Lazy Eye: మెల్లకన్ను ఉన్న పిల్లలు జాగ్రత్త, వారికి భవిష్యత్తులో వచ్చే రోగాల గురించి తేల్చిన కొత్త అధ్యయనం
09 March 2024, 8:40 IST
- Lazy Eye: కొందరు పిల్లల్లో మెల్లకన్ను వస్తుంది. దీన్ని క్రాస్ ఐ, లేజీ ఐ, ఆంబ్లియోపియా అని పిలుస్తారు. చిన్నప్పుడు మెల్లకన్ను ఉన్న పిల్లలకు పెద్దయ్యాక వచ్చే సమస్యల గురించి ఒక అధ్యయనం వివరిస్తోంది.
ఆంబ్లియోపియాతో ఆరోగ్య సమస్యలు
Lazy Eye: కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు సాధారణంగానే ఉంటారు. వారు పెరిగే కొద్దీ వారికి మెల్లకన్ను బయటపడుతుంది. ఏడేళ్ల వయసులో సాధారణంగా ఇది స్పష్టంగా తెలుస్తోంది. మెల్లకన్నును ‘స్కింట్ ఐ’ అంటారు. అలాగే లేజీ ఐ (Lazy Eye) అని కూడా పిలుస్తారు. వైద్య శాస్త్రంలో ఈ సమస్యను ఆంబ్లియోపియా అని పిలుస్తారు. ఏ పిల్లలైతే ఇలా మెల్లకన్నుతో ఇబ్బంది పడతారో పెద్దయ్యాక వారు అధిక రక్తపోటు, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నట్టు కొత్త అధ్యయనం చెబుతుంది. అలాగే గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా వారికి ఎక్కువేనని ఈ కొత్త పరిశోధన తేల్చింది.
బ్రిటన్లోని లండన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 40 నుంచి 69 ఏళ్ల సంవత్సరాల మధ్య గల లక్షా 26 వేల మందిని ఎంపిక చేశారు. వారి కంటి ఆరోగ్యం గురించి డేటాను సేకరించారు. వీరు చిన్నప్పుడు ఆంబ్లియోపియా సమస్యతో బాధపడ్డారా? దానికి చికిత్స తీసుకున్నారా? వంటి వివరాలను కనుక్కున్నారు. అలాగే యుక్త వయసులో వారి ఆరోగ్యం ఎలా ఉంది? ఎలాంటి సమస్యల బారిన వారు పడ్డారో కూడా వివరాలను సేకరించారు. వారికి మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయేమో కనుక్కున్నారు. అలాగే వారి బాడీ మాస్ ఇండెక్స్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలను ట్రాక్ చేశారు.
మెల్లకన్ను ఉంటే
ఈ డేటాలో వారికి 1,26,000 మందిలో 3,238 మంది చిన్నప్పుడు మెల్లకన్నుతో బాధపడినట్టు చెప్పారు. వారిలో 82 శాతం మంది పెద్దయ్యాక ఒక కంటి చూపును కోల్పోయినట్టు కూడా వివరించారు. చిన్నతనంలో ఎవరైతే ఆంబ్లియోపియా సమస్యతో బాధపడ్డారో... వారిలో 29 శాతం మదికి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అలాగే హై బీపీ వచ్చే ప్రమాదం పాతిక శాతం ఎక్కువ అని, ఇక వారు ఊబకాయం బారిన పడే అవకాశం 16% ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు.
చిన్నప్పుడు ఇలా ఆంబ్లియోపియా సమస్యతో బాధపడిన వారికి పెద్దయ్యాక గుండెపోటు ప్రమాదం కూడా అధికంగా ఉన్నట్టు వారు తేల్చారు. కాబట్టి చిన్నప్పుడు ఆంబ్లియోపియా సమస్యతో బాధపడుతున్న చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి యుక్త వయసు వచ్చేసరికి ఇలాంటి ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వారికి పోషకాహారాన్ని అందిస్తూ, వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చిన్నప్పుడు ఆంబ్లియోపియా సమస్యకు చికిత్స చేయించినప్పటికీ పెద్దయ్యాక వారిలో ఒక కంటి చూపు తగ్గే అవకాశం ఎక్కువే.
పిల్లలకు ఆంబ్లియోపియా సమస్య వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఐదేళ్ల వయసులోపే కంటి చికిత్సలు చేయించడం చాలా అవసరం అని చెబుతున్నారు పరిశోధకులు. దీనివల్ల సమస్యను ముందుగానే అంచనా వేసి చికిత్సను ప్రారంభించడం వల్ల వారికి తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని వివరిస్తున్నారు. మనిషికి కంటి చూపు చాలా అవసరం. కాబట్టి మీ పిల్లల కంటి చూపును మీరే కాపాడుకోవాలి.
టాపిక్