Salt and Skin: ఉప్పు తగ్గించకపోతే తామర వచ్చే అవకాశం ఎక్కువ, చర్మ సౌందర్య కోసం సాల్ట్‌ని తగ్గించాల్సిందే
12 June 2024, 10:30 IST
Salt and Skin: చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారంలో ఉప్పును చాలా వరకు తగ్గించాలి. అలాగే తామర వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశాన్ని కూడా ఉప్పు పెంచుతుంది. ఉప్పు వల్ల చర్మంలో ఇన్ ఫ్లమ్మేషన్ పెంచుతుంది.
ఉప్పుతో చర్మ సమస్యలు
Salt and Skin: మన శరీరానికి ఉప్పు అవసరమే. కానీ మోతాదుకు మించి ఉప్పు తినడం ద్వారా ఎన్నో వ్యాధులను తెచ్చిపెట్టుకుంటున్నారు ప్రజలు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఉప్పు ద్వారా సాధారణంగా తీసుకునే స్థాయి కన్నా ఎక్కువ సోడియం శరీరంలో చేరుతుంది. ఇలా ఉప్పును అధికంగా తినడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుందని కొత్త అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా తామర వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతోంది. చర్మం పొడిగా మార్చి, దురద వచ్చేలా చేస్తుంది.
గత అధ్యయనాలలో చర్మంపై సోడియం ప్రభావం ఉంటుందని తేలింది. కొన్ని రకలా వ్యాధులు కూడా వస్తాయని తెలిసింది. కొత్త అధ్యయనం కూడా ఇప్పుడు అదే విషయాన్ని నిర్ధారించింది. ముఖ్యంగా తామర వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని చెబుతోంది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ , నిల్వ పచ్చళ్లలో అధిక సోడియం ఉంటుంది. ఇది తినే వారిలో తామర వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
రోజువారీగా మన శరీరానికి కావాల్సిన సోడియం కంటే అదనంగా గ్రాము సోడియం తినడం వల్ల తామర వచ్చే అవకాశం 22 శాతం పెరుగుతుందని కొత్త అధ్యయనం కనుగొంది. ఒక గ్రాము సోడియం సుమారు అర టీస్పూన్ టేబుల్ ఉప్పులో లేదా ఒక పిజ్జా, బర్గర్, హాంబర్గర్లో ఉన్న ఉప్పుతో సమానం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకు రెండు గ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోమని చెబుతోంది. యుకె యొక్క నేషనల్ హెల్త్ సర్వీస్ రోజుకు 2.3 గ్రాములు వరకు తీసుకోవచ్చని చెబుతోంది. అయితే ప్రస్తుతం ఒక్కో మనిషి అవసరమైన దానికన్నా రెండు మూడు రెట్లు అధికంగా ఉప్పును తింటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఉప్పును ఎంత తక్కువగా తీసుకుంటే తామర వంటి చర్మ రోగాలు వచ్చే అవకాశం అంతగా తగ్గుతుందని అధ్యయనకర్తలు చెబుతున్నారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (జామా) డెర్మటాలజీ జర్నల్లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.
తామర వంటి చర్మం సమస్యలు వచ్చినప్పుడు చర్మం విపరీతంగా దురద పెడుతుంది. మంటగా అనిపిస్తుంది. వాటిని తట్టుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. కొత్త అధ్యయనం కోసం 30 ఏళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న రెండు లక్షల మందిని ఎంపిక చేసుకుంటారు. వారి డేటాను సేకరించారు. వారు ఎంత ఉప్పు తింటారో తెలుసుకున్నారు. మూత నమూనాలను సేకరించి పరిశీలించారు. ఆ నమూనాలను విశ్లేషించారు. ఈ పరిశోధనలో ఎవరైతే అధికంగా ఉప్పును తింటున్నారో వారిలో చర్మ సమస్యలు వచ్చే అవకాశం 22 శాతం అధికంగా ఉన్నట్టు గుర్తించారు.
చర్మం యవ్వనంగా, అందంగా మెరిసిపోవాంటే కచ్చితంగా రోజువారీ తీసుకోవాల్సిన ఉప్పును తగ్గించాల్సిందేనని అధ్యయనకర్తలు చెబుతున్నారు. చర్మంపై గీతలు, ముడతలు రాకుండా ఏజింగ్ లక్షణాలు తగ్గుతాయని కూడా వారు వివరిస్తున్నారు.
టాపిక్