cucumber curd rice: దోసకాయ పెరుగన్నంతో.. పొట్ట నిండుగా, చల్లగా
13 May 2023, 12:30 IST
cucumber curd rice: మామూలు పెరుగన్నం కన్నా దోసకాయతో పెరుగన్నం ఒకసారి ప్రయత్నించి చూడండి. రుచిలో భిన్నంగా ఉంటుంది. దోసకాయ ఆరోగ్యానికి మంచిది కూడా.
దోసకాయ పెరుగన్నం (unsplash)
దోసకాయ పెరుగన్నం
ఎండాకాలంలో చల్లదనం కోసం ఎలాంటి వంటకాలు చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ చల్లని దోసకాయ పెరుగన్నం ప్రయత్నించండి. కడుపు నిండుగా, చల్లగా ఉంటుంది. 5 నిమిషాల్లో ఈ దోసకాయ పెరుగన్నం సిద్ధమవుతుంది.
కావాల్సిన పదార్థాలు:
1 కప్పు ఉడికించిన అన్నం
1 కప్పు పెరుగు
1 కప్పు కీర దోస తరుగు
1 రెబ్బ కరివేపాకు
2 పచ్చిమిర్చి
తరిగిన కొత్తిమీర కొద్దగా
4 చెంచాల దానిమ్మ గింజలు
2 చెంచాల పల్లీలు
1 చెంచా మిరియాల పొడి
1 చెంచా జీలకర్ర పొడి
సగం టీస్పూన్ ఇంగువ
రెండు స్పూన్ల నెయ్యి
తగినంత ఉప్పు
తయారీ విధానం:
- ముందుగా పెరుగును బాగా గిలకొట్టుకోవాలి. దీంట్లో కీరదోస తురుము కలిపి పెట్టుకోవాలి.
- దీంట్లో ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి.
- ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని పొడిపొడిగా చేసుకుని మసాలాలు కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో కలుపుకోవాలి.
- ఇప్పుడు పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. వేడయ్యాక జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి , కరివేపాకు, పల్లీలు వేసుకుని వేగనివ్వాలి.
- ఈ తాలింపును ముందుగా పెరుగు కలిపి పెట్టుకున్న అన్నంలో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పైన దానిమ్మ గింజలు వేసుకుంటే సరిపోతుంది.
- దీన్ని వేడివేడిగా వడ్డించొచ్చు లేదా కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకుని తింటే చల్లగా రుచి బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. సులువుగా చేసుకోవచ్చు కూడా.
టాపిక్