Milk powder Laddu: పాల పొడితో ఇలా టేస్టీ లడ్డూలను చేయండి, పిల్లలకు నచ్చుతాయి
Milk powder Laddu: పాలపొడి ప్యాకెట్లు బయట ఎక్కువగానే దొరుకుతాయి. పాల పొడితో అప్పటికప్పుడు లడ్డూలు చేసుకోవచ్చు. ఇందులోను పోషకాలు నిండుగానే ఉంటాయి.
Milk powder Laddu: ఇంటికి హఠాత్తుగా అతిధులు వచ్చినప్పుడు లేక పిల్లలు అల్లరి చేసినప్పుడు త్వరగా తయారయ్యే స్వీట్... పాలపొడి లడ్డూ. దీన్ని చాలా సింపుల్ గా పది నిమిషాల్లో చేసేయొచ్చు. టేస్ట్ కూడా అదిరిపోతుంది. పాలపొడితో తయారు చేస్తాం కాబట్టి అందులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం పూట పిల్లలకు స్నాక్ గా అందించేందుకు ఈ లడ్డు ఉపయోగపడుతుంది. పాలపొడితో లడ్డూ ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
పాలపొడి లడ్డు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పాలపొడి - పావు కప్పు
జీడిపప్పు - పావు కిలో
నెయ్యి - అరకప్పు
పాలపొడి లడ్డు రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
2. అందులో జీడిపప్పు తరుగును వేయించాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి.
3. ఇప్పుడు ఒక గిన్నెలో మిల్క్ పౌడర్ ను వేయాలి. అందులో నెయ్యిని, సన్నగా తరిగిన జీడి పలుకులను వేసి బాగా కలపాలి.
4. చేతికి నెయ్యి రాసుకొని వాటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే మిల్క్ పౌడర్ లడ్డు రెడీ అయినట్టే.
5. ఈ లడ్డూలను చుట్టుకున్న తర్వాత ఒక గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయి.
6.అయిదు నిమిషాల్లో ఇవి రెడీ అయిపోతాయి.
7. పిల్లలు ఆకలి అన్నప్పుడల్లా వీటిని ఇవ్వచ్చు.
8. పాలపొడిలో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు, కాబట్టి ఈ పాలపొడి లడ్డూను ఇవ్వడం వల్ల పిల్లలకు పోషకాలు అందుతాయి.
మనం దీనిలో నెయ్యి, జీడిపప్పు ఎక్కువగా వినియోగించాము. జీడిపప్పు తినడం వల్ల శరీరానికి మంచి కొవ్వులు అందుతాయి. దీనిలో ప్రోటీన్ కూడా నిండుగా ఉంటుంది. జీడిపప్పులో సెలీనియం అధికంగా ఉంటుంది. కాబట్టి చర్మం మెరవడం ఖాయం. అలాగే విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. విటమిన్ E చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇది కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనిలో మెగ్నీషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. గుండెకు రక్త సరఫరా మెరుగయ్యేలా చేయడంలో మెగ్నీషియం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. ఇందులో వాడిన మరో ముఖ్యపదార్థం నెయ్యి. ప్రతిరోజూ ఒక స్పూన్ నెయ్యి తినమని పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. దీనిలో కూడా మంచి కొవ్వులు ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. మన గుండె ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చాలా ముఖ్యం. కరోనరీ ఆర్టరీ వ్యాధులు వంటివి రాకుండా అడ్డుకోవడంలో నెయ్యిలోని కొలెస్ట్రాల్ సహాయపడుతుంది. మితంగా తింటే నెయ్యి చాలా ఆరోగ్యకరం. అతిగా తింటే మాత్రం కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కాబట్టి రోజుకి ఒకటి స్పూన్ నెయ్యిని తింటే మంచిది. రోజుకో స్పూన్ నెయ్యి తినడం వల్ల ఎవరూ బరువు పెరగరు. నెయ్యి, పాలపొడి, జీడిపప్పులు చేసి వేసి చేసిన ఈ లడ్డు అన్ని రకాలుగా ఆరోగ్యకరమే.