Cooker Cleaning: బంగాళాదుంపలు ఉడకబెట్టాక కుక్కర్ నల్లగా మారిందా? ఇలా నలుపును వదిలించేయండి
05 December 2024, 9:01 IST
Cooker Cleaning: బంగాళాదుంపలను ఉడకబెట్టిన తర్వాత మీ కుక్కర్ లోపలి భాగం నల్లగా మారడం గమనించే ఉంటారు. కొన్ని చిట్కాల ద్వారా మీ కుక్కర్ ను తెల్లగా తళ తళలాడేలా చేయవచ్చు. ఆ వంటింటి చిట్కాలేంటో తెలుసుకోండి.
కుక్కర్ క్లీనింగ్ టిప్స్
మహిళలు తరచుగా ఎదరయ్యే సమస్యల్లో కుక్కర్ క్లీనింగ్ కూడా ఒకటి. కుక్కర్ వల్ల వంట సులువుగా మారుతుంది. ఇది ఆహారాన్ని త్వరగా ఉడికేలా చేస్తుంది. అందుకే కుక్కర్ ను అధికంగా వాడుతారు. కుక్కర్ లో వండే ఆహారం రుచికరంగా ఉండటమే కాకుండా త్వరగా రెడీ అవుతుంది. కానీ కుక్కర్లో బంగాళాదుంపలను కూడా ఉడకబెడుతుంటారు. బంగాళాదుంపలు ఉడికాక కుక్కర్ లోపలి భాగం నల్లగా మారిపోవడం చాలా మంది గమనించే ఉంటారు. దీనిని ఎంత తోమినా కూడా ఆ నలుపు పోదు. ఇలాంటప్పుడు కుక్కర్ ను తళతళ లాడేలా ఎలా తోమాలో తెలుసుకోండి. కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా కుక్కర్ ను తెల్లగా మెరిపించేయచ్చు.
నిమ్మతొక్కలతో…
బంగాళాదుంపలను ఉడకబెట్టేటప్పుడు కుక్కర్ నల్లగా మారకూడదనుకుంటే, బంగాళాదుంపలను ఉడకబెట్టడానికి వేసే నీటిలోనే ఒక టీస్పూన్ ఉప్పు, మూడు నుండి నాలుగు నిమ్మ తొక్కలను కుక్కర్లో వేసి విజిల్ పెట్టండి. కుక్కర్ లో నిమ్మ తొక్కలు వేసే ఈ చిట్కాను పాటించడం వల్ల బంగాళాదుంపలను ఉడకబెట్టేటప్పుడు కుక్కర్ లోపలి భాగం నల్లగా మారదు. పైగా మరింత శుభ్రంగా క్లీన్ అవుతుంది. నిమ్మతొక్కలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.
బంగాళాదుంపలు కుక్కర్లో ఉడకబెడుతున్నప్పుడు ఒక్కోసారి అవి చిన్న చిన్న ముక్కలుగా విరిపోతాయి. అలా విరిగిపోవడ వల్ల కూర కూడా సరిగా రాదు. ఇలా ముక్కలుగా విరగకుండా దుంపలు ఉడకాలంటే ప్రెషర్ కుక్కర్ సైజుని బట్టి దుంపల సంఖ్యను ఎంపిక చేసుకోవాలి. దుంపలన్నీ ముగిగేవరకు నీరు పోయాలి. ఆ తర్వాత నీళ్లలో అర టీస్పూన్ ఉప్పు వేసి ఉడికించాలి. దీని తరువాత విజిల్ బలవంతంగా లాగేసే ప్రయత్నాలు చేయవద్దు. ఆవిరి మొత్తం పోయాక విజిల్ తీయండి. ఈ చిట్కాను పాటించడం వల్ల బంగాళాదుంపలు పూర్తిగా ఉడుకుతాయి, చిన్న చిన్న ముక్కలుగా కూడా విడిపోవు.
- ప్రెజర్ కుక్కర్ పెద్దగా ఉంటే, బంగాళాదుంపలు ఉడకడానికి 2 నుంచి 3 విజిల్స్ వరకు సరిపోతుంది. అలా కాకుండా కుక్కర్ చిన్న సైజులో ఉంటే 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి.
- ప్రెషర్ కుక్కర్ లో ప్రెజర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే విజిల్ తీయకూడదు. ఇది ఎన్నో ప్రమాదాలకు కారణం అవుతుంది. కాబట్టి స్పూను సాయంతో విజిల్ ను కొంచెం పైకి ఎత్తితే ఆవిరి మొత్తం ఆ దారి గుండా బయటికి పోతుంది. ఆ తరువాత విజిల్ ను తీసేయాలి.