Bisi Bele Bath: కర్ణాటక స్పెషల్ బిసిబెలె బాత్ రెసిపీ, మసాలా తయారీతో సహా చూసేయండి..
19 July 2023, 19:00 IST
Bisi Bele Bath: కర్ణాటక స్పెషల్ బిసి బెలె బాత్ తయారీ, దాంట్లో వాడే మసాలా తయారీ ఎలాగో చూసేయండి.
బిసిబెలె బాత్ రెసిపీ
అన్నం, పప్పు, కూరగాయలతో కలిపి చేస్తారు బిసిబెలె బాత్. ఈ వంటలో ముఖ్యమైంది ఈ అన్నం చేయడానికి అవసరమయ్యే బిసిబెలె మసాలా. అందుకే ఆ మసాలా తయారీతో పాటూ, బిసిబెలె బాత్ కూడా ఎలా చేయాలో చూసేయండి.
బిసి బెలె బాత్ మసాలా:
కావాల్సిన పదార్థాలు:
దాల్చిన చెక్క - 5 గ్రాములు
లవంగాలు - 2 గ్రాములు
శనగలు - 20 గ్రాములు
మినప్పప్పు - గ్రాము
ఇంగువ - 10 గ్రాములు
కొత్తిమీర - 50 గ్రాములు
గుంటూరు మిరపకాయలు - 10
కరివేపాకు - 5 టేబుల్ స్పూన్లు
గసగసాలు - 10 గ్రాములు
పసుపు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
యాలకులు - 2
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఈ పదార్థాల నుండి పావు కేజీ బిసి బేలే బాత్ పౌడర్ తయారు చేయవచ్చు
బిసిబెలె బాత్ పొడి తయారు చేసే విధానం:
- మందపాటి అడుగున్న పాన్‌లో నూనె వేడి చేసి ఇంగువ, దాల్చిన చెక్క, లవంగాలు వేసి తక్కువ మంటమీద 30 సెకన్ల పాటు వేయించాలి.
- శనగలు, మినప్పప్పు, యాలకులు కూడా వేసుకుని రంగు మారేవరకు వేయించుకుని తీసుకోవాలి.
- ఇప్పుడు నూనె లేకుండా జీలకర్ర, గసగసాలు, గుంటూరు మిర్చి, కరివేపాకు, పసుపు వేసుకుని వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు మిక్సీలో శనగలు, మిరపకాయలు వేసుకుని పొడి చేసుకోవాలి. ఇవి మెత్తని పొడిలా అయ్యాక మిగిలిన పదార్థాలన్నీ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటే బిసి బెలె బాత్ పౌడర్ రెడీ.
బిసిబెలె బాత్ తయారీ విధానం:
కావాల్సిన పదార్థాలు:
సగం కప్పు కందిపప్పు
సగం కప్పు బియ్యం
పావు చెంచా పసుపు
3 చెంచాల నూనె
2 చెంచాల నెయ్యి
సగం చెంచా ఆవాలు
2 ఎండుమిర్చి
చిటికెడు ఇంగువ
2 చెంచాల పల్లీలు
1 కరివేపాకు రెబ్బ
చిన్న ఉల్లిపాయ(ముక్కలు)
1 క్యారట్(ముక్కలు)
1 బంగాళదుంప (ముక్కలు)
2 చెంచా బటానీ
5 బీన్స్ (ముక్కలు)
సగం టమాటా (ముక్కలు)
సగం చెంచా పసుపు
సగం కప్పు చింతపండు గుజ్జు
3 చెంచాల బిసి బెలె బాత్ మసాలా
1 చెంచా కారం
తగినంత ఉప్పు
తయారీ విధానం:
- ముందుగా ప్రెజర్ కుక్కర్ లో కందిపప్పు, బియ్యం, పావు చెంచా పసుపు, ఒక చెంచా నూనె వేసుకుని మూడు కప్పులు నీళ్లు పోసుకుని 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
- ఇప్పుడొక కడాయిలో రెండు చెంచాల నూనె, రెండు చెంచాల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, పల్లీలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి.
- ఉల్లిపాయ ముక్కలు వేసుకుని రంగు మారాక, క్యారట్, బంగాళదుంప, బటానీ, బీన్స్, టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. కాస్త పసుపు, ఉప్పు వేసుకుని కలియబెట్టాలి.
- కూరగాయ ముక్కలన్నీ కాస్త మెత్తబడ్డాక రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించుకోవాలి. కూరగాయలన్నీ ఉడికాక చింతపండు గుజ్జు కూడా పోసుకోవాలి.
- ఇప్పుడు బిసి బెలె బాత్ మసాలా, కారం, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇందులో ఉడికించుకున్న బియ్యం, పప్పు మిశ్రమం వేసుకోవాలి.
- సన్నం సెగ మీద ఉడికించుకుని, చివరగా నూనెలో వేయించిన జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు వేసుకుంటే చాలు. బిసి బెలె బాత్ రెడీ.