Tips for high-pressure exams: పోటీ పరీక్షలకు హాజరవుతున్నారా? ఈ 8 టిప్స్ మీకోసం
30 January 2023, 12:31 IST
- Tips for high-pressure exams: బోర్డ్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షలు మానసిక ఒత్తిడికి కారణమవుతాయి. ఇలాంటప్పుడు అనుసరించాల్సిన వాటిపై మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి 8 టిప్స్ మీకోసం..
8 tips on sound mental health of students preparing for high-pressure exams
ఏటా పరీక్షలకు ముందు పిల్లలు విపరీతమైన యాంగ్జైటీ, స్ట్రెస్‌కు లోనవతున్నారని మానసిక ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తుపై అనిశ్చితి, సుదీర్ఘ సమయం ప్రిపరేషన్‌లో నిమగ్నమవడం వంటి కారణాల వల్ల ఈ ఆందోళన ఎదురవుతోందని చెప్పారు. ఈ సమయంలో వీరికి తగిన కౌన్సెలింగ్, స్ట్రెస్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఆహారం, ఔషధాలు అవసరమని వారు సూచిస్తున్నారు.
విద్యార్థులు బోర్డ్ ఎగ్జామ్స్, కాంపిటీటివ్ ఎదుర్కోవడానికి ముందు యాంగ్జైటీ అనే తీవ్రమైన మానసిక అనారోగ్యానికి గురవుతున్నారని, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల అవాస్తవిక ఆకాంక్షలే విద్యార్థుల్లో ఈ యాంగ్జైటీకి కారణమవుతున్నాయని వివరించారు. ఔట్‌స్టాండింగ్ గ్రేడ్స్ సాధిస్తేనే సక్సెస్ సాధించినట్టు తల్లిదండ్రులు, సమాజం విశ్వసిస్తుండడం విద్యార్థి యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్‌కు గురి కావడానికి కారణమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
కఠినమైనవి, టార్గెట్ ఓరియెంటెడ్‌గా ఉండే పోటీ పరీక్షలకు విద్యార్థి హాజరవుతున్నప్పుడు వారు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటారని వివరించారు. మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసిన వారిలో 72.2 శాతం మంది అభ్యర్థులు అధికమైన ఒత్తిడి ఎదుర్కొన్నారని, దైనందిన జీవితంపై కూడా అది ప్రభావం చూపిందని, ఏకాగ్రత దెబ్బతిన్నందని ఇటీవలి ఒక సర్వేలో తేలింది.
సీనియర్ సైక్రియాట్రిస్ట్ డాక్టర్ జ్యోతికపూర్ ఇటీవల హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. చాలా మంది విద్యార్థులు తమ మానసిక ఆరోగ్యం గురించి మానసిక ఆరోగ్య నిపుణుడితోగా గానీ, వారి పేరెంట్స్‌తో గానీ, తోటి వారితోగానీ మాట్లాడరు. తగినంత విశ్రాంతి లభించదు. రోజులో ఎక్కువ భాగం ప్రిపేర్ అవుతూనే ఉంటారు. ఫెయిలవుతామన్న భయం, తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వారి పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. పైగా ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం పడుతుంది. పరీక్షల కోసం విద్యార్థులు తమ జీవితంలోని ఇతర ఆనంద క్షణాలను త్యాగం చేయాల్సి వస్తుంది.
అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం మన మెదడుకు కూడా తగిన విశ్రాంతి అవసరం. అది రోజులో 24 గంటలూ పనిచేయడం సాధ్యం కాదు. ఇక పరీక్షలు తమ అంచనాలకు అనుగుణంగా సాగనప్పుడు ఒత్తిడి మరింత తీవ్రమవుతుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది. ఒత్తిడి మరింతగా పెరుగుతుంది.
