తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Periods Delay: పీరియడ్స్ రాకపోవడానికి 9 కారణాలు.. చికిత్సతో సమయానికి రుతుచక్రం

Periods delay: పీరియడ్స్ రాకపోవడానికి 9 కారణాలు.. చికిత్సతో సమయానికి రుతుచక్రం

HT Telugu Desk HT Telugu

08 February 2023, 14:31 IST

    • Periods delay reason: పీరియడ్స్ రాకపోవడానికి కారణాలు అనేకం. అయితే ఆయా అనారోగ్య పరిస్థితులు, ఆందోళనలకు ఉపశమనం లభిస్తే తిరిగి సక్రమంగా రుతు చక్రాన్ని పొందవచ్చు. రుతు చక్రంలో ఆలస్యం వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలు కూడా మాయమవుతాయి.
పీరియడ్స్ రాకపోవడానికి 9 కారణాలు (ప్రతీకాత్మక చిత్రం)
పీరియడ్స్ రాకపోవడానికి 9 కారణాలు (ప్రతీకాత్మక చిత్రం) (unsplash)

పీరియడ్స్ రాకపోవడానికి 9 కారణాలు (ప్రతీకాత్మక చిత్రం)

Periods delay reason: పీరియడ్స్ రాకపోవడానికి, ఆలస్యం కావడానికి 9 కారణాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న వారిలో ఇది పెద్దగా ఆందోళన కలిగించదు. కానీ ఇతరత్రా కారణాల వల్ల పీరియడ్స్ రానప్పుడు మహిళల్లో చాలా ఆందోళన నెలకొంటుంది. చాలా మందిలో 28 రోజులకే రుతు చక్రం వస్తుంది. కానీ కొందరిలో ముందుగా లేదా ఆలస్యంగా వస్తుంది. 21 రోజుల నుంచి 40 రోజుల మధ్య పీరియడ్స్ ఎప్పుడైనా రావొచ్చు.

Periods delay: పీరియడ్స్ ఆలస్యం కావడానికి కారణాలేంటి?

పీరియడ్స్ ఆలస్యం కావడానికి విభిన్న కారణాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ రావడం, స్ట్రెస్ ఎదుర్కోవడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, బరువు అధికంగా ఉండడం, గర్భ నిరోధక మాత్రలు వాడడం, వ్యాయామం అధికంగా చేయడం, మెనోపాజ్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) వంటి కారణాల వల్ల పీరియడ్స్ ఆలస్యంగా రావొచ్చు. దీర్ఘకాలికంగా డయాబెటిస్ అదుపులో లేకపోవడం,  హైపర్ థైరాయిడ్, గుండె జబ్బులు, త్వరగా మెనోపాజ్ రావడం వంటి కారణాల వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం అవుతుంటాయి.

1. stress causes periods delay: స్ట్రెస్ వల్ల పీరియడ్స్ ఆలస్యం

మీరు బాగా స్ట్రెస్ ఎదుర్కొంటున్నట్టయితే మీ రుతుక్రమం ఆలస్యంగా లేదా త్వరగా వస్తుంది. లేదా మీ పీరియడ్స్ మొత్తంగా ఆగిపోవచ్చు. లేదా పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనిని నివారించేందుకు స్ట్రెస్ నుంచి ఉపశమనం పొందడమే మార్గం. క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. వాకింగ్, రన్నింగ్, యోగా వంటివి రెగ్యులర్‌గా అలవాటు చేసుకోవాలి. అలాగే శ్వాస సంబంధిత వ్యాయామాలు కూడా స్ట్రెస్ నుంచి ఉపశమనం ఇస్తాయి.

2. అధిక వ్యాయామాల వల్ల పీరియడ్స్ ఆలస్యం

శక్తికి మించిన వ్యాయామాల వల్ల మీ శరీరంలోని హార్మోన్లు ప్రభావితమవుతాయి. అంతిమంగా మీ పీరియడ్స్ ఆలస్యమవడానికి దారి తీస్తుంది. అధిక వ్యాయామాల వల్ల మీరు బరువు కోల్పేతే కూడా హార్మోన్ల ఉత్పత్తి నిలిచిపోతుంది. ఒకవేళ మీరు క్రీడాకారులు అయితే స్పోర్ట్స్ మెడిసిన్‌లో నిపుణులైన వైద్యులను సంప్రదించాలి. 

