Dengue Home Remedy : ఈ ఆకులతో డెంగ్యూని దూరం చేయవచ్చట..
06 September 2022, 9:54 IST
- Dengue Home Remedy : ప్రస్తుతం డెంగ్యూ అందరిని భయపెడుతుంది. దోమలు పెరిగిపోతుండటంతో.. డెంగ్యూ వ్యాప్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే దీని లక్షణాలు మొదట్లో సాధారణంగా ఫ్లూ లాగా ఉంటాయి. అయితే డెంగ్యూ కూడా హెమరేజిక్ ఫీవర్‌గా మారుతుంది. ఇది ప్రాణాపాయ స్థితికి దారి తీస్తుంది. ఇలాంటి దశలో దానిని గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలి అంటున్నారు.
డెంగ్యూ నివారణ మార్గాలు
Dengue Home Remedy : సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. డెంగ్యూ ఒక తీవ్రమైన వ్యాధి. డెంగ్యూ వైరస్ సోకిన ఏడిస్ జాతి దోమలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి ప్రజలకు వ్యాపిస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది.. డెంగ్యూ ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2019లో 2,05,243 కేసులు నమోదు కాగా.. 2021లో 1,64,103 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలిపారు.
ఇదిలా ఉండగా.. భారత్‌లో డెంగ్యూ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. అయితే ఎవరైనా దోమల ద్వారా సంక్రమించే ఈ వైరల్ వ్యాధి బారిన పడవచ్చు. డెంగ్యూ లక్షణాలు 3-14 రోజుల వరకు ఉంటాయి. కానీ దాని రికవరీ ప్రక్రియను సహజ గృహ నివారణలతో వేగవంతం చేయవచ్చు. రికవరీ సమయంలో ఉపయోగపడే కొన్ని సులభంగా లభించే గృహోపకరణాలు ఇక్కడ ఉన్నాయి.
బొప్పాయి ఆకులు
NCBI నివేదిక ప్రకారం.. డెంగ్యూ సంక్రమణతో పోరాడటానికి బొప్పాయి ఆకులు ఉత్తమమైన, అత్యంత ప్రభావవంతమైన సహజ నివారణలలో ఒకటిగా పరిగణించాయి. ఈ హోం రెమెడీ చేయడానికి.. బొప్పాయి ఆకులను కడిగి.. ఒక గిన్నెలో కట్ చేసి.. దానికి ఒక గ్లాసు నీరు కలపండి. గ్రైండ్ చేయాలి. సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని వడపోసి తాగాలి. ఇది ప్లేట్‌లెట్ కౌంట్, మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా సహాయపడుతుంది.
మెంతి ఆకులు
మెంతికూరలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటిపైరేటిక్ లక్షణాలు డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మెంతి ఆకుల నీరు డెంగ్యూ జ్వరానికి మేలు చేస్తుంది. దీన్ని తయారు చేయడానికి.. ఒక చెంచా ఎండిన మెంతి ఆకులను నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత మెంతి నీటిని వడపోసి టీగా తాగండి.
వేప ఆకులు
వేప ఆకులు రక్త ప్లేట్‌లెట్లను, తెల్ల రక్త కణాల ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి పని చేస్తాయి. ఈ మొక్కలో నింబిన్, నింబిడిన్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ పైరెటిక్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీన్ని తాగలంటే.. ఒక కప్పు నీటిలో వేప ఆకులను ఉడకబెట్టండి. ఈ నీటిని ఫిల్టర్ చేసి.. గోరువెచ్చగా అయిన తర్వాత.. దానికి తేనె కలిపి తాగండి.
తులసి ఆకులు
తులసి ఆకులలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇవి డెంగ్యూ వైరస్‌ను చంపడంలో సహాయపడతాయి. దీని ఆకులను తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంది. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
బార్లీ గడ్డి
బార్లీ గడ్డి రక్తపు ప్లేట్‌లెట్ల సంఖ్యను వేగంగా పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. డెంగ్యూలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గడం ఆందోళన కలిగించే విషయం కాబట్టి.. బార్లీ గడ్డి వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు దీన్ని నేరుగా లేదా టీగా తీసుకోవచ్చు.
ఈ కథనం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఔషధం లేదా చికిత్సకు ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. వీటిని సేవించే ముందు.. మీ వైద్యుడిని సంప్రదించండి.