తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Make Milk Healthier And Tastier For Kids: పిల్లల కోసం పాలు ఇంకాస్త రుచిగా, ఆరోగ్యంగా..

Make milk healthier and tastier for kids: పిల్లల కోసం పాలు ఇంకాస్త రుచిగా, ఆరోగ్యంగా..

23 April 2023, 11:12 IST

google News
  • ఎదిగే పిల్లలు ప్రతిరోజూ ఒకగ్లాసు పాలు తాగితే మంచిది.  కానీ పాలు తాగకుండా పిల్లలు మారాం చేస్తున్నారా? అయితే కొన్ని మార్పులు చేసి పాలను మరింత రుచిగా మార్చేయండి. అదెలాగంటే..

     

పాలు ఇంకా రుచిగా, ఆరోగ్యంగా..
పాలు ఇంకా రుచిగా, ఆరోగ్యంగా.. (Freepik)

పాలు ఇంకా రుచిగా, ఆరోగ్యంగా..

పాలు పిల్లలకు సంపూర్ణాహారం. పాలల్లో క్యాల్షియం, ప్రొటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మరెన్నో ఇతర మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ పిల్లల ఎదుగుదలలో సాయపడతాయి. పాలల్లో విటమిన్ డి ఉంటుంది. ఇది పళ్లు, ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. కానీ చాలా మంది పిల్లలకు పాలంటే నచ్చవు. కొంతమంది బలవంతంగా ఒక గ్లాసు పాలు తాగితే , ఇంకొంత మంది అసలు ముట్టుకోరు. కానీ ఆ పాలను రుచిగా మార్చి, కొన్ని మార్పులు చేసిస్తే తప్పకుండా పాలంటే ఇష్టం పెరుగుతుంది. అలాగనీ మార్కెట్లో దొరికే మిల్క్ మిక్స్ పౌడర్లు వాడకూడదు. వాటికి బదులుగా ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి పాల పోషక విలువలు పెంచడంతో పాటూ, రుచిగా కూడా ఉండేలా చేయొచ్చు.

1. మిల్క్ షేక్

వివిధ రకాల పండ్లతో కలిపి మిల్క్‌షేక్ చేయొచ్చు. మామిడిపండు, స్ట్రాబెర్రీ, అరటిపండు, సపోటా, అవకాడో..ఇవే కాకుండా ఏ పండుతో అయినా పాలతో కలిపి షేక్ చేసివ్వండి. తీపికోసం తేనె కూడా కలపొచ్చు.పిల్లలు ఇష్టపడే పండ్లనే వాడితే పాలతో పాటూ పండు కూడా తిన్నట్టుంటుంది. పాలలో పండ్లు కలపడం వల్ల విటమిన్లతో పాటూ పీచు శాతం పెరుగుతుంది.

2. ఎండుఫలాలు, గింజలు

పాలలో ఎండుఫలాలు లేదా గింజలు వేసి కూడా షేక్ లాగా చేయొచ్చు. బాదాం, కిస్‌మిస్, ఖర్జూరం, వాల్‌నట్స్, పిస్తా, జీడిపప్పు వీటిలో ఏదైనా ఒక్కటి గానీ, లేదంటే రెండు మూడు రకాలు గానీ కలిపి వాడొచ్చు. ఇంకాస్త పోషకభరితంగా మార్చడానికి బ్లూ బెర్రీ, రాస్ప్ బెర్రీ లు పైన వేసి ఇవ్వండి. పిల్లలు ఆడుతూ పాడుతూ పాలు తాగేస్తారు. డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల పాల రుచి పెరుగుతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం.

3. పసుపు పాలు

చలికాలం, వర్షకాలంలో పసుపు పాలు పిల్లలకి చాలా మంచివి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల జలుబు, దగ్గుకు మందులా పనిచేస్తాయి. రెండు వారాలకు ఒకసారి లేదా జలుబు లక్షణాలున్నప్పుడు పిల్లలకు పసుపు పాలు ఇవ్వొచ్చు. సంవత్సరం దాటిన పిల్లలకు మాత్రమే ఇవ్వొచ్చని గుర్తుంచుకోండి. ప్యాకెట్ లో వచ్చేది కాకుండా పట్టించిన ఆర్గానిక్ పసుపు వాడితే మంచిది.

4. జావ చేయడం

రాగి, మినప్పప్పు, రవ్వ, ఓట్స్, మొక్కజొన్న ఇలా ధాన్యాలతో జావ చేయడానికి నీళ్లతో పాటూ పాలను వాడొచ్చు. దీనివల్ల పాలలో ఉండే పోషకాలతో పాటూ ధాన్యాలలో ఉండే విలువలూ పిల్లలకు అందుతాయి. పిల్లలకు నచ్చేట్టుగా మొక్క జొన్న అటుకులు, ఓట్స్, గోదుమ అటుకులు.. ఇలా అన్నీ పాలలో కలిపి సాయంత్రం పూట చిరుతిండి లాగా ఇవ్వొచ్చు. చప్పగా తినకపోతే తీపి కోసం పంచదారకు బదులు ఖర్జూరం, తెేనె కలిపి ఇవ్వండి.

తదుపరి వ్యాసం