Tomato replacements: టమాటాకు బదులుగా ఇవి వాడండి.. రుచిలో మార్పుండదు..
09 July 2023, 12:04 IST
Tomato replacements: టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో కూరల్లో వాటికి బదులుగా ఏం వాడొచ్చో కొన్ని ప్రత్యామ్నాయాల గురించి తెలుసుకుందాం.
టమాటాకు ప్రత్యామ్నాయాలు
వంట చేస్తున్నామంటే దాదాపు అన్ని భారతీయ వంటల్లో టమటా కావాల్సిందే. కూరలు, గ్రేవీలకు టమాటా లేనిదే రుచి రాదు. కానీ పెరిగిన టమాటాల వల్ల దాని వాడకం గురించి కాస్త ఆలోచించాల్సి వస్తోంది. టమాటా వేసుకోకుండా కొన్ని వంటలు ప్రయత్నించినా కూడా దాని అవసరమైతే వస్తుంది. పూర్తిగా వాడకుండా ఉండలేం. ఈ మధ్య ముఖ్య నగరాల్లో టమాటా ధరలు చూసుకుంటే.. అహ్మదాబాద్ లో 264%, డిల్లీలో 186%, బెంగళూరులో 185% పెరిగాయి. దాదాపు అన్ని చోట్లా ఇదే తీరు కొనసాగుతోంది.
ట్విట్లర్ లో ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైసర్ ఆదిత్య షా మెక్ డొనాల్డ్స్ ట్వీట్ షేర్ చేశారు. డిల్లీలో ఈ కంపెనీ బర్గర్లలో టమాటా వాడబోమని తెలిపే ట్వీట్ అది.
పెద్ద పెద్ద సంస్థలే టమాటా వాడకం గురించి ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నపుడు రోజూవారీ అవసరాల్లో కూడా మనం కొన్ని మార్గాలు వెతుక్కుంటే మంచిదే. కాస్త రుచిలో మార్పుతో టమాటాలకు బదులుగా ఏం వాడాలో చూద్దాం.
టమాటా మనం దేశంలోకి రాకముందు..:
టమాటాలను మన దేశంలో పోర్చుగీసు వాళ్లు 16 వశతాబ్దంలో పరిచయం చేశారు. అంతకముందు కూరల్లో పులుపు కోసం పెరుగు వాడేవారు. మాంసాహారం మ్యారినేషన్ లో కూడా పెరుగునే పూర్తిగా వాడేవారు. ఇప్పుడు వంటల్లో కూడా పులుపు కోసం పెరుగు వాడి చూడొచ్చు. కానీ మఖానా గ్రేవీ, పన్నీర్ గ్రేవీ లాంటి కూరల్లో మాత్రం పూర్తిగా టమాటాలు వాడకుండా ఉండటం కష్టమే.
చెఫ్ సలహాలు:
యూట్యూబ్ లో మంచి వంటలతో ప్రాచుర్యం పొందిన చెఫ్ సంజ్యోత్ కీర్ కూడా దీని గురించి ఒక సలహా ఇచ్చారు. టమాటా తప్పనిసరిగా వాడాల్సి వస్తే ప్యాకేజ్డ్ టమాటో ప్యూరీ వాడొచ్చు. దీని ధర దాదాపు సంవత్సరమంతా ఒకేలా ఉంటుంది. దీన్ని వాడితే టమాటా వాడినట్లే అనిపిస్తుంది. పెరుగుతో పాటే కొన్ని వంటల్లో కాస్త కారం, ఉల్లిపాయ ముక్కలు కలిపి వాడితే రంగు కూడా వస్తుంది. పెరుగు ఎక్కువగా వాడలేకపోతే కొన్ని స్నాక్స్ తయారీలో టమాటో కెచప్ కూడా కాస్త వాడొచ్చు అని సలహా ఇచ్చారాయన.
చింతపండు గుజ్జు:
ఇంకో ప్రముఖ చెఫ్ టమాటాకు బదులు చింతపండు గుజ్జు వాడొచ్చని సలహా ఇచ్చారు. ఏవైనా సాసులు, చట్నీలు చేస్తున్నపుడు చింతపండు వాడొచ్చు. అలాగే దాదాపు పులుపు ఉండే చాలా సాంప్రదాయ వంటల్లో చింతపండునే వాడి చేసుకోవచ్చు.
పులుపు కోసం ..
అలాగే కూరల్లో పులుపు కోసం ఆమ్ చూర్ పొడి, పులుపుగా ఉండే చుక్క కూర లాంటి ఆకుల పొడి లేదా తాజా ఆకులు, వంగమామిడి ముక్కలు, పచ్చి మామిడి వరుగు లాంటి వాటిని కూరల్లో చేర్చుకోవచ్చు. ఇవన్నీ పులుపుతో పాటూ కూర రుచిని కూడా పెంచుతాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి.
టాపిక్