Banana Chia Smoothie । సోమవారం, సోమరితనాన్ని తరిమికొట్టే మృదువైన అల్పాహారం!
23 May 2022, 8:28 IST
- బనానా చియా స్మూతీ ఎంతో ఆహ్లాదకరమైన అల్పాహారం. ఇది ఎంతో రుచికరంగా ఉండటంతో పాటు మంచి పోషకాలతో నిండి ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. చెఫ్ కునాల్ కపూర్ ఇచ్చిన రెసిపీ ఇక్కడ ఉంది.
Chia Banana Smoothie
ఉదయం అల్పాహారం చేస్తే కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బరువును నియంత్రించుకోవాలి అని అనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా చేయాలి. రోజంతా మెదడు బాగా పనిచేయాలి అంటే ఉదయం పోషకాలతో కూడిన అల్పాహారం తీసుకోవాలి.
సోమవారం సోమరితనాన్ని పోగొట్టేలా చెఫ్ కునాల్ కపూర్ ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ డ్రింక్ రెసిపీని అందించారు. అది అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా మీకు ఉదయం పూట ఒక మంచి అల్పాహారంలా ఉంటుంది. మీ కడుపును నిండుగా ఉంచుతుంది.
చెఫ్ కునాల్ కపూర్ అందించిన ఈ రెసిపీ పేరు బనానా చియా స్మూతీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
కావలసినవి:
- సబ్జా గింజలు (నానబెట్టినవి) - ¾ కప్పు
- కొబ్బరి పాలు - 3 కప్పులు
- అరటిపండ్లు - 2
- స్ట్రాబెర్రీలు - 4
- తేనె - 2 టేబుల్ స్పూన్లు
- ఏవైనా నట్స్ - 2 టేబుల్ స్పూన్లు
- వెనీలా ఐస్ క్రీం - 1 పెద్ద స్కూప్
తయారీ విధానం
- అరటి పండ్లను తొక్క తీసేసి మిక్సర్ గ్రైండర్ జార్ లో వేయాలి.
- ఆ తర్వాత మిగిలిన పదార్థాలను వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
- మిశ్రమం మృదువుగా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి.
- స్మూతీ రెడీ అయినట్లే, ఇప్పుడు సర్వింగ్ గిన్నెల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి.
Recipe Video
ఆరోగ్య ప్రయోజనాలు
ఈ బనానా చియా స్మూతీ తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు లభిస్తాయి. అరటి పండ్లలోని విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం రక్తంలోని చక్కెరను నియంత్రిస్తాయి, బీపీని నియంత్రిస్తాయి. ఎముకలు దృఢంగా మారడంలో సహాయపడతాయి. , కొబ్బరి పాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇవి టాక్సిన్లను తొలగించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. స్ట్రాబెర్రీ, సబ్జాలో ఖనిజాలు, ఒమేగా-3 కొవ్వు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి, రక్తపోటును తగ్గిస్తాయి, హృదయాన్ని సంరక్షిస్తాయి. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా రక్షణగా ఉంటాయి.