Chicken Pulao: కొబ్బరి పాలతో చికెన్ పులావ్ రెసిపీ, ఇలా చేస్తే త్వరగా రెడీ అయిపోతుంది
16 July 2024, 11:40 IST
- Chicken Pulao: చికెన్ పులావ్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. దీన్ని చాలా సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మేము చెప్పిన రెసిపీని ఫాలో అయిపోండి
చికెన్ పులావ్ రెసిపీ
Chicken Pulao: ఈజీగా... అది కూడా చాలా వేగంగా చికెన్ పులావ్ ను వండేసుకుంటే తినాలన్న కోరిక కూడా పెరిగిపోతుంది. కొబ్బరి పాలతో సులువుగా టేస్టీగా చికెన్ పులావ్ ఎలా ఉండాలో ఇక్కడ మేము చెప్పాము. ఇలా వండితే అదిరిపోతుంది. బిర్యానీతో పోలిస్తే చికెన్ పులావ్ కూడా సులువుగానే వండేసుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో కూడా బాస్మతి బియ్యం వినియోగిస్తే ఇది చాలా రుచిగా వస్తుంది. ఇలా చేయాలో ఒకసారి చూద్దాం. కొబ్బరి పాలు ఆరోగ్యానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది.
చికెన్ పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
చికెన్ ముక్కలు - అరకిలో
బాస్మతి బియ్యం - రెండు కప్పులు
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
టమాటా - ఒకటి
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
పుదీనా తరుగు - మూడు స్పూన్లు
నీరు - తగినంత
కొబ్బరిపాలు - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - సరిపడినంత
పెరుగు - అరకప్పు
కారం - అర స్పూను
పసుపు - పావు స్పూను
నిమ్మరసం - అర స్పూను
లవంగాలు - ఏడు
దాల్చిన చెక్క - ఒకటి
యాలకులు - మూడు
అనాస పువ్వు - ఒకటి
మరాఠీ మొగ్గ - ఒకటి
జాపత్రి - చిటికెడు
జాజికాయ పొడి - చిటికెడు
బిర్యానీ ఆకులు - రెండు
కొబ్బరి పాలతో చికెన్ పులావ్
1. ముందుగా కొబ్బరి ముక్కల నుంచి కొబ్బరి పాలను వేరు చేయాలి.
2. ఇందుకోసం కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి నీళ్లు వేసి బాగా రుబ్బుకోవాలి.
3. అందులో వచ్చిన కొబ్బరి పాలను వడకట్టుకోవాలి.
4. ఇలా రెండు మూడుసార్లు చేస్తూ ఉంటే కొబ్బరి పాలు తగినంతగా వస్తాయి.
5. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ వేసి అందులో పెరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, నిమ్మరసం, ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూన్ నూనె, ఒకటిన్నర స్పూను నెయ్యి వేసి అందులో బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాసపువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజికాయ పొడి వేసి వేయించుకోవాలి.
7. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి వేయించాలి.
8. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా తరుగు, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి వేయించుకోవాలి.
9. ఇవన్నీ బాగా వేగాక ముందుగా మ్యారినేట్ చేసుకుని చికెన్ ముక్కలను వేసి బాగా ఉడికించుకోవాలి.
10. అంతా చిన్నమంట మీద చేయాలి. చికెన్ కాస్త గ్రేవీ లాగా అవుతుంది.
11. అప్పుడు ముందుగా తయారుచేసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసి కలుపుకోవాలి.
12. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
13. అవసరమైతే ఆ బియ్యం ఉడకడానికి మరి కాస్త నీరు వేసుకోవచ్చు.
14. ఇందులోనే పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు కూడా పైన చల్లుకోవాలి.
15. మూత పెట్టి చిన్నమంట మీద పావుగంట నుంచి 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
16. మూత తీసాక పైన అర స్పూన్ నెయ్యిని చల్లుకొని వేడి వేడిగా తింటే రుచి అదిరిపోతుంది.
సాధారణ పులావ్‌తో పోలిస్తే కొబ్బరిపాలతో చేసిన పులావ్ రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిని చూడండి... మీకే ఆ రెండింటి మధ్య తేడా తెలుస్తుంది. కొబ్బరి పాలను ముందుగానే చేసి పెట్టుకుంటే మంచిది.