తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Natarajasana | ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నటరాజాసనం వేయండి.. హుషారుగా ఉంటుంది!

Natarajasana | ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నటరాజాసనం వేయండి.. హుషారుగా ఉంటుంది!

HT Telugu Desk HT Telugu

26 September 2022, 6:33 IST

    • Natarajasana: మీకు రోజూ ఉదయం బద్దకంగా అనిపిస్తే, పనిచేయాలనే ఆసక్తి, శక్తి లేకపోతే నటరాజాసనం వేసి చూడండి. ఈ ఒక్క ఆసనం శారీరకంగా మానసికంగా మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది.
Natarajasana
Natarajasana (iStock)

Natarajasana

వీకెండ్ ముగియగానే మళ్లీ అదే ఉరుకులు పరుగుల జీవితం ప్రారంభం అవుతుంది. పనిచేయాలనే ఆసక్తి, ఉత్సాహం చాలా మందికి ఉండదు. కానీ మిమ్మల్ని రీఛార్జ్ చేసి మీలో శక్తిని నింపే వ్యాయామాలతో రోజును ప్రారంభించడం ద్వారా మళ్లీ మీలో ఉత్సాహం రంకెలేస్తుంది. ప్రతిరోజూ 15 నిమిషాల పాటు యోగా (Yoga) చేయటం ద్వారా మీ శరీరం ఫ్లెక్సిబుల్ అవుతుంది, మీ మైండ్ క్లియర్ అవుతుంది. మీరు మీ పనులలో మెరుగ్గా దృష్టి పెట్టవచ్చు. ఇక్కడ మీకు అద్భుతమైన ఒక యోగాసనం గురించి తెలియజేస్తున్నాం. అదే నటరాజాసనం (Natarajasana).

నటరాజాసనం అనేది నట, రాజ్ ఇంకా ఆసనం అనే మూడు పదాల కలయిక. ఇందులో నట అంటే నృత్యం , రాజ్ అంటే రాజు, అలాగే ఆసనం అంటే భంగిమ. ఈ మూడింటిని కలగలిపిన నటరాజాసనం.. మనోహరమైన నటరాజు నృత్య భంగిమకు (Lord of the Dance Pose) ప్రతీకగా ఉంటుంది.

ఈ ఆసనాన్ని ముఖ్యంగా ఖాళీ కడుపుతో సాధన చేయాలి. తెల్లవారుజామున లేదా సంధ్యా సమయంలో యోగా సాధన చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెబుతారు. రాత్రి భోజనం చేసి ఉంటే ఉదయాన్నే నటరాజాసనం చేయడం ద్వారా ఎలాంటి అజీర్తి సమస్యలు ఉండవు. ఆహారం త్వరగా జీర్ణమై, శక్తి ఉత్పత్తి కావటానికి ఈ ఆసనం సహకరిస్తుంది.

నటరాజాసనం మీ శరీరాన్ని ఒక సొగసైన భంగిమలోకి తీసుకువచ్చే సాధనం. ఈ యోగా భంగిమ శరీరాన్ని దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. మనస్సును, శరీరాన్ని తెరుస్తుంది. లోపలి నుంచి ఒక రకమైన హాయిని, శక్తిని అందిస్తుంది.

నటరాజాసనం ఎలా చేయాలి?

- ముందుగా నేలపై లేదా యోగా మ్యాట్‌పై నిటారుగా నిలబడండి.

- కుడికాలును వెనక్కి మడిచి కుడి చేయితో పట్టుకోండి. ఒంటి కాలితో నిలబడండి.

- ఆపై రిలాక్స్ అయి, మరోవైపు ప్రయత్నించండి. ఇప్పుడు ఎడమ కాలును వెనక్కి మడిచి ఎడమ చేయితో పట్టుకోండి. ఇలా కొన్నిసెకన్ల పాటు ఉండండి.

- ఇప్పుడు మళ్లీ కుడికాలును వెనక్కి మడిచి పట్టుకోండి. అలాగే కాస్త ముందుకు వంగండి. మీ శరీరం ముందుకు ఎంతవరకు వంగితే అంతవరకు వంచణ్డి, అలాగే మీరు ఎత్తిన కాలును కూడా ఎంత ఎత్తువరకు వెళ్తే అంతవరకు సాగదీయండి.

- ఒంటి కాలితో మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇదే నటరాజాసనం. ఇది రెండు వైపులా చేయాలి.

నటరాజాసనం ప్రయోజనాలు

శరీరంలో సమతుల్యతను తీసుకురావడానికి ఈ యోగా భంగిమ, ప్రసిద్ధి. ఈ ఆసనం కండరాలు, చీలమండలు, ఛాతీ ప్రాంతం, భుజం, వీపు, చేతులు, తొడలు, నడుము, పొత్తికడుపులను బలోపేతం చేయడానికి, సాగదీయడానికి సహాయపడుతుంది. కాళ్ళను బలంగా చేస్తుంది.

ఈ భంగిమ శరీరం నుండి ఒత్తిడిని విడుదల చేయడంలో, మనస్సును ప్రశాంతంగా చేయడంలో సహాయపడుతుంది.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, జీవక్రియను పెంచుతుంది కాబట్టి బరువు తగ్గడంలో కూడా బాగా సహాయపడుతుంది.