Brown Eggs or White Eggs । తెల్లని గుడ్లు, గోధుమ గుడ్లు.. తేడా ఏమిటి? ఏవి ఆరోగ్యకరం?!
16 November 2022, 18:18 IST
- Brown Eggs or White Eggs: తెల్లని గుడ్లు, గోధుమ రంగు గుడ్లలో ఏవి తింటే ఆరోగ్యం? వేటిలో పోషకాలు ఎక్కువ? అసలు నిజం తెలిస్తే అవాక్కవుతారు.
Brown eggs vs white eggs
కోడిగుడ్లు అంటే మనకు తెల్లని పెంకు కలిగిన ఫారం గుడ్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అయితే ఇంకాస్త పెద్ద మార్కెట్, సూపర్ మార్కెట్లకు వెళ్తే అక్కడ మనకు తెల్లని గుడ్లతో పాటు, ముదురు గోధుమ రంగు గుడ్లు కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. . చాలా మంది వ్యక్తులు గోధుమ గుడ్లు మరింత సహజమైనవి లేదా పోషకమైనవి అని భావిస్తారు. ఉదాహరణకు బ్రౌన్ రైస్, బ్రౌన్ షుగర్, బ్రౌన్ బ్రెడ్ లాగా ఇప్పుడు బ్రౌన్ ఎగ్స్ ఆరోగ్యకరమైనవి అనుకుంటారు. అదే సమయంలో తెల్లని గుడ్లు మరింత రుచికరంగా ఉంటాయని అనుకుంటారు. మరి ఏది వాస్తవం, ఏ రంగు గుడ్డు ఆరోగ్యకరం? ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్లని గుడ్లు, గోధుమ రంగు గుడ్లకు గల వ్యత్యాసం కేవలం రంగు మాత్రమే. వాటి రుచిలో గానీ, పోషక విలువలలో గానీ ఎలాంటి తేడా ఉండదు అని నిపుణులు అంటున్నారు. చాలా అరుదుగా గుడ్లలో రెండు పచ్చసొనలు ఏర్పడతాయి, కానీ ఇప్పుడు కృత్రిమంగా ఫారంలలో రెండు పచ్చసొనలు కలిగిన గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే గోధుమ గుడ్లు, డబుల్ పచ్చసొన కలిగిన గుడ్లు మరింత పోషక విలువలు కలిగినవని చెబుతూ అధిక ధరలు అమ్ముతున్నారు. ఇది కేవలం మార్కెటింగ్ ట్రిక్ అనేది నిపుణుల అభిప్రాయం. గుడ్ల రంగులు అనేవి వాటిని పెట్టే కోళ్ల జాతుల ఆధారంగా ఉంటాయి. కొన్నిసార్లు పర్యావరణ అంశాలు కూడా షెల్ రంగును ప్రభావితం చేస్తాయి.
Brown Eggs or White Eggs- తెలుపు గుడ్లు, గోధుమ రంగు గుడ్లు రెండింటిలో ఏవి ఆరోగ్యకరం?
ఇదివరకు చెప్పినట్లుగా గోడ్ల రంగు ఆధారంగా వాటిలోని పోషకాలను నిర్ణయించలేం. అయితే ఈ రంగుతో సంబంధం లేకుండా ఫారం కోళ్ల గుడ్ల కంటే దేశీ కోళ్ల గుడ్లు మరింత పోషకమైనవి. ఫారం కోళ్ల గుడ్లలో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇక పోషకాల విషయానికి వస్తే ఆ కోళ్లకు తినిపించే దాణా, వాటిని పెంచే వాతావరణంపై ఆధారపడి ఉంటాయి. సూర్యరశ్మిలో తిరిగే కోళ్లలో సహజంగా విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అదే సమయంలో ఎలాంటి ఎండ పడకుండా, సరిగ్గా ఆహారం తీసుకోని కోళ్ల గుడ్లలో తక్కువ పోషకాలు ఉంటాయి. ఫారంలో పెరిగే దేశీ కోడి గుడ్లలో అయినా పోషకాలు తక్కువే ఉంటాయి.
కాబట్టి కోళ్ల పెంపకం, అవి తినే దాణా మొదలైన అంశాలు కోడిగుడ్డు రుచి, పోషకాలను నిర్ణయిస్తాయి. బయట స్వేచ్ఛగా తిరుగుతూ స్థానికంగా లభించే నాటుకోడి గుడ్లు అన్నింటికంటే ఉత్తమం.
చలికాలంలో గుడ్లు తినడం చాలా మంచిది అంటారు. అయితే పచ్చసొనతో రోజుకు ఒక గుడ్డు, పచ్చసొన లేకుండా కేవలం ఎగ్ వైట్ లను మూడు నుంచి నాలుగు తినవచ్చని పోషకాహార నిపుణులు తెలిపారు.