African swine fever: ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్.. 2 వారాల్లో 2 వేల పందుల మృతి
29 August 2022, 10:13 IST
- African swine fever: ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా రెండు వారాల్లో దాదాపు 2 వేల పందులు మృతి చెందాయి.
స్వైన్ ఫీవర్ కారణంగా మరణిస్తున్న పందులు (ప్రతీకాత్మక చిత్రం)
రేవా, ఆగస్టు 29: మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలో రెండు వారాల వ్యవధిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా 2,000 కంటే ఎక్కువ పందులు చనిపోయాయని, ఈనేపథ్యంలో నిషేధ ఉత్తర్వులు జారీ చేసినట్టు సంబంధిత అధికారి తెలిపారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 144 ప్రకారం పందుల రవాణా, కొనుగోలు, అమ్మకాలు, వాటి మాంసం అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ మనోజ్ పుష్ప్ తెలిపారు. యానిమల్ డిసీజ్ యాక్ట్ 2009 పరిధిలో ఈ ఉత్తర్వులు జారీచేశారు.
కాగా భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD) నమూనాలు పరీక్షించి రేవా మున్సిపల్ పరిధిలోని పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌ని గుర్తించింది.
రేవాలోని పందులు రెండు వారాల క్రితమే చనిపోవడం ప్రారంభించాయని, ఆ తర్వాత పశుసంవర్ధక శాఖ నమూనాలను ప్రయోగశాలకు పంపిందని తెలిపింది.
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ రెవా నగరంలోనే రెండు వారాల వ్యవధిలో 2,000 కంటే ఎక్కువ పందుల ప్రాణాలను బలిగొందని అధికారులు తెలిపారు. స్థానిక మున్సిపల్ అధికారుల బృందాలు పందుల మృతదేహాలను తొలగిస్తున్నాయని వారు తెలిపారు.
నగరంలో 25 వేలకు పైగా పందులు ఉన్నాయని, వాటిలో అత్యధికంగా వ్యాధి సోకిన జంతువులు వార్డు 15లో ఉన్నాయని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ మిశ్రా తెలిపారు.
బాధిత ప్రాంతాలను రెడ్ జోన్‌గా గుర్తించడం ద్వారా ఒక కిలోమీటరు పరిధిలోని అన్ని పందులను పరీక్షించడంతోపాటు ఆరోగ్యవంతమైన జంతువులకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లు తెలిపారు.
కాగా గత కొంతకాలంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తరచూ స్వైన్ ఫీవర్ కారణంగా పందులు మృతి చెందుతున్న వార్తలు వస్తున్నాయి.