Breastfeeding week: బ్రెస్ట్ మిల్క్ పంప్ వాడటం మంచిదేనా? నేరుగా పాలిస్తేనే ఆరోగ్యమా?
World breastfeeding week: తల్లికుండే అవసరాల దృష్ట్యా కొన్నిసార్లు శిశువుకు నేరుగా పాలివ్వడం వీలుకాదు. దాంతో బ్రెస్ట్ మిల్క్ పంప్ వాడాల్సి వస్తుంది. నేరుగా పాలివ్వడానికి, పంపుతో పాలివ్వడానికి ఏమైనా తేడా ఉంటుందో తెల్సుకోండి. డాక్టర్ వైశాలి శర్మ నుంచి ఈ సమాధానాలు తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటారు. తల్లులు పాలివ్వడం యొక్క ప్రాముఖ్యతను, తల్లి పాలివ్వడం వల్ల శిశువుకు, తల్లికీ ఉండే ప్రయోజనాలను తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది థీమ్ 'గ్యాప్ క్లోజింగ్ - బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్'. దీని అర్థం తల్లి పాలివ్వడం గురించి అందరూ అవగాహనతో ఉండాలి.తల్లులు శిశువుకు పాలు పట్టడంలో ఎక్కడా ఇబ్బంది పడకుండా చూసుకోవాలి.
ఇక తల్లిపాలు పట్టే విషయంలో బ్రెస్ట్ పంప్ వాడటం ఉత్తమమేనా లేదా నేరుగా పిల్లలకు పాలు పడితేనే పూర్తి ప్రయోజనాలు పొందగలమా అనే గందరగోళం ప్రతి తల్లిలో ఉంటుంది. దీని గురించి డాక్టర్ వైశాలి శర్మ స్పష్టమైన వివరణ ఇచ్చారు.
నవజాత శిశువు జన్మించిన వెంటనే, తల్లి పాలు పట్టడానికి రెండు మార్గాలుంటాయి. ఒకటి నేరుగా పాలివ్వడం, రెండోది బ్రెస్ట్ మిల్క్ పంప్ వాడటం. రెండు పద్ధతులు వాటి స్వంత ప్రయోజనాలు, నష్టాలను కలిగి ఉంటాయి. ప్రతి తల్లి వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా తనకు ఒక మంచి విధానం ఎంపిక చేసుకోవచ్చు. ఈ రెండింటి గురించి వివరంగా తెల్సుకోండి.
బ్రెస్ట్ పంపింగ్ అంటే ఏమిటి?
శిశువుకు ఆహారం ఇవ్వడానికి తల్లి పాలివ్వడం సాధారణ మార్గం. ఇది తల్లీబిడ్డల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. నవజాత శిశువు అభివృద్ధికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. దీనివల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి బలంగా ఉండి బిడ్డ తక్కువ అనారోగ్యానికి గురవుతాడు. బ్రెస్ట్ పంప్స్ గురించి మాట్లాడితే, తల్లులు రొమ్ము నుండి పాలను నేరుగా పిల్లలకు పట్టకుండా నిల్వ చేసి ఉంచుతారు. బ్రెస్ట్ పంప్ సహాయంతో, తల్లికి బిడ్డకు పాలు ఇవ్వడానికి, పని తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి లేదా ఆఫీసుకు వెళ్లడానికి అవకాశం లభిస్తుంది. ఈ పద్ధతిలో బిడ్డకు నేరుగా తల్లిపాలు ఇవ్వడం సాధ్యం కానప్పటికీ, బ్రెస్ట్ పంప్ సహాయంతో తల్లిపాలు ఇవ్వవచ్చు.
పాల ఉత్పత్తి:
పాల సరఫరా అనేది పూర్తిగా శిశువుకు ఎన్నిసార్లు ఫీడింగ్ ఇస్తున్నారు, లేదా పంప్ చేస్తున్నారనే విషయం మీదే ఆధారపడి ఉంటుంది. దాన్నిబట్టే శరీరం పాలను ఉత్పత్తి చేస్తుంది. కానీ నేరుగా శిశువుకు పాలు పడితే శిశువు స్పర్శతో పాల ఉత్పత్తి మరింత సమర్థవంతంగా ప్రేరేపితమవుతుంది. రొమ్మును పూర్తిగా ఖాళీ చేసే అవకాశం ఉంటుంది. పంప్ వాడినా కూడా సరైన పద్ధతి అవలంబిస్తే తల్లిపాల సరఫరా పెరుగుతుంది.
