DIY rakhis: బియ్యం, డ్రై ఫ్రూట్స్.. మరెన్నో వాడి బెస్ట్ రాఖీ మీరే చేసేయొచ్చు.. కొన్న రాఖీ కన్నా వీటితో ఎక్కువ సంతృప్తి
17 August 2024, 10:30 IST
DIY rakhis: సోదరుడి చేయికి రాఖీ కట్టడంలో ఉన్న ఆనందం రెట్టింపు అవ్వాలంటే మీ చేత్తో రాఖీ తయారు చేేసి కట్టండి. అది వాళ్లకు నచ్చితే సంతోషంగా ఉంటుంది. చాలా సింపుల్‌గా ఇంట్లో ఉండే వస్తువులతోనే వీటిని తయారు చేయొచ్చు. కాస్త ఓపిక తెచ్చుకోవాలే గానీ బయటి రాఖీలకన్నా ఈ రాఖీలు మరింత అందంగా తయారు చేసేయొచ్చు.
డీఐవై రాఖీలు
రాఖీ పండగ దగ్గరికి వచ్చేసింది. ఆగస్టు 19 న రాఖీ పండగ. పండగకోసం ప్రత్యేకంగా ఏమైనా చేయాలనుకుంటే తొందరగా చేసేయాల్సిందే. రాఖీలు బయట మార్కెట్ నుంచి తెచ్చి కట్టకుండా మీ చేతుల్తోనే రాఖీ తయారు చేయండి. ఆ రాఖీలు పండగ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. మీరు తయారు చేసిన రాఖీ సోదరుడి చేతికి చూస్తే మరింత బాగనిపిస్తుంది. మీరయినా, ఇంట్లో చిన్న పిల్లలైనా వీటిని సులువుగా చేసేయొచ్చు. చాలా సింపుల్‌గా రెడీ అయిపోయే ఈ రాఖీ ఐడియాలు చూసేయండి.
1. బియ్యంతో చేసిన రాఖీలు:
పైన ఫొటోలో చూయించిన రాఖీ బియ్యంతో తయారు చేసింది. దాన్ని చేయడం చాలా సింపుల్. చూడ్డానికి ఇంట్లో చేసిన రాఖీ అన్నట్లు కనిపించదు కూడా. దానికోసం చిన్న అట్టముక్కను గుండ్రంగా కానీ, మీకిష్టమైన ఏదైనా ఆకారంలో కత్తిరించండి. దానిమీద గ్లూ పెట్టి వరసల్లో బియ్యం అతికించండి. మధ్యలో ఇంట్లో ఉండే కుందన్ ఏదైనా అతికించండి. రాఖీ దారాల కోసం ఏదైనా డోరీ ఉంటే రెండు వైపులా అతికించేయండి చాలు.
2. డ్రై ఫ్రూట్ రాఖీ:
ప్రతి డ్రై ఫ్రూట్ ఒక్కో ప్రత్యేక ఆకారంలో ఉంటుంది. కాజూ, బాదాం, ఎండు ద్రాక్ష, పిస్తా, పిస్తా పొట్టు.. వీటన్నింటితోనూ మంచి రాఖీ చేయొచ్చు. అట్టముక్క మీద వీటిని అతికిస్తే సరిపోతుంది. వీటితోనే కాకుండా ఇంట్లో మసాలా దినుసులతోనూ చేయొచ్చు. లవంగాలు, యాలకులు, అనాస పువ్వు లాంటి వాటితో కూడా మంచి ఆకారం తయారు చేసి రాఖీ చేయొచ్చు.
3. గుమ్మడి గింజలు:
గుమ్మడి గింజలు ఎండిపోయాక వాటికి మీకిష్టమైన రంగులు వేయొచ్చు. వాటిని గ్లూ సాయంతో గుండ్రంగా వరసల్లో అట్ట మీద అతికిస్తే చాలు. గుమ్మడి గింజల రాఖీ రెడీ అయినట్లే.
4. క్విల్టెడ్ రాఖీ:
పేపర్ క్విల్లింగ్ చేయడం చాలా సులువు. సన్నంగా ఉండే రంగు కాగితాల్ని చుట్టి రకరకాల ఆకారాలు తయారు చేయొచ్చు. వాటిని మధ్యలో ఉంటే అటూ ఇటూ డోరీలు అంటిస్తే క్విల్టెడ్ రాఖీ రెడీ అవుతుంది. దీన్ని మరింత అందంగా మార్చడానికి మెటాలిక్ పెయింట్లు వేయొచ్చు. లేదా స్టోన్లు, కుందన్లు అతికించొచ్చు.
5. క్లే రాఖీ:
మార్కెట్లో చాలా తక్కువ ధరకే ఎయిర్ డ్రై క్లే దొరుకుతోంది. దాని సాయంతో చిన్న చిన్న జంతువుల బొమ్మలు, పూల ఆకారాలు చేయొచ్చు. మీ సోదరుడికి పీజ్జా ఇష్టం అయితే ఆ ఆకారంలో ఈ క్లేతో తయారు చేయొచ్చు. దానికి వినూత్న మైన రంగులు జోడిస్తే అదిరిపోయే రాఖీ రెడీ అవుతుంది.