Chinta Chiguru Pulihora: చింతచిగురు పులిహోర ఇలా చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
27 April 2024, 11:45 IST
- Chinta Chiguru Pulihora: పులిహోర నిమ్మకాయతో లేదా చింతపండుతోనే ఎక్కువగా చేస్తారు. ఓసారి చింతచిగురు పులిహోర చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
చింత చిగురు పులిహోర రెసిపీ
Chinta Chiguru Pulihora: పులిహోర అనగానే అందరికీ గుర్తొచ్చేవి నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, ఉసిరి పులిహార లేదా మామిడికాయ పులిహోర. ఇవే కాదు చింత చిగురుతో పులపుల్లగా పులిహోర ట్రై చేయొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త రుచి కాబట్టి పిల్లలకు ఇష్టంగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఉపయోగించవచ్చు. వసంత కాలంలోనే చింతచిగురు తొడుగుతుంది. కాబట్టి ఈ సమయంలోనే చింతచిగురు ఎక్కువగా లభిస్తుంది. దీంతో అనేక రకాల వంటకాలు వండుకోవచ్చు. ఈరోజు చింతచిగురు పులిహోర ఎలా చేయాలో చెప్పాము. దీన్ని చేయడం చాలా సులువు. నిమ్మకాయ పులిహారలాగే ఇది కూడా చాలా త్వరగా అయిపోతుంది. రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
చింతచిగురు పులిహోర రెసిపీకి కావలసిన పదార్థాలు
వండిన అన్నం - రెండు కప్పులు
వేరు శెనగ పప్పులు - గుప్పెడు
చింత చిగురు - ఒక కప్పు
శనగపప్పు - ఒక స్పూను
ఆవాలు - అర స్పూను
పసుపు - అర స్పూను
మినప్పప్పు - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
ఎండుమిర్చి - మూడు
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ పొడి - చిటికెడు
నూనె - సరిపడినంత
చింతచిగురు పులిహోర రెసిపీ
1. అన్నం పొడిపొడిగా వచ్చేలా వండుకోవాలి.
2. అన్నం ఉడుకుతున్నప్పుడే ఒక స్పూను నూనె, చిటికెడు ఉప్పు వేసి కలిపితే అన్నం పొడిపొడిగా వచ్చే అవకాశం ఉంది.
3. ఒక పెద్ద ప్లేట్లో అన్నాన్ని పరిచి చల్లబడితే అది పొడిపొడిగా అవుతుంది.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అర స్పూను నూనె వేయాలి.
5. ఆ నూనెలో చింతచిగురు వేసి పచ్చివాసన పోయే వరకు ఉంచాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి చిటపటలాడించాలి.
7. వేరుసెనగ పప్పు కూడా వేసి వేయించుకోవాలి.
8. అలాగే ఎండుమిర్చి, కరివేపాకులు, పసుపు, ఇంగువ వేసి వేయించుకోవాలి.
9. ఇందులో చింతచిగురును కూడా వేసి 30 సెకన్లు వేయించి స్టవ్ కట్టేయాలి.
10. ఇప్పుడు ఈ మిశ్రమంలో వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
11. అన్నం ముద్ద కాకుండా పొడిపొడిగా వచ్చేలా కలుపుకోవాలి.
12. అంతే టేస్టీ చింతచిగురు పులిహోర రెడీ అయినట్టే.
13. చింతచిగురు పుల్లగా ఉంటుంది.
15. కాబట్టి ఈ అన్నం కూడా పుల్లపుల్లగా టేస్టీగా ఉంటుంది.
చింతచిగురు ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటివి రాకుండా అడ్డుకుంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు చింతచిగురును ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపులు రాకుండా అడ్డుకుంటాయి. చింత చిగురు సీజనల్‌గా దొరికే ఆహారం. కాబట్టి వేసవిలో దీన్ని కచ్చితంగా తినాలి. అనేక రకాల వంటల్లో దీన్ని భాగం చేసుకోవచ్చు.
వెజ్, నాన్ వెజ్ కర్రీలలో కూడా వేసి వండొచ్చు. ఇది కర్రీలకు మరింత రుచిని పెంచుతుంది. చింతచిగురులో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. చిన్న పిల్లలకు దీన్ని తినిపించడం వల్ల వారు ఎనీమియా బారిన పడకుండా ఉంటారు. గొంతు నొప్పి, వాతం, కామెర్ల వ్యాధి వంటి వాటిని అడ్డుకునే శక్తి దీనికి ఉంటుంది. అలాగే చింత చిగురును తరచూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చింతచిగురును ప్రతిరోజూ తింటూ ఉండాలి.