dandruff home remedies in telugu: చుండ్రును శాశ్వతంగా వదలించుకోవచ్చా?
20 March 2023, 12:20 IST
- dandruff home remedies in telugu: చుండ్రును శాశ్వతంగా వదలించుకోవచ్చా? డెర్మటాలజిస్టు సలహాలు ఇవే.
చుండ్రును శాశ్వతంగా వదలించుకోవచ్చా?
dandruff home remedies in telugu: జుట్టులో చుండ్రు విపరీతమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మన జుట్టులో మనందరికీ నచ్చని విషయం ఏమిటంటే చుండ్రు ఉండటం. ఇది మీకు ఇబ్బందిగా అనిపించడమే కాకుండా శిరోజాల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అంతేకాకుండా చుండ్రు వల్ల తలపై దురద, పొట్టు ఊడడం, పొడిబారడం వంటి చాలా అసౌకర్యమైన, అసహ్యకరమైన ఇబ్బందులను కలిగిస్తాయి.
చుండ్రు ఎందుకు వస్తుంది?
ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం, కాలుష్యం, తల పరిశుభ్రంగా లేకపోవడం వంటి కారణాల వల్ల చుండ్రు ఏర్పడొచ్చు. అయితే మీరు కొన్ని చిట్కాలను అనుసరించడం, కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా చుండ్రును నియంత్రించవచ్చు. చుండ్రును శాశ్వతంగా వదిలించుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు. సాధ్యం కాకపోవచ్చు కూడా. కానీ కొన్ని చిట్కాలతో దీన్ని కచ్చితంగా నియంత్రించవచ్చు.
చుండ్రును నియంత్రించడంలో మీకు సహాయపడే కొన్ని సులభమైన చిట్కాలను చెన్నై అర్బన్ కంపెనీకి చెందిన సిటీ హెడ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ బన్సారీ దావ్డా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు వివరించారు.
1. మీ తలని శుభ్రంగా ఉంచుకోండి
చుండ్రు అనేది మీ హెయిర్ ఫోలికల్స్ బేస్ చుట్టూ మలాసెజియా అనే ఈస్ట్ పేరుకుపోవడం వల్ల ఏర్పడే ఒక దీర్ఘకాలిక పరిస్థితి. అపరిశుభ్రమైన స్కాల్ప్ ఫంగస్‌కు ఆహారాన్ని అందిస్తుంది. ఇది చుండ్రుకు దారి తీస్తుంది. కాబట్టి చుండ్రును దూరంగా ఉంచడానికి స్కాల్ప్(మాడు) ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి.
కెటోకానజోల్ లేదా జింక్ పైరిథియోన్ లేదా సెలీనియం సల్ఫైడ్ లేదా పిరోక్టోన్ ఒలమైన్‌తో కూడిన షాంపూని వాడడం ద్వారా చుండ్రును నివారించవచ్చు. దీనిని కనీసం 5-10 నిమిషాల పాటు తలపై ఉంచి, ఆపై స్కాల్ప్‌ను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. చుండ్రు నియంత్రణ కోసం మొదట్లో వారానికి 2-3 సార్లు యాంటీ-డాండ్రఫ్ షాంపూలను ఉపయోగించాలి. తర్వాత వారానికి ఒకసారి ఉపయోగించండి.
2. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి
ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ జోలికి వళ్లొద్దు. ఇవి ఈస్ట్ పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. తద్వారా చుండ్రు పెరుగుతుంది. విటమిన్ బి, జింక్, ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు చుండ్రును నివారించడంలో సహాయపడతాయి. అవిసె గింజలు, గుడ్లు, చిక్కుళ్లు, అరటి పండ్లు, కొవ్వు చేపలు, పెరుగు వంటివి తలపై అధిక సెబమ్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడతాయి. స్కాల్ప్‌ను తేమగా ఉంచడంలో కూడా సహాయపడతాయి.
3. జుట్టుకు నూనె రాసుకోవద్దు
జనాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధమే అయినప్పటికీ మీ జుట్టుకు నూనె రాయడం చుండ్రును తగ్గించడంలో ఎంతమాత్రం సహాయపడదు. నిజానికి నూనె రాసుకోవడం వల్ల మీ చుండ్రు మరింత తీవ్రమవుతుంది. ఇది తలపై ఉండే ఫంగస్‌ను పెంచి పోషిస్తుంది. కాబట్టి మీ జుట్టుకు నూనె రాయకండి, ముఖ్యంగా మీకు చుండ్రు ఉన్నప్పుడు నూనె అస్సలే రాయొద్దు.
4. హెయిర్ కేర్ ఉత్పత్తులను ఉపయోగించండి
శిరోజాల సంరక్షణ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ మొత్తంలో హెయిర్ కేర్ ఉత్పత్తులు వాడితే అది మీ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. డ్రై షాంపూ, హెయిర్ స్ప్రేలు, ఇతర హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తుల అవశేషాలు మాడును దెబ్బతీస్తాయి. ఇది చుండ్రుకు కారణమవుతుంది. కాబట్టి చుండ్రు లేకుండా ఉండడానికి ఈ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించండి.
5. ఒత్తిడిని తగ్గించుకోండి
అనేక వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణాలలో ఒకటి. మీ చుండ్రు కూడా ఒత్తిడి వల్ల పెరిగే ముప్పు ఉంది. ఒత్తిడి ఉంటే శరీరం ఫంగల్ ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో విఫలమవుతుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించడానికి శ్వాస వ్యాయామాలు, శారీరక వ్యాయామాలు, ధ్యానం ఎంచుకోండి.