Cheese Aloo Bonda: చీజ్ ఆలు బోండా రెసిపీ, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి
09 February 2024, 15:30 IST
- Cheese Aloo Bonda: బంగాళాదుంపలతో చేసే టేస్టీ రెసిపీ చీజ్ ఆలు బోండా. ఇది చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు నచ్చుతుంది. సాయంత్రం పూట వేడివేడిగా తింటే ఆ కిక్కే వేరు. చీజ్ బోండా రెసిపీ ఎలాగో చూద్దాం.
aloo bonda
Cheese Aloo Bonda: బంగాళదుంపలతో చేసిన వంటకాలు ఎక్కువమందికి నచ్చుతాయి. ముఖ్యంగా పిల్లలకు ఫేవరెట్ వంటకాలు ఇవి. బంగాళదుంపలతో చీజ్ ఆలు బోండా తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం పూట పిల్లలకు తినిపిస్తే వారికి వెంటనే శక్తి అందడంతో పాటు, చురుగ్గా ఉంటారు. దీన్ని తయారు చేయడం చాలా సులువు. ఇందులో వాడినవన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. ఆలూ బోండా రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.
చీజ్ ఆలూ బోండా రెసిపీకి కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు - అరకిలో
ఉల్లిపాయలు - ఒకటి
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
పచ్చిమిర్చి - నాలుగు
జీలకర్ర - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
కొత్తిమీర - ఒక కట్ట
పసుపు - ఒకటిన్నర స్పూను
కారం - ఒక స్పూను
చాట్ మసాలా - ఒక స్పూను
చీజ్ క్యూబ్స్ - ఆరు
శెనగపిండి - రెండు కప్పులు
నీళ్లు - సరిపడినంత
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
చీజ్ ఆలూ బోండా రెసిపీ
1. బంగాళదుంపలను బాగా ఉడకపెట్టి పైన తొక్క తీసేయాలి.
2. ఒక గిన్నెలో వేసి చేతులతోనే మెత్తగా మెదపాలి. ఇప్పుడు అందులో మూడు స్పూన్ల శెనగపిండి, పసుపు, కారం, ఒక స్పూన్ నూనె, నీరు వేసి బాగా కలపాలి.
3. మరీ పల్చగా కాకుండా లడ్డూల్లా చుట్టడానికి వీలుగా అయ్యేంతవరకు కలపాలి. పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
4. అందులో అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.
6. అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి.
7. తర్వాత ముందుగా కలుపుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఒక నిమిషం పాటు వేయించాలి.
8. అందులో తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా కలుపుకోవాలి.
9. పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలపాలి.
10. పైన చాట్ మసాలా, కొత్తిమీర తరుగు చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి.
11.ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చల్లబరచాలి.
12. చీజ్ క్యూబులను రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
13. బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న బాల్ లాగా చేసి దాని మధ్యలో చీజ్ ముక్కను పెట్టాలి.
14. మళ్ళీ బంగాళదుంపని బాల్ లా చుట్టేయాలి.
15. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి.
16. ఒక గిన్నెలో శెనగపిండిని, చిటికెడు ఉప్పును వేసి కలుపుకోవాలి. అందులో నీళ్లు వేసి బాగా కలపాలి.
17. ఈ బంగాళదుంప బాల్‌ని శెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి వేయించాలి.
18. అవి రంగు మారేవరకు వేయించి వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
19. అంతే చీజ్ ఆలూ బోండా రెడీ అయినట్టే. వీటిని పుదీనా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.
పిల్లలు ఈ రెసిపీని చాలా ఇష్టపడతారు. చీజ్ ఆలూ బోండా ఒక్కసారి చేయడం వస్తే మీరు సులువుగా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. వీటి రుచి బాగుంటుంది. కాబట్టి పెద్దలకు కూడా నచ్చుతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.
టాపిక్