3. ఆకస్మికంగా బరువు తగ్గడం వల్ల పీరియడ్స్ ఆలస్యం

ఒక్కసారిగా బరువు కోల్పోవడం వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. ఒక్కోసారి పీరియడ్స్ రాకపోవచ్చు. బరువు తగ్గాలని మీరు క్యాలరీలు పూర్తిగా తగ్గించేస్తే ఒవల్యూషన్ కోసం అవసరమయ్యే హార్మోన్ల ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు మీ పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. ఒకవేళ మీరు బరువు చాలా తక్కువగా ఉంటే మీ డైటీషియన్ సంప్రదించి సాధారణ బరువుకు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. 

4. బరువు ఎక్కువగా ఉంటే పీరియడ్స్‌లో జాప్యం

అధిక బరువు ఉన్న వారు కూడా పీరియడ్స్ ఆలస్యంగా రావడం గమనించి ఉంటారు. బరువు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. మహిళల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఈ హార్మోన్ నియంత్రిస్తుంది.

5. గర్భ నిరోధక మాత్రల వల్ల పీరియడ్స్ ఆలస్యం

మీరు తరచుగా గర్భ నిరోధక మాత్రలు (కాంట్రాసెప్టివ్ పిల్స్) తీసుకుంటున్నట్టయితే మీకు తరచుగా పీరియడ్స్ ఆలస్యమవుతుండొచ్చు. దీని వల్ల పెద్ద ఆందోళన అవసరం లేదు. మీరు గర్భ నిరోధక మాత్రలు అపేస్తే మీ పీరియడ్స్ యథావిధిగా రావొచ్చు. రానట్టయితే మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి.

6. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) వల్ల పీరియడ్స్ ఆలస్యం

పాలిసిస్టక్ ఓవరీస్‌లో పెద్దపెద్ద కణకోశాలు పేరుకుపోవచ్చు. ఇవి అండాలు వృద్ధి చెందేందుకు ఉండే సంచుల వంటివి. పీసీఓఎస్ ఉంటే ఈ సంచులు అండాలు విడుదల చేయలేవు. ఒవల్యూషన్ ప్రక్రియ నిలిచిపోతుంది. దీని కారణంగా పీరియడ్స్ నిలిచిపోతాయి. 

7. హైపర్ థైరాయిడ్ వల్ల పీరియడ్స్ ఆలస్యం

హైపర్ థైరాయిడ్ ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి అవసరానికి మించి చురుగ్గా పనిచేస్తుంది. దీని వల్ల అధికంగా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది కూడా మీ పీరియడ్స్ ఆలస్యమయ్యేందుకు కారణమవుతుంది.

8. ప్రెగ్నెన్సీ వల్ల పీరియడ్స్ మిస్ అవుతాయి..

గర్భం ధరించినప్పుడు పీరియడ్స్ రావు. ఒకవేళ మీరు రుతు స్రావానికి 10 నుంచి 20 రోజుల ముందు సెక్స్‌లో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పీరియడ్స్ ఆగిపోతాయి. ఒక్కోసారి మీరు గర్భ నిరోధక మాత్రలు వాడినప్పటికీ అవి విఫలమైనప్పుడు గర్భధారణ జరిగే అవకాశం ఉంటుంది. పీరియడ్స్ మిస్ అయిన ఓ వారం రోజులకు మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే మీరు ప్రెగ్నెంటో కాదో తెలిసిపోతుంది. 

9. మెనోపాజ్ వల్ల పీరియడ్స్ నిలిచిపోతాయి..

మెనోపాజ్ దశకు చేరుకోగానే మీకు పీరియడ్స్ ఆలస్యం అవడం, లేదా పూర్తిగా నిలిచిపోవడం గమనిస్తారు. ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గిపోవడం, ఒవల్యూషన్ ప్రక్రియ తగ్గిపోవడం కనిపిస్తుంది. మీకు పీరియడ్స్ పూర్తిగా నిలిచిపోయాయంటే మెనోపాజ్ దశ వచ్చినట్టు లెక్క. సాధారణంగా 45 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సులో ఈ దశ వస్తుంది. నూటికి ఒకరిలో 40 ఏళ్లకే మెనోపాజ్ దశ వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే ప్రిమెచ్చూర్ మెనోపాజ్ అంటారు.

మీరు 45 ఏళ్ల లోపు ఉండి పీరియడ్స్‌లో జాప్యాన్ని ఎదుర్కొంటున్నట్టయితే ముందుగా ఆందోళన నుంచి ఉపశమనం పొందాలి. అనారోగ్యాలకు చికిత్స తీసుకోవాలి. సందేహం ఉంటే గైనకాలజిస్ట్‌ను లేదా ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించాలి.