తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: డయాబెటిక్ పేషెంట్లు పల్లీలు తినవచ్చా? తినే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

Diabetes: డయాబెటిక్ పేషెంట్లు పల్లీలు తినవచ్చా? తినే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

04 December 2024, 12:30 IST

google News
  • Diabetes:  వేరుశెనగలు ఉడకబెట్టుకుని, కాల్చుకుని తినే వారు ఎక్కువే. ముఖ్యంగా గ్రామాల్లో వీటిని అధికంగా తింటూ ఉంటారు. అయితే షుగర్ పేషెంట్లు వేరుశెనగ తినడం సురక్షితమేనా కాదా అనే అయోమయం ఎంతో మందిలో ఉంది. 

పల్లీలు డయాబెటిక్ పేషెంట్లు తినొచ్చా?
పల్లీలు డయాబెటిక్ పేషెంట్లు తినొచ్చా?

పల్లీలు డయాబెటిక్ పేషెంట్లు తినొచ్చా?

చలికాలంలో సాయంత్రం పూట ఉడికించిన పల్లీలను లేదా వేయించిన పల్లీలను వేడి వేడిగా తింటున్నారా? ఆరోగ్యానికి అవి మంచివే. నిజానికి వేరుశెనగను మించిన చిరుతిండి మరొకటి ఉండదు. వేరుశెనగ తింటే త్వరగా పొట్ట నిండిపోతుంది కూడా. వీటిలో ఉండే క్యాల్షియం, విటమిన్ డి ఎముకలను బలోపేతం చేస్తాయి. వేరుశెనగలో ఉండే మంచి కొలెస్ట్రాల్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మొత్తంమీద, వేరుశెనగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ పేషెంట్లు వేరుశెనగ తినవచ్చా లేదా అనే అయోమయం ఉంటుంది. 

డయాబెటిస్ ఉండే పల్లీలు తినవచ్చా?

మధుమేహ వ్యాధిగ్రస్తులకు వేరుశెనగ ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేరుశెనగలో లభించే మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. వేరుశెనగ  గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే వేరుశెనగ తిన్న తరువాత రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు. ఇది కాకుండా, వేరుశెనగలో అసంతృప్త కొవ్వు, సూక్ష్మపోషకాలు, ప్రోటీన్, మెగ్నీషియం, ఫైబర్ ఇలా అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ డయాబెటిస్ పేషెంట్లు వేరుశెనగ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎక్కువ తింటే ప్రమాదం

వేరుశెనగ తినడం డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరంగానే ఉంటుంది. అయితే దీన్ని తినేటప్పుడు కొన్ని విషయాల్లో  జాగ్రత్త తీసుకోవాలి. షుగర్ పేషెంట్లు వేరుశెనగను ఎక్కువ మోతాదులో తినకూడదు. ఎందుకంటే వేరుశెనగలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. వీటిని అధికంగా తింటే తినడం ద్వారా శరీరం ఊబకాయం బారిన పడుతుంది. దీని వల్ల  డయాబెటిస్ తీవ్రత కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. మితంగా తింటేనే మధుమేహ రోగులకు పల్లీలు మేలు చేస్తాయి. 

అంతేకాదు డయాబెటిస్ రోగులు బయట ప్యాక్ చేసి అమ్మే పల్లీలను తినకూడదు. వీటిలో ఉప్పును అధికంగా కలుపుతారు. అలాంటి పల్లీలు తింటే వీరి ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అమాంతం పెరుగుతాయి. డయాబెటిస్ పేషెంట్లు ఉప్పు వేయకుండా ఉడికించిన పల్లీలను లేదా కళాయిలో వేయించిన వేరుశెనగ మాత్రమే తినాలి. వేరుశెనగలను నూనెలో వేయించి చేస్తే మాత్రం వాటిని తినకపోవడమే ఉత్తమం.

గుండె ఆరోగ్యానికి పల్లీలు ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని తక్కువగా మాత్రమే తినాలి. అతిగా తింటే అవే గుండెకు హానికరంగా మారుతాయి. వాటిని ప్రతిరోజూ గుప్పెడు తినండి చాలు మెదడు పనితీరుకు ఎంతో సహకరిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. జీర్ణవ్యవస్థకు కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటివని పోషకాల పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు. మధుమేహులు వీటిని రోజుకు గుప్పెడు తినడం అలవాటు చేసుకుంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

తదుపరి వ్యాసం