Girls Safety: మీ ఇంటి ఆడబిడ్డ సురక్షితంగా ఉండాలంటే ఆమెకు ఈ ఐదు విషయాలు కచ్చితంగా నేర్పించండి
09 September 2024, 10:30 IST
Girls Safety: మీ ఇంటి ఆడపిల్లలు భద్రంగా ఉండాలని కోరుకుంటే, ఆమెకు కచ్చితంగా నేర్చించాల్సిన అయిదు విషయాలు ఉన్నాయి. వాటిని మీకు పిల్లలకు నేర్పాలి. దీనివల్ల వారు పెద్దయ్యాక సురక్షితంగా ఉంటారు. ఎలాంటి వేధింపులకు గురికాకుండా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండటానికి కొన్ని టిప్స్ అవసరం.
ఆడపిల్లల సేఫ్టీ టిప్స్
నేటి కాలంలో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు ఉన్నాయి. స్కూల్‌కు, కాలేజీలకు, ఉద్యోగాలకు వెళ్లిన ఆడపిల్లలు సురక్షితంగా ఇంటికి వస్తారా అనే సందేహంతోనే తల్లిదండ్రలు సతమతమవుతున్నారు. బయటవారే కాదు, తెలిసిన స్నేహితులు, బంధువులు కూడా ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. చిన్నప్పట్నించే ఆడపిల్లలకు కొన్ని సేఫ్టీ టిప్స్ నేర్సాల్సిన అవసరం ఉంది. మీ ఇంట్లోని కూతుళ్లు ఎలాంటి మానసిక, లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండాలంటే వారిని పోరాటయోధులుగా తీర్చిదిద్ధాల్సిన బాధ్యత మీదే. దీనివల్ల ఆమె జీవితాంతం ధైర్యంగా, సురక్షితంగా జీవించగలుగుతుంది.
ఆత్మరక్షణ నేర్పించండి
ఒకప్పుడు మగపిల్లలకే కరాటే వంటివి నేర్పేవారు. నిజానికి ఆడపిల్లలకు కూడా ఆత్మరక్షణ తరగతులు నిర్వహించాలి. జూడో-కరాటే, తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్ ఏదైనా వారికి నేర్పించాలి. దీనివల్ల కొన్ని సందర్భాల్లో తనను తాను కాపాడుకోగలిగే ధైర్యం ఆమెకు వస్తుంది. అంతేకాదు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఆడపిల్లలను శారీరకంగా దృఢంగా మార్చడమే కాకుండా మానసికంగా కూడా ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆమెకు మంచి ప్రొటీన్ నిండి ఫుడ్ పెట్టండి. వారి శరీరం బలంగా ఉండేలా చూడండి. బలహీనంగా ఉన్న అమ్మాయిలు తమను తాము కాపాడుకోలేరు. కాబట్టి వారిని మానసికంగా, శారీరకంగా బలంగా మార్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
నో చెప్పడం నేర్పండి
మొహమాటపడడం, ఇష్టం లేకపోయినా ఎదుటి వారికోసం ఏదైనా పనిచేయడం… వంటి లక్షణాలు మీ బిడ్డలో లేకుండా చూసుకోండి. తనకు ఇష్టం లేని పనిని తాను చేయనని… ఎవరికైనా ధైర్యంగా చెప్పేలా ఆమెను సిద్ధం చేయండి. టీచర్ అయినా, బంధువు అయినా, స్నేహితులైనా… తనకు ఇష్టం లేకుండా తనను ముట్టుకుంటే వెంటనే గట్టినా ‘నో’ చెప్పడాన్ని నేర్పండి. తనను ఎవరైనా బాధ పెడుతున్నా వద్దని చెప్పేలా ఆమెను ప్రిపేర్ చేయండి. అంతేకాదు ఇతరులు తనకు నచ్చని విధంగా ముట్టుకున్నా, మాట్లాడినా వెంటనే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలని చెప్పండి.
గౌరవించుకోమనండి
ఆత్మగౌరవం గురించి మీ బిడ్డకు చెప్పండి. ఆత్మగౌరవం అంటే ముందు తన ఇష్టాలకు, తన అభిప్రాయాలకు విలువనిచ్చుకోవడం అని చెప్పండి. ఎల్లప్పుడూ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం నేర్పండి. ఎవరైనా విచ్చలవిడిగా మాట్లాడినా లేదా వారికి నచ్చనిది చేసినా వెంటనే వారిని అడ్డుకోమని చెప్పండి. అలాగే ఆ విషయాన్ని ఇంట్లో చెప్పమనండి.
మానసికంగా దృఢంగా
మీ ఆడపిల్లలను మానసికంగా దృఢంగా ముందు మార్చాలి. జీవితంలో ఏ సంఘటన అయినా వారి మనసును తీవ్రంగా ప్రభావితం చేయకుండా ఉండేందుకు వారు మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ కష్టం వచ్చినా భయంతో వణికిపోయే బదులు దాన్ని ఎదుర్కోవడం ఎలాగో ఆలోచించమనండి.
టెక్నాలజీ రక్షణగా
టీనేజీ వయసులోపు ఆడపిల్లలను ఎక్కడికి ఒంటరిగా పంపకండి. టీనేజీ వయసు దాటాకా ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు ఫోన్లు ఉంటున్నాయి. కాబట్టి తల్లిదండ్రులకు లైవ్ లొకేషన్ షేర్ చేయమని చెప్పండి. మీతో కచ్చితంగా టచ్‌లో ఉండమనండి. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తెలియని వారితో జాగ్రత్తగా ఉండమని చెప్పండి.
టాపిక్