Potatoes and Cancer: బంగాళాదుంపలు ఇలా తింటే చాలా ప్రమాదం, క్యాన్సర్ కారకాలుగా మారుతాయి
Potatoes and Cancer: బంగాళాదుంపలు ఆరోగ్యానికి మేలే చేస్తాయి. కానీ ఉడికించడం, కాల్చడం వంటివి చేశాక మాత్రం వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Potatoes and Cancer: మనదేశంలో ఉడికించిన బంగాళదుంపలతో చేసే వంటకాల సంఖ్య ఎక్కువే. ఎంతో మందికి ఆలు గడ్డతో చేసిన వంటకాలు నచ్చుతాయి. ఒక్కోసారి అవసరానికి మించి బంగాళదుంపలను ఉడికిస్తారు. ఆ ఉడికించిన బంగాళదుంపలను ఫ్రిజ్లో నిల్వచేసి, మరుసటి రోజు వాడడం వంటివి చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఈ అలవాటు వాటి పోషక విలువలపై ప్రభావం చూపిస్తుందని, వాటి నాణ్యత కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు.

ఫ్రిజ్‌లోని చల్లటి వాతావరణంలో బంగాళా దుంపలను ఉంచడం వల్ల వాటిలోని పిండి పదార్థాలు స్పటికాకార రూపంలోకి మారిపోతాయి. వాటి రుచి కూడా మారిపోతుంది. ఇలా నిల్వ చేసిన బంగాళాదుంపలతో ఆహారాలను తినడం వల్ల శరీరం కూడా పోషకాలను గ్రహించలేదు. అందుకే ఉడికించిన బంగాళదుంపలను ఎప్పుడైనా గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ చేయాలి. నిజానికి ఒకసారి ఆలుగడ్డలను ఉడికించాక వాటిని నిల్వ చేయడం అనేది సరైన పద్ధతి కాదు, వెంటనే వండుకొని తినడమే మంచిది. ఇక తప్పని పరిస్థితుల్లో కొన్ని గంటలపాటు గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు.
బంగాళదుంపలను ఉడకబెట్టడం లేదా కాల్చడం వంటివి చేసినప్పుడు అవి అధిక ఉష్ణోగ్రతకు గురవుతాయి. దీనివల్ల వాటిలో అక్రిలామైడ్ అనే హానికరమైన రసాయనం ఏర్పడుతుంది. ఆ రసాయనం ఉడికించిన బంగాళాదుంపల్లోనే ఉంటుంది. ఆ బంగాళాదుంపలను ఫ్రిజ్లో నిల్వచేసి మళ్లీ వాటిని వేడి చేయడం వల్ల అక్రిలమైడ్ స్థాయిలు మరింతగా పెరుగుతాయి. అంతగా ప్రమాద స్థాయికి చేరుకున్న ఆ రసాయనం శరీరంలో చేరితే ఎన్నో రోగాలకు కారణం అవుతుంది. అదే గది ఉష్ణోగ్రత వద్ద ఉడికించిన బంగాళదుంపలను నిల్వ చేస్తే అక్రిలమైడ్ ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది.
క్యాన్సర్ కారకాలుగా…
బంగాళాదుంపలు పోషకాహారాలకు పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు. వీటిలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చల్లటి ఉష్ణోగ్రతలకు గురికావడం వల్ల విటమిన్ సి వంటి కొన్ని విటమిన్లు బంగాళదుంపల్లో క్షీణించవచ్చు. ఫ్రిజ్లో పెట్టడం వల్ల పోషకాహార ప్రొఫైల్ మారిపోయే అవకాశం ఉంది.
ఎక్కువ పోషకాలను పొందాలనుకుంటే బంగాళాదుంపల్ని నిల్వ చేయడం మానుకోవాలి. అంతేకాదు ఉడికించిన బంగాళదుంపలను ఫ్రిజ్లో ఉంచడం వల్ల క్యాన్సర్ కారకాలు ఏర్పడడానికి కూడా వీలుంటుంది. చల్లగా అయిన బంగాళదుంపలను తిరిగి ఉండేటప్పుడు అధిక ఉష్ణోగ్రతలకు గురిచేస్తాము. అప్పుడు బంగాళదుంపల్లోని చక్కెరలు, అమైనో ఆమ్లాలు క్యాన్సర్‌తో సంబంధం ఉన్న పదార్థాలుగా మారతాయి. కాబట్టి ఉడికించిన బంగాళదుంపలను ఫ్రిజ్లో నిల్వ చేయడం పూర్తిగా మానుకోవాలి.
ఫ్రిజ్లో పెట్టడం వల్ల అవి తాజాగా ఉంటాయని, చెడిపోయే అవకాశం ఉండదని అనుకుంటారు. నిజానికి ఉడికించిన బంగాళదుంపలు గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఫ్రిజ్లో పెడితే చెడిపోయే అవకాశం పెరుగుతుంది. వాటిలో మార్పులు చాలా వేగంగా జరుగుతాయి. శీతల వాతావరణంలో పిండి పదార్థాలను చక్కెరగా మార్చడం వల్ల తీపి రుచి పెరిగిపోతుంది. వాటిని తింటే ఆరోగ్యపరంగా చాలా నష్టాలు ఉంటాయి. కాబట్టి బంగాళాదుంపలను ఎప్పటికప్పుడు వండుకుని తింటేనే అన్ని రకాలుగా మంచిది.