Chinthachiguru Royyala Curry: పచ్చి రొయ్యల్లో చింతచిగురు వేసి వండండి, రెసిపీ అదిరిపోతుంది
Chinthachiguru Royyala Curry: పచ్చి రొయ్యలతో చేసే వంటకాలు టేస్టీగా ఉంటాయి అందులో చింతచిగురు మంచి రోజులు రెసిపీకి అభిమానులు ఎక్కువ
Chinthachiguru Royyala Curry: నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన వంటకాల్లో రొయ్యలు రెసిపీలు ఒకటి. రొయ్యల వేపుడు, రొయ్యల కూర, రొయ్యల బిర్యానీ ఇవన్నీ నోరూరించేస్తాయి. అలాగే చింతచిగురు వేసి చేసే పచ్చి రొయ్యల కూర చాలా టేస్టీగా ఉంటుంది. చింతచిగురు పచ్చి రొయ్యల రెసిపీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. వేడివేడి అన్నంలో చింతచిగురు పచ్చి రొయ్యల కూర వేసుకొని తింటే రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం.
చింతచిగురు పచ్చిరొయ్యల కూర రెసిపీకి కావలసిన పదార్థాలు
పచ్చి రొయ్యలు - అరకిలో
చింతచిగురు - ఒక కప్పు
ఉల్లిపాయలు - రెండు
పచ్చి మిరపకాయలు - ఐదు
పసుపు - అర స్పూను
కారం - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
చింత చిగురు పచ్చి రొయ్యల కూర రెసిపీ
1. పచ్చి రొయ్యలను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో కాస్త ఉప్పు, పసుపు కలిపి పెట్టుకుంటే మంచిది.
2. చింతచిగురును ఏరి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. అందులో సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగును వేసి వేయించాలి. అవి రంగు మారేవరకు వేయించాలి.
5. ఆ తరువాత పచ్చి రొయ్యలను వేసి కలపాలి. అవసరమైతే కాస్త పసుపును వేసుకోవచ్చు.
6. రొయ్యలు కాస్త మగ్గాక చింతచిగురుని కూడా వేసి మూత పెట్టాలి.
7. ఇవి ఇగురులాగా మగ్గడానికి 10 నిమిషాల సమయం పడుతుంది.
8. ఆ తరువాత కారం, ఉప్పు వేసి అవసరమైతే నీటిని వేసుకోవచ్చు.
9. మూత పెట్టి పావుగంట సేపు చిన్న మంట మీద ఉడకనివ్వాలి.
10. ఇగురు లాగా వచ్చాక స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ పచ్చి రొయ్యలు తో చేసిన చింతచిగురు కూర రెడీ అయినట్టే.
11. వేడి వేడి అన్నంలో దీన్ని వేసుకొని తింటే ఆహా అనిపిస్తుంది.
నాన్ వెజ్ వంటకాలలో రొయ్యలతో చేసిన వంటకాలు ఆరోగ్యకరమైనవి. రొయ్యలు ఎంత తిన్నా శరీరంలో కొవ్వు చేరదు. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి గుండెకు మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడుతాయి. కాబట్టి నాన్ వెజ్ ప్రియులు మటన్, చికెన్ కన్నా రొయ్యలని తినడానికి ప్రయత్నిస్తే మంచిది. రొయ్యల రుచి కూడా బాగుంటుంది. రొయ్యల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిలో ఉండే సెలీనియం శరీరంలో క్యాన్సర్ కణితులు పెరగకుండా అడ్డుకుంటుంది. అలాగే వయసు ముదురుతున్న కొద్దీ వచ్చే మతిమరుపును రాకుండా అడ్డుకునే శక్తి రొయ్యలకు ఉంది. దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎముకలు బలంగా ఉంటాయి. రొయ్యలు తరచూ తినేవారి చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఈ రొయ్యల్లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారు పచ్చి రొయ్యల్ని తినడం అలవాటు చేసుకోవాలి. రొయ్యలు తరచూ తినేవారిలో లైంగిక సామర్ధ్యం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మగవారు రొయ్యల్ని తినాల్సిన అవసరం ఉంది.
చింతచిగురు కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేదే. దీనిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి బరువు త్వరగా తగ్గుతారు. అలాగే మలబద్ధకం వంటి సమస్యలు రావు. ఈ చింతచిగురులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం తక్కువ. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి దీనికి ఉంది. గొంతు నొప్పి, శరీరంలో మంట, వాపు వంటి వాటిని తగ్గించే శక్తి చింతచిగురుకు ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా చింత చిగురుతో చేసిన వంటకాలు తినడం అవసరం.
టాపిక్