Fan Side Effects : ఫ్యాన్ దగ్గర పెట్టుకుని పడుకోకండి.. అనేక ఆరోగ్య సమస్యలు
24 February 2024, 13:30 IST
- Fan Side Effects : ఫ్యాన్ లేకుండా నిద్ర పోవడం అంటే పెద్ద యుద్ధం చేయాల్సిందే. కానీ ఫ్యాన్ గాలికి ఎక్కువగా నిద్రిస్తే మాత్రం సమస్యలు తప్పవని చెబుతున్నాయి అధ్యయనాలు.
ఫ్యాన్ దగ్గర పెట్టుకుని నిద్రిస్తే వచ్చే సమస్యలు
ఎలక్ట్రిక్ ఫ్యాన్‌లు లేనిది ఈ కాలంలో ఎవరూ నిద్రించడం లేదు. కానీ ఈ ఫ్యాన్ గాలి కింద ఎక్కువగా నిద్రిస్తే సమస్యలు వస్తాయి. ఈ ఫ్యాన్ రెక్కలపై దుమ్ము చేరడం వల్ల సులభంగా అలెర్జీ ప్రతిచర్యలకు గురవుతారు. ఎండ వేడిమిని తట్టుకోలేక చాలా మంది విద్యుత్ ఫ్యాన్లు వాడుతున్నారు. ఇది వేడిని తగ్గించి శరీరానికి విశ్రాంతినిస్తుంది. అదే సమయంలో చాలా దగ్గరగా ఉంచి నిద్రించే వ్యక్తులు కొన్ని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటారు. ఫ్యాన్‌పై మురికి పేరుకుపోవడం కూడా ఇందుకు కారణం. సరిగ్గా శుభ్రం చేయని ఫ్యాన్ మురికితో ఉంటుంది. ఈ కారణంగా కొన్ని ప్రతికూల ప్రభావాలను చూడాల్సి వస్తుంది.
ఫ్యాన్.. వేడిని తగ్గించి గాలిని అందించడమే కాకుండా మన నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. తెరిచి ఉన్న కిటికీ నుండి లేదా ఫ్యాన్ నుండి వచ్చే చల్లని గాలి చాలా హాయిగా ఉంటుంది. ఫ్యాన్ ప్రయోజనాల్లో ఒకటి ఏంటంటే.. చాలా మంది ఫ్యాన్ సౌండ్ ఉంటేనే నిద్రపోతారు. కొందరికి ఫ్యాన్ శబ్ధం హమ్మింగ్‌లాగా అనిపిస్తుంది. ఈ ధ్వనితో జనాలు సులభంగా నిద్రపోతారు. అయితే దూరంగా ఫ్యాన్ పెట్టుకుని పడుకోవడం మంచిది. ఫ్యాన్ దగ్గరగా పెట్టుకుని పడుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి.
మీరు మేల్కొన్నప్పుడు మీ కండరాలు పొడిగా ఉన్నట్లు అవుతుందా..? అయితే మీకు చాలా దగ్గరగా ఫ్యాన్ ఉందని అర్థం. కాస్త దూరంగా మీ ఫ్యాన్‌ను పెట్టి పడుకోవడానికి ప్రయత్నించండి. మీ కండరాలు లేదా శరీరంలోని ఒక నిర్దిష్ట భాగంలో బిగుతుగా, పొడిబారడం అనేది శరీరంలోని నిర్దిష్ట భాగాన్ని చల్లటి గాలి తాకడం వల్ల వస్తుంది. ఆ ప్రాంతంలోని కండరాలు బిగుతుగా, ఇబ్బందిగా మారుతాయి.
సాధారణంగా ఫ్యాన్‌ని ముఖానికి దగ్గరగా పెట్టుకుని పడుకునే వారికి ముఖం, మెడ నొప్పి వస్తుంది. ఉదయం పూట మీ మెడ బిగుసుకుపోయినట్లు అనిపిస్తే ఆ ప్రాంతంలో రాత్రంతా గాలి వీస్తూ ఉండటాన్ని గమనించవచ్చు. మీ శరీరం లోపలి భాగం ప్రభావితం కానప్పటికీ, మీ శరీరం పై భాగం కొంత నష్టాన్ని అనుభవిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు ఈ సమయంలో లోషన్ లేదా మాయిశ్చరైజర్ ఉపయోగించవచ్చు.
ముఖ్యంగా ఫ్యాన్ రెక్కలు దుమ్ముతో ఉంటాయి. వాటిని సరిగ్గా శుభ్రం చేయనప్పుడు, కొన్ని రకాల బ్యాక్టీరియా దానిలో ఉంటుంది. ఇది అలెర్జీ ప్రతిచర్యలతో బాధపడేవారికి మరింత హాని కలిగిస్తాయి. ఫ్యాన్ రాత్రంతా నడిస్తే.. హానికరమైన వ్యర్థాలు మీ గదిలోకి ప్రవేశిస్తాయి.
అమెరికన్ అకాడమీ ఆఫ్ అలెర్జీ, ఆస్తమా, ఇమ్యునాలజీ ప్రకారం, ఈ బ్యాక్టీరియా ఆస్తమాను మరింత తీవ్రతరం చేస్తాయి. అలెర్జీ బాధితులు మీ ఫ్యాన్, పరుపులను క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ అలెర్జీని నివారించవచ్చు. పొడి చర్మం, అలెర్జీ ప్రతిచర్యలు లేదా పొడి కండరాలతో బాధపడేవారు ఫ్యాన్ వాడకంలో కొన్ని మార్పులు చేసి, శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
తేలికపాటి దుస్తులు ధరించడం, మంచం దగ్గర నీరు పుష్కలంగా ఉంచడం, తరచుగా సిప్ చేయడం లేదా పడుకునే ముందు స్నానం చేయడం వంటివి రాత్రిపూట వేడిని తగ్గించడంలో సహాయపడే ఇతర మార్గాలు. ఫ్యాన్ గాలికి ఎక్కువగా నిద్రించకూడదు. సహజంగా వచ్చే గాలితో నిద్రిస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ ఫ్యాన్ లేకుండా నిద్రరాదు అనుకుంటే.. దూరంగా పెట్టి పడుకోండి.