Peppermint Tea | వేడి సాయంకాలానా చల్లటి అనుభూతిని పంచే టీ!
26 April 2022, 17:36 IST
- ఎండాకాలంలో వేడివేడి టీలకు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారా? అయితే మీకోసమే Peppermint Tea . ఇది మీ శరీరానికి సహజమైన కూలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇలా చేసుకోండి, ఇంకా ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకోండి..
Peppermint Tea
వేసవి అసలే వేడి.. ఆపై వేడివేడి ఛాయ్, కాఫీలు ఈ ఎండాకాలంలో మీ శరీరంలోని వేడిని మరింత పెంచుతాయి. అటు బయట నుంచి వేడి, ఇటు శరీరంలోపల వేడితో మీరు ఉక్కిరిబిక్కిరి అవ్వొచ్చు. అసహనంతో అందరిపై అనవసరంగా అరిచిఅరిచి ఆపై అలిసిసొలిసి పోవచ్చు. కాబట్టి సీజన్ కు తగినట్లుగా మన ఆహరపు అలవాట్లు, మన జీవనశైలి ఉండాలి. మీకు ఈ వేసవిలో టీ తాగాలని మనసు లేకపోయినా టీ తాగకుండా ఉండలేకపోతే ఇలాంటి సందర్భాల్లో మీకు కావాలి 'పిప్పరమెంట్ టీ' అంటే పుదీనా ఛాయ్.
వేడి వేసవి సాయంకాలంలో పిప్పరమెంట్-టీ మీ సిస్టమ్‌ను చల్లబరచడానికి ఒక అద్భుతమైన మార్గం. పుదీనాలో మెంథాల్ అనే సమ్మేళనం ఉంటుంది సహజజమైన శీతలీకరణ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాదు మంచి రుచితో పాటు మానసిక ప్రశాంతత, మెరుగైన సౌందర్యం ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అదనంగా లభిస్తాయి.
మరి ఈ పిప్పరమెంట్ టీకి కావాల్సిన పదర్థాలు, ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ రెసిపీ అందిస్తున్నాం. ఇది చేసుకోవడం చాలా సులభం 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈ సాయంకాలం పిప్పరమెంట్ టీ తాగి చల్లబడండి..
కావాల్సినవి
2 కప్పుల నీరు
15-20 తాజా పుదీనా ఆకులు
2 టీస్పూన్లు తేనె ఐచ్ఛికం
నిమ్మకాయ ముక్కలు ఐచ్ఛికం
తయారుచేసే విధానం
- ఒక చిన్న గిన్నెలో రెండు కప్పు నీరు తీసుకొని మరిగించండి. అందులో 15-20 తాజా పుదీనా ఆకులు నలిపేసి వేయండి. మీకు రుచి ఇంకా స్ట్రాంగ్ కావాలంటే అదనంగా మరిన్ని పుదీనా ఆకులు వేసుకోవచ్చు.
- పుదీన ఆకులు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి, అలాగే మరిగించవద్దు.
- ఇప్పుడు పుదీనా ఆకులు వేసిన ఈ నీటిని 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి.
- ఆ తర్వాత పుదీన ఆకులను వడకట్టి ఆ నీటిని టీకప్పులో పోయండి.
- ఒక కప్పుకు ఒక టీస్పూన్ తేనే, కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం పిండు కొని సర్వ్ చేసుకోండి.
ఇలా గోరువెచ్చని పుదీనా ఛాయ్ తాగడం శరీరానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా తలనొప్పిని నివారిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, నోటి దుర్వాసనను పోగొడుతుంది, చర్మాన్ని ఇంకా వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.