తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dosakaya Mutton Curry: దోసకాయ మటన్ కర్రీ ఒక్కసారి వండి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలానే వండుతారు, రెసిపీ అదిరిపోతుంది

Dosakaya Mutton Curry: దోసకాయ మటన్ కర్రీ ఒక్కసారి వండి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలానే వండుతారు, రెసిపీ అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu

09 March 2024, 18:15 IST

google News
    • Dosakaya Mutton Curry: మటన్ కర్రీ ఇష్టపడేవారు ఒకసారి దోసకాయతో మటన్ కర్రీని కలిపి వండండి. ఈ కర్రీ రెసిపీ చాలా సులువు. టేస్ట్ కూడా అదిరిపోతుంది.
దోసకాయ మటన్ కర్రీ రెసిపీ
దోసకాయ మటన్ కర్రీ రెసిపీ (youtube)

దోసకాయ మటన్ కర్రీ రెసిపీ

Dosakaya Mutton Curry: మటన్ కర్రీ అంటే ఎంతో మందికి ఇష్టం. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులు కచ్చితంగా తినే వాటిలో మటన్ కర్రీ ఒకటి. మటన్ కర్రీ, మటన్ బిర్యానీ, మటన్ వేపుడు... ఇలా మటన్ రెసిపీలు ఎన్నో. ఎప్పుడు ఒకేలా తినే కన్నా ఒకసారి కొత్తగా దోసకాయ మటన్ కర్రీ ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఈ కూరను వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు.

దోసకాయ మటన్ కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మటన్ - అరకిలో

దోసకాయ - ఒకటి

టమోటో - ఒకటి

పచ్చిమిర్చి - మూడు

ఉల్లిపాయ - ఒకటి

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కారం - ఒక స్పూన్

పసుపు - అర స్పూను

కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు

గరం మసాలా - అర స్పూను

నూనె - నాలుగు స్పూన్లు

నీళ్లు - సరిపడినన్ని

జీలకర్ర పొడి - అర స్పూను

ధనియాల పొడి - అర స్పూను

దోసకాయ మటన్ కర్రీ రెసిపీ

1. మటన్ ముక్కలు చిన్నగా కోసుకొని ఒక గిన్నెలో వేయాలి.

2. వాటిని శుభ్రంగా కడిగి పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టాలి.

3. ఇప్పుడు ఒక్క కుక్కర్లో ఈ మటన్ ముక్కలను వేసి నీళ్లు వేసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

4. ఈలోపు దోసకాయ పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. విత్తనాలన్నీ ఏరి పడేయాలి.

5. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేసుకోవాలి.

6. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి.

7. ఉల్లిపాయలు రంగు మారేవరకు వేయించాలి.

8. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి కలుపుకోవాలి.

9. ఇవి వేగుతున్నప్పుడే మంచి వాసన వస్తుంది. అప్పుడే పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి.

10. ఇప్పుడు కుక్కర్ మూత తీసి మటన్ ముక్కలు కూడా ఈ మిశ్రమంలో వేయాలి.

11. పైన మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి.

12. కాసేపటి తర్వాత మూత తీసి సన్నగా తరిగిన దోసకాయ ముక్కలను వేసి ఉడికించుకోవాలి.

13. అందులోనే టమాటో ముక్కలను కూడా వేయాలి.

14. రుచికి సరిపడా ఉప్పును వేసి చిన్న మంట మీద పెట్టి మూత పెట్టాలి.

15. 20 నిమిషాలు ఉడికిస్తే దోసకాయ, టమాటో, మటన్ మెత్తగా ఉడుకుతాయి.

16. తర్వాత మూత తీసి జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా కలపాలి.

17. అర గ్లాసు నీళ్లు వేసి మళ్లీ మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించాలి.

18. తర్వాత మూత తీస్తే అది ఇగురులాగా దగ్గరగా అవుతుంది.

19. పైన కొత్తిమీరను చల్లుకొని స్టవ్ కట్టేయాలి. అంతే దోసకాయ మటన్ కర్రీ రెడీ అయినట్టే.

20. వేడి అన్నంలో ఈ కూరను కలుపుకొని చూడండి. రుచి అదిరిపోతుంది.

దోసకాయలో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా హై బీపీతో బాధపడుతున్న వారు కచ్చితంగా తినాల్సిన కూరగాయల్లో దోసకాయ ఒకటి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ మెదుడుకు సహకరిస్తాయి. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి. కాబట్టి దోసకాయను తినడం వల్ల అంతా ఆరోగ్యకరమే. కంటి ఆరోగ్యాన్ని కాపాడడానికి దోసకాయ ఉత్తమంగా పనిచేస్తుంది. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఒమేగా6 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అవసరమైనవి.

ఇక మటన్ తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీలు మితంగా మటన్ తింటే గర్భంలోని శిశువుకు ఎలాంటి న్యూరల్ ట్యూబ్ సమస్యలు రాకుండా ఉంటాయి. వారానికి కనీసం రెండుసార్లు మితంగా మటన్ తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. దోసకాయ మటన్ కలిపి వండితే పోషకాలు రెండింతలుగా శరీరానికి అందుతాయి.

తదుపరి వ్యాసం