Camphor: స్నానం చేసే నీటిలో ఒక కర్పూరం బిల్ల వేసుకోండి, అందం నుంచి ఆరోగ్యం దాకా లాభాలెన్నో
27 September 2024, 10:30 IST
Camphor: పూజలో వాడే కర్పూరం మన ఆరోగ్యానికి, చర్మానికి కూడా మేలు చేస్తుంది. కర్పూరాన్ని నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి తెల్సుకుందాం.
కర్పూరం
కర్పూరం బిల్లలు లేని పూజగది ఉండదు. సువాసనలు వెదజల్లే కర్పూరం వెలిగించగానే ఇంట్లో సాెనుకూల వాతావరణం నెలకొంటుంది. ఈ చిన్న తెల్లటి బిల్లలు పూజకే కాదు ఆరోగ్యానికి కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి. దీని కోసం మీరు చేయాల్సిందల్లా స్నానం చేసే నీటిలో కర్పూరం బిల్ల వేసుకోవడమే. ఈ చిన్నపని వల్ల మీరేం లాభాలు పొందొచ్చో తెల్సుకోండి.
కర్పూరం ప్రయోజనాలు:
కర్పూరంలో యాంటీబయాటిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దీని వాడకం వల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కర్పూరం వేసిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మం మీదుండే చిన్న మొటిమలు, దురద, దద్దుర్లు లేదా చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం స్నానపు నీటిలో రెండు, మూడు కర్పూరం బిల్లలు వేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఈ నీటితో స్నానం చేయాలి. మొదటిసారి ఈ నీటితో స్నానం చేసినప్పుడే మార్పు మీకు స్పష్టంగా తెలుస్తుంది.
కర్పూరం సువాసన:
కర్పూరం వాసన చాలా మందికి నచ్చుతుంది. ఈ వాసన మనసును శాంతపరుస్తుంది. అలసటను, ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజంతా అలసిపోయాక రాత్రి పూట స్నానం చేసే నీటిలో కర్పూరం బిల్ల వేసుకోండి. దీంతో అలసట మటుమాయం అవుతుంది. శరీరంతో పాటూ సువాసనల వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
అందానికి కర్పూరం:
కర్పూరం సహజ బ్యూటీ ప్రొడక్ట్ గా కూడా పనిచేస్తుంది. కర్పూరం నీటితో స్నానం చేయడం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం స్నానపు నీటిలో కొద్దిగా కర్పూరం కలిపి చేయడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోవడమే కాకుండా కొద్ది రోజుల్లోనే చర్మానికి సహజ కాంతి వస్తుంది. అంతేకాక కాసింత కొబ్బరినూనెలో కర్పూరం పొడి చేసి బాగా కలిపి చర్మానికి రాస్తే చర్మంలో గ్లో కనిపిస్తుంది. దీనితో పాటే జుట్టుకు రాసుకునే నూనెలోనూ కర్పూరం కలపడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
నొప్పుల నుంచి ఉపశమనం:
తలనొప్పి, ఒళ్లు నొప్పుల సమస్య ఉన్నా కర్పూరం కలిపిన నీటితో స్నానం చేస్తే ప్రయోజనం ఉంటుంది. మీ స్నానపు నీటిలో రెండు నుండి మూడు కర్పూరం బిల్లలను జోడించండి. నొప్పి నుండి ఉపశమనం పొందడానికి గోరువెచ్చని నీటిని వాడితే మరింత ఫలితం పొందొచ్చు. ఈ నీటితో స్నానం చేయడం వల్ల తలనొప్పి, ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం లభించడంతో పాటు శరీరానికి పూర్తిగా విశ్రాంతి లభిస్తుంది.