్లవారినట్లు అనిపించడం లేదు. కాబట్టి ఇంకా చీకటిగానే ఉంది కదా అని నిద్రలేవరు. దీనికి తోడు చలికూడా ఎక్కువ ఉంటుంది కనుక దుప్పట్లో దూరిపోయి వెచ్చగా నిద్రపోతారు. శీతాకాలంలో ఉదయం లేవడం కంటే, ఎంత సేపైనా పడుకోవడం హాయిగా అనిపిస్తుంది. కానీ ఇలా ఆలస్యంగా నిద్రలేవడం కారణం మన దినచర్య గతి తప్పుతుంది. పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోతాయి.
Winter Morning Routine- శీతాకాలంలో పర్ఫెక్ట్ మార్నింగ్ రొటీన్ కోసం చిట్కాలు
సీజన్ మారినా గడియారంలో సమయం మారదు, అది ఎవరికోసం ఆగదు. కాబట్టి ఈ చలికాలంలో మీ రోజు సరిగ్గా సాగాలంటే, సమయానుసారంగా మీ ఉదయం దినచర్య ఉండాలి. ఇది మీకు కష్టంగా అనిపిస్తే, ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి, వీటిని ఫాలో అవ్వండి.
మీ గదిలోకి కాంతి వచ్చేలా చూడండి
చీకటిగా ఉన్నప్పుడు మీ మెదడుకు ఉదయం అని నమ్మడం కష్టతరం చేస్తుంది. కాబట్టి అది మిమ్మల్ని మేల్కొలిపే సంకేతాలు ఇవ్వదు. ఇందుకోసం మీరు నిద్ర లేవాలనుకున్న సమయానికి వెలుతురు వచ్చేలా చూసుకోండి. కొన్ని గడియారం అలారంలు సూర్యకాంతి లాగే వెలుతురును ప్రసరింపజేస్తాయి. అలారం దూరంగా ఉంచుకుంటే వెంటనే స్నూజ్ చేయలేకపోతాం, సమయానికి నిద్ర లేవగలుగుతాం.
వార్మప్ చేయండి
చలికాలంలో చల్లగా ఉంటుంది కాబట్టి మళ్లీ ముసుగేసుకొని పడుకోవాలనిపిస్తుంది. అలా కాకుండా ఉన్నచోటనే ఒక 10 నిమిషాలు నడవండి, లేదా మెట్లూ దిగడం ఎక్కడం చేయండి. ఇది మీ శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి జీవక్రియలను ప్రారంభింపజేస్తుంది. యోగా లేదా ఇతర వ్యాయామాలను కూడా చేయవచ్చు.
త్వరగా స్నానం చేయండి
చలికాలంలో కఠినమైన వాతావరణం మన చర్మంపై చాలా ప్రభావం చూపుతుంది. మీ చర్మం మరింత పొడిబారకుండా ఉండేందుకు మీరు త్వరగా స్నానం చేయాలి. గీజర్ ఆన్ చేసుకొని గంటలు గంటలు చేయకుండా త్వరగా చల్లటి నీటితోనే చేసేయండి. చలికాలంలో చన్నీళ్ల స్నానం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చన్నీళ్లు వద్దనుకుంటే వేడి నీటితోనే చేయండి, అయితే మీ స్నానాన్ని త్వరగా ముగించండి. ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది.
మాయిశ్చరైజింగ్ మరిచిపోవద్దు
మీరు షవర్ నుండి బయటకు వచ్చిన తర్వాత మాయిశ్చరైజింగ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. శీతాకాలంలో సాధారణంగా మన గది వాతావరణాన్ని వెచ్చగా ఉంచుకుంటాము, అయితే బయట వాతావరణం మాత్రం చల్లగా, కఠినంగా ఉంటుంది. మనం తరచుగా బయటకు వెళ్లడం, లోపలికి రావడం చేత అది చర్మంపై దుష్ప్రభావాలను చూపుతుంది. కాబట్టి బయటకు వెళ్లేటపుడు మాయిశ్చరైజింగ్ చేసుకోవడం మరిచిపోవద్దు. ఇది మీ చర్మాన్ని, హైడ్రేటింగ్‌గా ఆరోగ్యంగా ఉంచుతుంది.
అల్పాహారం చేయండి
ఏ కాలంలో అయినా అల్పాహారం చేయడం మరిచిపోకూడదు. మీరు రాత్రంతా నిద్రపోయి ఏది తినకుండా ఉంటారు, అల్పాహారం చేయకపోతే వ్యవస్థకు శక్తి లభించదు. కాబట్టి మంచి శక్తినిచ్చే పోషక విలువలతో కూడిన అల్పాహారం చేయండి. ఇది మిమ్మల్ని మధ్యాహ్నం వరకు చురుకుగా ఉండేలా చేస్తుంది. కాఫీ- టీలకు బదులు లెమన్ టీ, హెర్బల్ టీలను తాగితే బాడీ డీటాక్స్ అవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.