‘పటిష్టమైన మానసిక ఆరోగ్యానికి అనేక కారకాలు దోహదపడుతాయి. ఇందులో ఎమెషనల్ సపోర్ట్ ముఖ్యమైనది. ఈ సపోర్ట్ ఉంటే వారి మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. చాలా మంది పిల్లలు పరీక్షల సమయంలో వారి తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులతో కలిసి ఉన్నా వారితో ఇంటరాక్షన్ ఉండదు. పరీక్షల సమయంలో ఒత్తిడి వాతావరణంలో ఎమెషనల్ సపోర్ట్ లేనప్పుడు విద్యార్థులు ఒంటరితనం ఫీలవుతారు. కొందరు ఆ ఒత్తిడి నుంచి బయటపడేందుకు అనారోగ్యకరమైన అలవాట్లకు దగ్గరవుతారు. అధికంగా తినడం, గ్యాంబ్లింగ్, మద్యం తాగడం, బలవంతంగా సెక్స్‌లో పాల్గొనడం, నెట్ బ్రౌజింగ్, స్మోకింగ్, మత్తు పదార్థాల వినియోగం వంటి వ్యసనాలకు దగ్గరవుతారు..’ అని వివరించారు.
వైఫల్యాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా లేకపోవడం గురించి సైక్రియాటిస్ట్ మాట్లాడుతూ ‘మనం వైఫల్యం ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండడం ఎలాగో మన విద్యా వ్యవస్థ మనకు నేర్పదు. ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బీ ఎలా ఉండాలో మనకు ఎవరూ చెప్పరు. అందువల్లే తాను ఫెయిలైనప్పుడు ఈ ప్రపంచమే అంతమైనట్టు విద్యార్థి ఫీలవుతాడు. మానసికంగా, శారీరకంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాడు. నిజానికి చాలా కేసుల్లో సదరు పోటీ పరీక్షలకు హాజరవ్వాలని వారికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల ఒత్తిడి, సామాజిక ఒత్తిడి వల్ల అటెండ్ అవుతారు. వారికి ఎక్స్‌ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌కు, ఇతరులతో కలిసేందుకు, ఆటలు ఆడేందుకు సమయమే దొరకదు. దీంతో వారి వ్యక్తిత్వ వికాసం దెబ్బతింటుంది..’ అని వివరించారు. విద్యార్థులు తీవ్రమైన పోటీ పరీక్షలు ఎదుర్కొనేటప్పుడు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనానికి అనుసరించాల్సిన టిప్స్ ఆమె వివరించారు.
విద్యార్థులు పోటీ పరీక్షలు ఎదుర్కొనేటప్పుడు అనుసరించాల్సిన టిప్స్
- మీ శరీరం, మనస్సు పనితీరు మెరుగుపడేలా ఒక షెడ్యూలు రూపొందించాలి.
- మీ శరీరానికి, మనస్సుకు ఉల్లాసం కలిగేలా తగిన బ్రేక్ ఇవ్వాలి. ప్రతి ఒకటి రెండు గంటలకు 15 నుంచి 20 నిమిషాల పాటు షార్ట్ బ్రేక్ ఇవ్వాలి. ఇది మీరు తిరిగి పుంజుకునేందుకు టానిక్‌లా పనిచేస్తుంది.
- సమతుల ఆహారం తీసుకుంటూ రోజుకు కనీసం 8 గంటలపాటు నిద్ర పోవాలి.
- సుదీర్ఘ సమయం చదువుకునేందుకు కేటాయిస్తే వ్యాయామానికి సమయం దొరకదు. దీంతో మీ శరీరం బద్ధకంగా మారుతుంది. మీ మెదడు ప్రతికూలంగా స్పందిస్తుంది. అందువల్ల శారీరకంగా చురుగ్గా ఉండాలి.
- మీ అవసరాలకు తగినట్టుగా మీరు ప్రశాంతత అనుభవించేందుకు తగిన వ్యాయామాన్ని ఎంచుకోండి. ఆరుబయట నడవడం వల్ల కూడా ఇది సాధ్యపడవచ్చు.
- చదువు, ఆరోగ్యం మధ్య బ్యాలెన్స్ కోసం ప్రయత్నించండి.
- ఎమోషనల్ సపోర్ట్ కోసం తరచుగా మీకు ఇష్టమైన వారితో మాట్లాడుతూ ఉండండి.
- అవాస్తవిక అంచనాలు, ఆకాంక్షలకు దూరంగా ఉండండి.