Thursday Motivation: మానసికంగా బలంగా ఉంటేనే ఏదైనా సాధించగలరు, అందుకోసం ఈ అలవాట్లను నేర్చుకోండి
Thursday Motivation: ఏ వ్యక్తి అయినా మానసికంగా బలంగా ఉంటేనే విజయాన్ని సాధించగలడు. సవాళ్లను చూసి భయపడి పోతే ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. మానసికంగా బలంగా ఉండాలంటే కొన్ని అలవాట్లు మార్చుకోవాలి.
Thursday Motivation: ప్రపంచం సవాళ్లతో నిండి ఉంటుంది. లక్ష్యాలను అందుకోవాలని ప్రతి సవాలును దాటుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మీరు అనుకున్న స్థానాన్ని సాధించగలరు. కొంతమందికి వ్యక్తులు సవాళ్లను చూసి భయపడి పోతారు. అలా భయపడకుండా ఉండాలంటే ముందుగా మీరు మానసికంగా బలంగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలను చూసి భయపడకూడదు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నిలబడే ఉండాలి. భయంతో పారిపోకూడదు. మీరు మానసికంగా బలంగా ఉండాలంటే కొన్ని లక్షణాలను, అలవాట్లను అలవర్చుకోవాలి.
మీ జీవితంలో కృతజ్ఞత అనే పదాన్ని ముందు పెట్టండి. మీకు సాయం చేసిన ప్రతి వ్యక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. అది మీకు చాలా ప్రశాంతతను ఇస్తుంది. మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. దీనివల్ల మీరు బలహీనంగా మారరు.
నేటి ప్రపంచంలో జీవితం బిజీగా మారిపోయింది. వ్యక్తిగత జీవితంలో కూడా వృత్తిపరమైన ఆలోచనలు అడుగుపెడుతున్నాయి. వ్యక్తిగత జీవితానికి, వృత్తిగత జీవితానికి మధ్య సరిహద్దులు నిర్ణయిస్తేనే మీరు ఏదైనా సాధించగలరు. సరిహద్దులు ఎప్పుడు, ఎక్కడ సెట్ చేయాలో తెలిసిన వ్యక్తికి మానసిక ఆరోగ్యం కూడా మెండుగా ఉంటుంది. మానసికంగా బలమైన వ్యక్తులు తమ పరిధులను తాము తెలుసుకుంటారు. వారు తమ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. తమని తాము మానసికంగా ఆనందంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. స్వయంగా సంతోషంగా లేని వ్యక్తి ఏదీ సాధించలేడు.
మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తి అపజయాన్ని చూసి బాధపడడు. అపజయాన్ని అంతంగా భావించడు. చిన్న ఎదురుదెబ్బలకి కూడా విలవిలలాడిపోకుండా నిలిచి ఉంటాడు. ప్రతి ఎదురు దెబ్బ నుంచి గుణపాఠం నేర్చుకుంటాడు. ఆ ఎదురుదెబ్బను ఎదగడానికి, నేర్చుకోవడానికి ఒక అవకాశంగా మలుచుకుంటాడు. కాబట్టి వైఫల్యం మీ దరికి చేరకుండా ఉండాలంటే మీరు మానసికంగా దృఢంగా మారండి.
మానసికంగా దుర్బలంగా ఉన్న వ్యక్తి ఎదుటివారి మాటలకు లొంగిపోతాడు. మొహమాటానికి పోయి చిక్కుల్లో ఇరుక్కుంటారు. కానీ మానసికంగా బలంగా ఉండే వ్యక్తులు ఎప్పుడు ‘నో’ చెప్పాలో వారికి తెలుసు. కొన్ని విపత్కర పరిస్థితుల నుండి తమను తాము రక్షించుకోవడం వీరికి వస్తుంది. మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తులకు తమ శక్తిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో వారికి అర్థమవుతుంది. కాబట్టి నచ్చని వ్యక్తులకు, నచ్చని పనులకు నో చెప్పడం ధైర్యంగా నేర్చుకోండి.
ఎదురయ్యే ప్రమాదం గురించి ముందుగానే భయపడుతూ కొంతమంది అక్కడే ఆగిపోతారు. కానీ మానసికంగా దృఢమైన వ్యక్తులు ఎదురొచ్చే ప్రమాదాల గురించి భయపడరు. వాటి గురించి అధ్యయనం చేస్తారు. పరిశోధన చేసి ప్రణాళికతో ముందుకు వెళతారు.
మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తికి ఎలాంటి ఓదార్పు అవసరం ఉండదు. ఒంటరితనంలో కూడా తనను తాను రీచార్జ్ చేసుకొనే సమయం దొరికిందని భావిస్తాడు. ఒంటరిగా కొంతకాలం గడపడం ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటాడు. తద్వారా వారి ఆలోచనలను విశ్లేషించుకుంటారు. కాబట్టి ఏకాంతంలో సంతోషంగా ఉంటారు. కాబట్టి మానసికంగా దృఢంగా అవ్వాలంటే ఒంటరితనంలో కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.