తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Memories: పిల్లల గుర్తులను పదిలంగా దాచుకునేందుకు వినూత్న మార్గాలివే

Memories: పిల్లల గుర్తులను పదిలంగా దాచుకునేందుకు వినూత్న మార్గాలివే

29 October 2024, 18:59 IST

google News
  • Memories: చిన్న పిల్లలకు సంబంధించిన జ్ఞాపకాలు భద్రపరుచుకునేందుకు అనేక మార్గాలున్నాయి. వాళ్ల చేతి అచ్చుల నుంచి పాలసీసా దాకా దాచుకునేందుకు వినూత్న మార్గాలు అందుబాటులోకి వచ్చేశాయి. అవేంటో చూడండి.

చిన్న పిల్లల జ్ఞాపకాలు
చిన్న పిల్లల జ్ఞాపకాలు (pinterest)

చిన్న పిల్లల జ్ఞాపకాలు

నెలల వయసున్న పసిపిల్లల బుజ్జి బుజ్జి చేతుల అచ్చుల నుంచి వాళ్లకు సంబంధించిన జ్ఞాపకాలు పదిలంగా దాచుకోడానికి కొన్ని మార్గాలున్నాయి. వినూత్నమైన పద్ధతులతో ఆ తీపి గుర్తులు మన కళ్ల ముందు ఎప్పటికీ కనిపించేలా చేసుకోవచ్చు.

త్రీడీ క్యాస్టింగ్:

ఇదివరకు త్రీడీ క్యాస్టింగ్ అంటే ప్రొఫెషనల్స్‌ను ఇంటికి పిలిచి చేయించాల్సి వచ్చేది. అది కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో మనం ఇంట్లోనే సులభంగా క్యాస్టింగ్ చేసుకునేలా కిట్స్ వచ్చేశాయి. వాటితో మీ చిన్నారుల చేతులు, కాళ్లకు సంబంధించిన త్రీడీ బొమ్మల్ని మీరే చేసుకోవచ్చు. తల్లిదండ్రులిద్దరు పాప చేతులు వాళ్ల చేతుల్లో ఉన్నట్టుగా క్యాస్టింగ్ చేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్. మీరూ ప్రయత్నించి చూడండి.

అక్రైలిక్ ఫ్రేములు:

ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన కిట్,పాప బొడ్డు తాడు, మీ పాప మొదటి గోరు, మొదటి సారి కత్తిరించిన జుట్టు, పాప ఫోటో, తల్లిదండ్రుల ఫోటోలు.. ఇలా పాపకు సంబంధించిన వస్తువులన్నీ ఒక చోట పెట్టి మంచి అక్రైలిక్ ఫ్రేమ్ చేయించుకోవచ్చు. వాటిని వివిధ రకాల డిజైన్లతో ట్రెండీగా తయారు చేస్తున్నారిప్పుడు.

బ్రెస్ట్ మిల్క్ జ్యువెలరీ:

తల్లిపాలను ఒక మధుర జ్ఞాపకంగా మార్చేస్తాయి బ్రెస్ట్ మిల్క్ జ్యువెలరీ. తల్లిపాలతో మనకు కావాల్సిన జ్యువెలరీ చేసిస్తున్నారు. పెండెట్లు, చెవిపోగులు, ఉంగరాలు.. ఇలా తల్లిపాలను ఒక విధానంతో గడ్డకట్టించి వీటిని తయారు చేస్తారు. ఇవి కూడా ఇంట్లోనే చేసుకునేలా డీఐవై బ్రెస్ట్ మిల్క్ జ్యువెలరీ కిట్స్ దొరుకుతున్నాయి. వాటిని కూడా ప్రయత్నించి చూడొచ్చు.

మెమొరీ క్విల్ట్:

చిన్న పిల్లలకు చాలా బట్టలు కొనేస్తాం. వాటన్నింటినీ కలిపి ఒక మెత్తని బొంత కుట్టించొచ్చు. కాస్త ఫ్యాన్సీగా చెప్పాలంటే క్విల్ట్ అన్నమాట. పాప డ్రెస్సులన్నీ కలిపి చాలా అందమైన క్విల్టులు తయారు చేసిచ్చే సైట్లు బోలెడున్నాయి. వాళ్లకు మన పాప బట్టలు కొరియర్ చేస్తే చాలు. తయారు చేసి ఇంటికి పంపిస్తారు. ఇది మంచి గుర్తులా ఉండిపోతుంది.

ఫూట్ ప్రింట్స్:

త్రీడీ అచ్చులు చేసుకోవడం ఇష్టం లేకపోయినా, కష్టం అనిపించినా.. కాస్త సులభమైన పద్ధతి వాళ్ల పాద, చేతి ముద్రల్ని భద్రపర్చుకోవడం. నాన్ టాక్సిక్ ఇంకు తీసుకుని వాటిలో చిన్నారి పాదాలు, చేతులు ముంచి ఏదైనా కాన్వాస్ లేదా తెల్లని గుడ్డమీద అచ్చులు పెట్టాలి. దీన్ని చక్కగా ఫ్రేమ్ చేయించుకోవచ్చు.

పాలసీసాతో:

మీ పాప వాడిన పాలసీసాను అందమైన డెకొరేషన్ వస్తువులాగా మార్చేయొచ్చు. దానికి మంచి పెయింటింగ్ వేయొచ్చు. లేదా సీసాలో రంగు రాళ్లు, మెరిసే కుందన్లు, రంగురంగుల ఇసుక లాంటివి నింపి అందంగా మార్చేయొచ్చు.

ఇలా పసి పిల్లలకు సంబంధించిన ప్రతి వస్తువును భద్రపర్చుకునేందుకు ఇంకా అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చేశాయి. మీ అవసరాన్ని బట్టి వాటిని ఎంచుకోండి.

 

టాపిక్

తదుపరి వ్యాసం