Weight Loss Tips: డిన్నర్ లైట్‌గానే చేయాలట.. లేదంటే బరువు, ఆరోగ్య సమస్యలు తప్పవట
27 August 2022, 14:25 IST
- చాలామంది డే అంతా కష్టపడి.. రాత్రి భోజనం కుమ్మేయాలి అనుకుంటారు. కానీ డిన్నర్ ఎప్పుడూ లైట్‌గానే ఉండాలి అంటున్నారు నిపుణులు. లేదంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు. డిన్నర్ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే.. బరువు కూడా తగ్గుతారు అంటున్నారు. మరి రాత్రి భోజనం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డిన్నర్ కేర్
Weight Loss Tips : చాలామంది బరువు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉదయాన్నే జిమ్‌కి వెళ్లి కష్టపడినా బరువు తగ్గట్లే అంటే.. మీరు మీ డైట్లో ఏదో తప్పు చేస్తున్నారని అర్థం. ముఖ్యంగా డిన్నర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. బరువు మాత్రమే కాకుండా వివిధ ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదముందంటున్నారు. అయితే డిన్నర్లో కొన్ని మార్పులు చేస్తే బరువు తగ్గే అవకాశం కూడా ఉందంటున్నారు.
లైట్ ఫుడ్ తీసుకోవాలి..
అల్పాహారం, భోజనం కంటే రాత్రి భోజనం చాలా తేలికగా ఉండాలి అంటున్నారు డైటీషన్లు. రాత్రి భోజనం లిమిట్‌గా ఉండేలా చూసుకోమంటున్నారు. ఎందుకంటే రోజు చివరిలో మన జీవక్రియ చాలా మందగిస్తుంది కాబట్టి. ఈ సమయంలో అధిక కొవ్వు, ప్రోసెస్ చేసిన ఆహారం తింటే.. అది జీర్ణమవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. అంతేకాకుండా ఊబకాయం, షుగర్ వంటి బారిన పడేలా చేస్తుంది.
రాత్రి 8 గంటలకు ముందే..
చాలా మంది డైటీషియన్లు రాత్రి 8 గంటలకు ముందే డిన్నర్ చేయాలని సిఫార్సు చేస్తున్నారు. అంటే.. నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు డిన్నర్ ముగించాలి అనమాట. డిన్నర్ ఎప్పుడూ లైట్‌గానే ఉండాలి. తొందరగా తినాలి కాబట్టి.. ముందుగానే ఫుడ్ రెడీగా ఉండేలా చూసుకోండి. ఆఫీస్‌లో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా తొందరగా డిన్నర్ ముగించేలా ప్లాన్ చేసుకోండి.
ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..
మరి ఇంతకీ రాత్రి భోజనంలో ఏమి తీసుకోవాలో తెలుసా? అన్నింటికన్నా మొదటిది ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీలైతే వాటిని పూర్తిగా వదిలేయాలి. పిండి పదార్థాలను రాత్రి భోజనంలో తినకూడదని గుర్తుంచుకోండి. పప్పులు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి వాటిని తినవచ్చు. జున్ను, చేపలు, చికెన్ వంటి ప్రోటీన్లను తినండి. సలాడ్ కూడా తినొచ్చు. తద్వారా శరీరానికి ఫైబర్ అందుతుంది. ఇది మీ పొట్టను శుభ్రంగా ఉంచడంలో సహాయంచేస్తుంది.