తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alcohol Cardiomyopathy । ప్రతీ వీకెండ్ ఆల్కాహాల్ తాగేవారికి 'హార్ట్ ఫెయిల్యూర్' అయ్యే వార్త !

Alcohol Cardiomyopathy । ప్రతీ వీకెండ్ ఆల్కాహాల్ తాగేవారికి 'హార్ట్ ఫెయిల్యూర్' అయ్యే వార్త !

HT Telugu Desk HT Telugu

25 January 2023, 12:48 IST

google News
    • Alcohol Cardiomyopathy: మీరు వారానికి 3 నుంచి 7 పెగ్గుల అల్కాహాల్ సేవిస్తున్నారా, అయితే తస్మాత్ జాగ్రత్త. మద్యపానం వలన మీ కాలేయం మాత్రమే కాదు, గుండె చెడిపోతుంది. ఆల్కహాలిక్ కార్డియోమయోపతి గురించి తెలుసుకోండి.
Alcohol Cardiomyopathy
Alcohol Cardiomyopathy (Unsplash)

Alcohol Cardiomyopathy

చాలా మందికి మద్యపానం అంటే ప్రాణం. తిండి ఉన్నా, లేకపోయినా రోజూ తాగడానికి మద్యం ఉంటే చాలని చాలా మంది మందుబాబులు భావిస్తారు. కానీ, మద్యపానంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అర్థం చేసుకోరు. అతిగా మద్యం సేవిస్తే కాలేయం చెడిపోతుందని చాలా మంది వినే ఉంటారు, కానీ ఈ మద్యపానం గుండె జబ్బులను కూడా కలిగిస్తుందని తెలుసా?

ఆల్కహాలిక్ కార్డియోమయోపతి (ACM) అనేది దీర్ఘకాలిక మద్యపానం వల్ల కలిగే ఒక గుండె జబ్బు. ఇది గుండె పనితీరును అస్తవ్యస్థం చేస్తుంది, అంతేకాకుండా గుండెను బలహీనంగా మారుస్తుంది. ఫలితంగా హృదయ స్పందనలు లయబద్ధంగా ఉండవు, రక్తం సరిగా పంపింగ్ జరగదు, ఇది చివరికు గుండె వైఫల్యానికి దారితీసి ప్రాణాలను కూడా తీయవచ్చు.

ఈ ఆల్కహాలిక్ కార్డియోమయోపతి పరిస్థితి తలెత్తడానికి ప్రధాన కారణం దీర్ఘకాలికంగా అతిగా మద్యం సేవించడం. మీరు అధికంగా ఆల్కాహాల్ సేవించే వారి జాబితాలో ఉంటే ఈ ఆల్కహాలిక్ కార్డియోమయోపతి గురించి మరింత క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకోండి.

What is Alcohol Cardiomyopathy - ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటే ఏమిటి?

ఆల్కహాల్ కార్డియోమయోపతి అనేది గుండె కండరాల వ్యాధి. ఇది గుండెలోనే అభివృద్ధి చెందుతుంది, దీనివల్ల గుండె కండరాలు అసాధారణంగా పెరుగుతాయి. అవి క్రమరహిత హృదయ స్పందనలను కలిగిస్తాయి, రక్తప్రసరణలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ పరిస్థితి సాధారణంగా 35 నుండి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో నిర్ధారణ అవుతుంది . స్త్రీల కంటే పురుషులు ఈ వ్యాధి బారినపడతారు. ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకున్నప్పుడు అది అధిక రక్తపోటును కలిగిస్తుంది. హైపర్‌టెన్షన్‌ను చికిత్స చేయకుండా వదిలేస్తే, అది గుండె వైఫల్యానికి దారి తీస్తుంది.

ఆల్కాహాల్ ఎంత మోతాదు మించకూడదు?

5 నుండి 15 సంవత్సరాలుగా లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి ఆల్కహాల్ సేవిస్తున్న వ్యక్తులు ఆల్కహాలిక్ కార్డియోమయోపతికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పురుషులు రోజుకు 4 పెగ్గులు లేదా వారానికి 14 కంటే ఎక్కువ పెగ్గులు తీసుకుంటే ఈ ఏసీఎం రావచ్చు. స్త్రీల విషయంలో, రోజుకు మూడు పెగ్గులు లేదా వారానికి 7 పెగ్గులు తీసుకుంటే అధిక మద్యపాన వర్గంలోకి వస్తారు. ఈ అలవాటు ఆల్కహాలిక్ కార్డియోమయోపతికి దారితీస్తుంది. అయితే ఎంత మోతాదులో ఆల్కాహాల్ తీసుకోవడం ఎక్కువ అనేది కచ్చితంగా చెప్పలేం. ఇది వ్యక్తికి వ్యక్తికి మధ్య కూడా మారుతుండవచ్చు.

ఇది వరకే గుండె జబ్బులు, రక్తపోటు, ఊబకాయం, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నవారికి, గర్భధారణ సమస్యలు ఉన్నవారికి, డ్రగ్స్ వినియోగం ఉన్న వారికి ఈ పరిస్థితి మరింత ప్రమాదకరం.

ఆల్కహాలిక్ కార్డియోమయోపతి లక్షణాలు ఏమిటి?

ఆల్కహాలిక్ కార్డియోమయోపతి వ్యాధి ముదిరే వరకు ఎటువంటి సంకేతాలు లేదా లక్షణాలను చూపించదు. అయినప్పటికీ, కొంతమందికి కొన్ని లక్షణాలు బయటపడతాయి. అవేమిటంటే..

- నిరంతరం అలసటగా అనిపించడం, విశ్రాంతి లేనట్లుగా ఉండటం, బలహీనత

- ఏదైనా పనిచేస్తున్నప్పుడు శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు

- కాళ్లు, పాదాలు, చీలమండల వాపు

- ఆకలి లేకపోవడం, మూత్రంలో మార్పులు

- ఏకాగ్రత లోపించడం, మైకము, మూర్ఛ

- దగ్గినప్పుడు గులాబీ రంగు శ్లేష్మం ఉత్సర్గ, పడుకున్నప్పుడు దగ్గు

- కడుపు ఉబ్బరం, ఛాతీలో నొప్పి, నాడీ వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉండవచ్చు.

ఆల్కహాలిక్ కార్డియోమయోపతి నివారణ, చికిత్స

మద్యంపానం, ధూమపానం పూర్తిగా మానేయాలి, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి, ఇందుకోసం ఉప్పు తక్కువ తినాలి.

చక్కెర, సంతృప్త కొవ్వులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోకూడదు.

ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి ఇందుకోసం యోగా, ధ్యానం వంటివి చేయాలి.

కఠినమైన వ్యాయామాలు చేయకూడదు, మితమైన నడక, తేలికైన వ్యాయామాలను ఎంచుకోవాలి.

వైద్యులను సంప్రదించాలి. ఈ రకంగా నివారించవచ్చు.

ఏసీఎం ముదిరితే గుండెకు సర్జరీ లేదా గుండె మార్పిడి చేయాల్సి రావడం మొదలైన ఆప్షన్లను పరిస్థితిని బట్టి వైద్యులు నిర్ణయిస్తారు.

తదుపరి వ్యాసం