Pulusu kura: గుత్తి దొండకాయ కూర ఇలా ఆలూతో పులుసు పెట్టి వండండి, అదిరిపోతుంది
13 October 2024, 17:30 IST
- Pulusu kura: దొండకాయ, ఆలూ కలిపి చేసే ముక్కల పులుసు రుచి కొత్తగా ఉంటుంది. దీంట్లో కొబ్బరి వాడటం వల్ల ప్రత్యేక రుచి ఉంటుంది. దాన్నెలా వండుకోవాలో వివరంగా చూడండి.
దొండకాయ ఆలూ పులుసు
దొండకాయతో, బంగాళదుంపతో ఎక్కువగా ఫ్రై చేసుకుంటాం. కానీ రెండూ కలిపి వండుకోవడం చాలా తక్కువ. కానీ ఆ రెండు కూరగాయలు కలిపి రుచికరమైన పులుసు పెట్టుకోవచ్చు. దీన్ని అన్నంలోకి తింటే బాగుంటుంది. ఆలూ దొండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలేంటో చూసేయండి.
ఆలూ దొండకాయ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు:
పావు కేజీ దొండకాయలు
2 బంగాళదుంపలు
నిమ్మకాయ సైజు చింతపండు
సగం కప్పు కొబ్బరి తురుము (ఆప్షనల్)
2 చిన్న ఉల్లిపాయలు
2 ఎండుమిర్చి
2 పచ్చిమిర్చి
పావు టీస్పూన్ జీలకర్ర
పావు టీస్పూన్ ఆవాలు
పావు టీస్పూన్ పసుపు
పావు టీస్పూన్ కారం
1 కరివేపాకు రెమ్మ
2 చెంచాల వంట నూనె
ఆలూ దొండకాయ పులుసు తయారీ విధానం:
1. ముందుగా గోరువెచ్చని నీళ్లలో చింతపండును నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత చింతపండు గుజ్జు తీసుకోవాలి.
2. ఇప్పుడు బంగాళదుంపలు చెక్కుతీసి పొడవాటి ముక్కలుగా కోసుకోవాలి. దొండకాయ కూడా పొడవుగా, సన్నటి ముక్కలు కట్ చేసుకోవాలి. లేత దొండకాయలుంటే నిలువుగా ఒక గాటు పెట్టి గుత్తి దొండకాయలా ఉంచేయండి.
3. ఇప్పుడు ఒక కడాయి లేదా లోతు ఎక్కువున్న పాత్ర ఒకటి స్టవ్ మీద పెట్టుకోవాలి. దాంట్లో బంగాళదుంప ముక్కలు, దొండకాయ ముక్కలు, పసుపు, కారం, చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి.
4. మూత మూసుకుని కనీసం పదినిమిషాల పాటూ వీటన్నింటినీ సన్నం మంట మీద ఉడికించుకోవాలి.
5. ఆలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కాస్త బరకగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే చెంచా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోండి.
6. కూరగాయ ముక్కలు ఉడికిపోయాయి అనుకున్నప్పుడు అందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమం ముద్ద వేసుకోండి.
7. బాగా కలుపుకుని మూత పెట్టి కనీసం పదినిమిషాలు ఉడికించుకోవాలి.
8. ఇప్పుడు మరో పాత్ర పెట్టుకుని చెంచా నూనె వేసుకుని వేడెక్కాక పావు టీస్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపును ఉడుకుతున్న కూరలో వేసుకుని కలుపుకోవాలి. అంతే బాగా కలుపుకుని చివరగా కొత్తిమీర చల్లుకుంటే దొండకాయ ఆలూ పులుసు రెడీ అయినట్లే.