తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Memory Loss Remedies: మతిమరుపు మందు కావాలా? ఇలా చేస్తే జ్ఞాపకశక్తి గ్యారంటీ

Memory loss remedies: మతిమరుపు మందు కావాలా? ఇలా చేస్తే జ్ఞాపకశక్తి గ్యారంటీ

HT Telugu Desk HT Telugu

25 November 2022, 17:34 IST

google News
    • Memory loss remedies: మతిమరుపుతో బాధపడుతున్నారా? జ్ఞాపకశక్తి తిరిగి పొందేందుకు నిపుణులు ఇస్తున్న సలహాలు పాటించండి.
జ్ఞాపకశక్తి తిరిగి పొందేందుకు చిట్కాలు
జ్ఞాపకశక్తి తిరిగి పొందేందుకు చిట్కాలు (Pixabay)

జ్ఞాపకశక్తి తిరిగి పొందేందుకు చిట్కాలు

మతిమరుపు మిమ్మల్ని బాధిస్తోందా? చేయాల్సిన పనులు గుర్తుకు ఉండడం లేదా? తాళం చెవి ఎక్కడో పెట్టానని తరచూ కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీకు జ్ఞాపకశక్తి సన్నగిల్లుతోందని మీ స్నేహితులకు తరచూ గుర్తు చేస్తున్నారా? కోవిడ్ బారినపడి కోలుకున్న వారికి అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మతిమరుపు కూడా అందులో ఒకటై ఉండొచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయినా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. జీవనశైలి మార్పులతో మీ మతిమరుపును దూరం చేసుకోవచ్చు.

తినడం, వ్యాయామం, వర్కింగ్ స్టైల్ వంటి విషయాల్లో మన రోజువారీ అలవాట్లు మన జ్ఞాపకశక్తిని సానుకూలంగా గానీ, ప్రతికూలంగా గానీ ప్రభావితం చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెల్స్(యూఎల్‌సీఏ) చేసిన పరిశోధనల ప్రకారం డిప్రెషన్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, హై బ్లడ్ ప్రెషర్ జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా 18 నుంచి 39 ఏళ్లు, 50 నుంచి 59 ఏళ్ల వయస్సుల వారిలో జ్ఞాపకశక్తికి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.

మీరు డిప్రెషన్‌లో ఉండి, తగిన వ్యాయామం లేకుండా ఉంటే లేదా హైబ్లడ్ ప్రెషర్ కలిగి ఉంటే మతిమరుపునకు సంబంధించిన ఫిర్యాదులు మీ నుంచి కనిపిస్తాయి. మీరు యువకులైనప్పటికీ ఈ ఫిర్యాదులు ఉంటాయని ఈ అధ్యయనం తెలిపింది. మన జీవనశైలికి ఆరోగ్యకరమైన మార్పులు చేస్తే మన బ్రెయిన్ హెల్త్ బాగుంటుందని, తద్వారా దాని పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

‘మన బ్రెయిన్‌లో వంద మిలియన్ న్యూరాన్లు, బిలియన్ల కొద్దీ కనెక్షన్లు ఉంటాయి. అయితే 10 శాతం బ్రెయిన్‌నే ఉపయోగిస్తాం. 90 శాతం వినియోగించం. అందువల్ల బ్రెయిన్‌కు తగిన వ్యాయామం ఉంటే 10 శాతం కంటే ఎక్కువ కూడా ఉపయోగించవచ్చు..’ అని పి.డి.హిందూజా హాస్పిటల్ న్యూరాలజీ డివిజన్ హెడ్ డాక్టర్ పి.పి.అశోక్ సూచిస్తున్నారు.

షుగరీ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండండి

చక్కెర ఎక్కువగా ఉన్న డ్రింక్స్ డిమెన్షియా ప్రమాదాన్ని మరింతగా పెంచుతాయి. డయాబెటిస్ లేకపోయినా ఈ రిస్క్ పెరుగుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. హై ఫ్రక్టోజ్ డైట్ బ్లడ్ షుగర్ అదుపులో లేకుండా చేస్తుంది. అంతేకాకుండా మెటబాలిక్ డిజార్డర్స్‌కి, మతిమరుపుకు దారితీస్తుంది. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, శాచ్యురేటెడ్ కొవ్వులు, ప్రాసెస్డ్ ఫుడ్స్ మీ జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

బ్రెయిన్ పనితీరు ఇంప్రూవ్ చేసే ఫుడ్స్

పసుపు, కాఫీ, చెరువుల్లో దొరికే సాల్మన్ చేపలు వంటివి బ్రెయిన్ పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ‘బ్రెయిన్ ఫుడ్ అంటూ నిర్ధిష్టంగా ఏదీ లేదు. కానీ పసుపు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. కాఫీ కూడా ఇందుకు దోహదపడుతుంది. ఇది న్యూరోట్రాన్స్‌మిటర్ అడెనోసైన్‌ను తగ్గించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే చెరువుల్లో దొరికే సాల్మన్ చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి..’ అని డాక్టర్ అశోక్ చెప్పారు.

స్క్రీన్ టైమ్ వల్ల మెదడుపై ప్రభావం

ఎక్కువగా మొబైల్స్, టీవీ చూడడం వల్ల బ్రెయిన్ అలెర్ట్‌నెస్ తగ్గిపోతుంది. ఆలోచన శక్తి, ఊహించే శక్తి తగ్గిపోతాయి. ఇది జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతాయి. నిద్ర లేమి కారణంగా మతిమరుపు వస్తుంది. క్రమంగా ఇది దీర్ఘకాలిక వ్యాధులు హైపర్ టెన్షన్, ఒబెసిటీ, డయాబెటిస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. కనీసం 8 గంటల పాటు మంచి నిద్ర ఉంటే బ్రెయిన్‌లో డెడ్ సెల్స్‌ను కొత్త సెల్స్ రీప్లేస్ చేస్తాయని డాక్టర్ అశోక్ చెప్పారు.

పుస్తక పఠనం, పజిల్స్ మేలు చేస్తాయి..

బ్రెయిన్‌ను అలెర్ట్‌గా ఉంచే బుక్ రీడింగ్, పజిల్ ఎక్సర్‌సైజులు దాని పనితీరు మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అలాగే శారీరక శ్రమ చాలా అవసరం. ‘ఈ ఆధునిక ప్రపంచంలో టీవీ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం, స్మార్ట్ మొబైల్‌కు అతుక్కుపోవడం మీ మెంటల్ అలెర్ట్‌నెస్‌ను తగ్గిస్తాయి. మిమ్మల్ని ఆలోచించనివ్వవు. మీ బ్రెయిన్‌కు ఆలోచించే శక్తి, ఊహించే శక్తి తగ్గిపోతుంది..’ అని న్యూరాలజిస్ట్ డాక్టర్ అశోక్ తెలిపారు.

అందువల్ల సమతుల ఆహారం తీసుకుంటూ ఒత్తిడి తగ్గించుకుంటూ శారీరక శ్రమను కలిగి ఉండాలని సూచిస్తున్నారు. అలాగే టీవీ, మొబైల్ చూడడం తగ్గించి నిద్ర పోవాలని చెబుతున్నారు. బ్రెయిన్ పనితీరు మెరుగుపడేందుకు పుస్తక పఠనం, బ్రెయిన్ ఎక్సర్‌సైజులు అవసరం అని చెబుతున్నారు. ఇవన్నీ చేస్తే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని సలహా ఇస్తున్నారు.

తదుపరి వ్యాసం