Life Lessons from Ganesha: వినాయకుడి జీవితం నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశాలు ఇవిగో
Life Lessons from Ganesha: ఈరోజు దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు మొదలైపోయాయి. ప్రతి వీధిలో వినాయక మండపాలు వెలిశాయి. ఈ సందర్భంగా, వినాయకుడి జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. అవి మనకు మార్గదర్శకాలు.
ఏ పని మొదలుపెట్టినా, జీవితంలోనైనా అన్ని రకాల అడ్డంకులను తొలగించే దైవం శ్రీ మహా గణపతి. ప్రతి సంవత్సరం వినాయకుడి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. వినాయకుడి వ్రతకథను ప్రతి ఒక్కరూ ఆరోజు చదువుతాను. అతని కథ ద్వారా మీ జీవితంలో నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. వినాయకుడి జీవిత మంత్రాన్ని అనుసరించడం ద్వారా, మీరు విజయవంతం కావచ్చు. వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని మరింత మెరుగ్గా చేయవచ్చు.
కర్తవ్యమే ముఖ్యం
పార్వతీ దేవి శివుడు లేని సమయంలో ఒక బాలుడి విగ్రహాన్ని పసుపు ముద్దతో తయారు చేసి దానికి జీవం పోసి వినాయకుడిని సృష్టించిందని విశ్వసిస్తారు. స్నానం చేసేటప్పుడు ఎవరూ రాకుండా ద్వారం దగ్గర కాపలాగా ఉండమని వినాయకుడిని కోరింది ఆ తల్లి. అతను తన తల్లి సూచనలను విధేయతతో పాటించాడు. అదే సమయంలో శివుడు తన దండయాత్ర నుండి తిరిగి వచ్చి పార్వతి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ వినాయకుడికి శివుడు ఎవరో తెలియదు. తన తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు శివుడినే వినాయకుడు అడ్డుకున్నాడు. ఈ ఘటన తండ్రీకొడుకుల మధ్య ఘర్షణగా మారి శివుడు వినాయకుడి తల నరికేశారు. తరువాత పార్వతీ దేవి విలపిండచంతో శివుడు ఏనుగు తలను తెచ్చి వినాయకుడిని పునరుజ్జీవింపజేశాడు. ఈ కథ ద్వారా ఏ పరిస్థితిలోనైనా దేవతలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని చెబుతోంది. వినాయక కథ నుంచి ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని పాటించాలి.
తల్లిదండ్రులే దైవం
ఓసారి శివుడు, పార్వతి దేవి తమ కుమారులైన వినాయకుడు, కార్తికేయుడు మూడుసార్లు లోకాన్ని చుట్టి రావాలని కోరారు. ఇది విన్న పెద్ద కుమారుడు కార్తికేయుడు పరుగు పందెంలో గెలవడానికి తన వాహనం నెమలిపై ప్రయాణించగా, వినాయకుడు భూమికి బదులుగా శివుడు, పార్వతి దేవి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. వినాయకుడు తన తల్లిదండ్రులనే ప్రపంచంగా భావించి ఇలా చేశాడు. తల్లిదండ్రులను మించి లోకం లేదని చెప్పడానికే వినాయకుడు ఇలా చేశాడు. మీరు ఎంత స్థాయికి వెళ్లినా తల్లిదండ్రులను దైవంగా భావించాలని చెప్పడమే వినాయకుడి ఉద్దేశం.
స్వీయ లోపాలు అంగీకరించాలి
వినాయకుడు సాధారణ వ్యక్తుల్లా ఉండరు. ఏనుగు తలతో భిన్నంగా ఉంటాడు. అయినా కానీ అతడిని అందరూ ప్రేమిస్తారు. తన రూపాన్ని చూసి ఎప్పుడూ బాధపడలేదు. తనని తాను యథాతధంగా స్వీకరించాడు. మీరు ఎవరితోనైనా అనుబంధంలో ఉంటే, అవతలి వ్యక్తి లోపాలను, మీ లోపాలను అంగీకరించాలి. ఇది మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది.
ఇచ్చిన పని పూర్తి చేయాలి
వ్యాస మహర్షి మహాభారత కావ్యం రాసేందుకు వినాయకుడిని సాయాన్ని కోరాడు. శ్లోకాన్ని తాను చెబుతూ ఉంటే వినాయకుడు లిఖించేవాడు. వ్యాస మహర్షి శ్లోకాల పఠనాన్ని ఆపకుండా చెబుతూనే ఉంటే… వినాయకుడు విరామం తీసుకోకుండా రాసేందుకు అంగీకరించాడు. అలా రాస్తూనే ఉన్నాడు. రాస్తూ రాస్తూ వినాయకుడి కలం విరిగిపోయింది. పని ఆగకూడదని భావించిన వినాయకుడు తన దంతాలలో ఒకదాన్ని విరగ్గొట్టి ఇతిహాసాన్ని రాయడం కొనసాగించాడు. ఈ మంచి పనిని పూర్తి చేయడానికి గణపతి బప్పా తన దంతాలను త్యాగం చేశాడు. ఏ పని చేపట్టినా పూర్తి చేయాలనేది దీని నుంచి పాఠం.
టాపిక్