ఏ పద్ధతి మంచిది? వైద్యుల సలహా ఇదే:
శిశువుకు నేరుగా తల్లి పాలివ్వడమే ఉత్తమ మార్గం. శిశువు స్పర్శతో మంచి బంధం ఏర్పడుతుంది. భావోద్వేగాల్ని బలపరుస్తుంది. అంతేకాకుండా తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డ అవసరాలకు అనుగుణంగా తల్లి పాల ఉత్పత్తి, ధార నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల పిల్లలకు అతిగా పాలు పట్టడం, జీర్ణ సమస్యలు రావడం లాంటి ఇబ్బందులుండవు.
అలాగే బిడ్డకు పాలు ఇవ్వడానికి పంప్ వాడినా కూడా పిల్లలకు అవే పోషకాలు అందుతాయి. పంపింగ్ సహాయంతో ఆమె ఆకలిని తీర్చి, శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందించవచ్చు. పాలు పట్టడంలో ఇబ్బంది ఉన్న లేదా వైద్య పరంగా ఇబ్బందులు ఉన్న పిల్లలకు కూడా పంపింగ్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
నేరుగా పాలు పట్టేటప్పుడు జాగ్రత్తలు:
సరిగ్గా కూర్చోవడం:
తల్లి, బిడ్డ ఇద్దరూ సరైన స్థతిలో ఉండేలా చూసుకోవాలి. వెనక దిండు పెట్టుకుని కూర్చుని పాలిస్తే సౌకర్యంగా ఉంటుంది.
ఆకలిగా ఉన్నప్పుడు:
పిల్లలకు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే సమయానుసారంగా పాలు పట్టాలి. అవసరం లేకుండా ఫీడింగ్ ఇవ్వకూడదు.
ఆహారం:
పాల సరఫరాను నిర్వహించడానికి తల్లి పోషకాహారం తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.
పంప్ వాడేటప్పుడు జాగ్రత్తలు:
సాధారణంగా బ్రెస్ట్ పంపును ఉపయోగించే ముందు బిడ్డకు తల్లి పాలివ్వాలని సలహా ఇస్తారు. అంటే కనీసం మూడ్నాలుగు వారాలైనా తల్లిపాలు పట్టాలి. దాంతో ఇద్దరి మధ్య బంధం పెరుగుతుంది. తల్లిపాలకు అలవాటు ఏర్పడుతుంది. అంతకముందే బ్రెస్ట్ పంప్ వాడటం వల్ల కాస్త ఇబ్బంది ఉండొచ్చు.
పంప్ నాణ్యత:
పాలను పంప్ చేయడానికి నాణ్యమైన బ్రెస్ట్ పంప్ వాడాలి. లేదంటే పాలు సరిగ్గా బయటకు రాకపోగా, నొప్పి కూడా వస్తుంది.
నిల్వ: పాలను నిల్వ చేయడానికి శుభ్రంగా కడిగిన కంటైనర్లను ఉపయోగించండి.
పంపింగ్ నియమాలు: బిడ్డకు పాలు ఇవ్వడానికి సూచించిన పరిమాణం నియమాలు పాటించాలి. పాల ఉత్పత్తి పెరగడానికి క్రమం తప్పకుండా పంపింగ్ చేయాలి.
పరిశుభ్రత: ఇన్ఫెక్షన్లను నివారించడానికి పరిశుభ్రతను పాటించండి. ప్రతిసారీ పంప్ వాడిన తర్వాత పంప్‌ను సరిగ్గా శుభ్రం చేయండి.
శిశువుకు తల్లి పాలివ్వాలా లేదా బ్రెస్ట్ పంపును ఉపయోగించాలా అనేది ప్రతి తల్లి యొక్క వ్యక్తిగత పరిస్థితులు, అవసరాలపై ఆధారపడి ఉంటుంది. రెండు పద్ధతులు వాటి స్వంత ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.
టాపిక్