Aloevera benefits: ఎన్నో చర్మ సమస్యలకు ఒక్కటే పరిష్కారం.. కలబంద
19 September 2023, 19:41 IST
Aloevera benefits: కలబందను సౌందర్యం కోసం కేవలం ముఖానికే కాదు.. వివిధ చర్మ సమస్యలకు మందులాగా వాడొచ్చు. దాని విభిన్న ఉపయోగాలేంటో తెలుసుకోండి.
కలబంద ఉపయోగాలు
ప్రతి ఇంటి తోటలోనూ తేలికగా అందుబాటులో ఉండే మొక్క కలబంద. దీని లోపల ఉండే గుజ్జు వల్ల ప్రయోజనాలు ఎన్నో. ముఖ్యంగా అనేక చర్మ సంబంధిత సమస్యలకు ఇదొక్కటే ఔషధంగా ఉపయోగపడుతుందని చర్మ వ్యాధుల నిపుణులు చెబుతున్నారు. ముఖం కాంతివంతంగా, మృదువుగా ఉండాలన్నా ఇది పని చేస్తుంది. తామర, దురదలు, కాలిన గాయాలు లాంటి వాటికి ఔషధం లాగానూ పనికి వస్తుంది. చర్మ సంబంధిత విషయాల్లో దీన్ని ఎలా వాడుకోవచ్చో తెలుసుకుందాం రండి.
కాలిన గాయాలకు:
చాకులు, బ్లేడులు లాంటివి తెగినా, కాలిన గాయాలైనా, దెబ్బలు తగిలినా.. అన్నింటికీ కలబంద ఔషధంలా పని చేస్తుంది. గాయంపై కలబంద గుజ్జును పెట్టుకోవడం వల్ల గాయం త్వరగా మానిపోవడానికి ఇది సహకరిస్తుంది.
సన్ బర్న్‌కి:
ఎక్కువగా ఎండలో తిరిగితే కాస్త సున్నిత చర్మం ఉన్నవాళ్లు సన్ బర్న్ బారిన పడతారు. చర్మం మొత్తం కమిలి పోయినట్లుగా అయిపోతుంది. అలాంటి వారికి కలబంద గుజ్జు చక్కగా పనికొస్తుంది. కమిలిన చర్మంపై దాన్ని రాసుకుంటే చల్లగా అనిపిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది.
వృద్ధాప్య ఛాయలు రాకుండా:
ఒత్తిడితో కూడిన జీవన విధానంలో ఉండటం వల్ల ఈ మధ్య కాలంలో చాలా మంది వయసుకు మించి కనిపిస్తున్నారు. వృద్ధాప్య ఛాయలు తొందరగా వచ్చేస్తున్నాయి. ముఖంపై గీతలు, ముడతలు, తెల్ల జుట్టు లాంటి వాటితో ఇబ్బందులు పడుతున్నారు. కలబంద గుజ్జులో ఉండే విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్‌లు చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మం ఎక్కువ సాగే లక్షణాన్ని కలిగి ఉండేలా చేస్తాయి. తద్వారా వృద్ధాప్య ఛాయలు తొందరగా దరి చేరవు.
తేమను అందించేందుకు:
చాలా మంది చర్మం మృదువుగా ఉండేందుకు మార్కెట్లో అందుబాటులో ఉండే రకరకాల మాయిశ్చరైజర్లను కొనుక్కుని వాడుతుంటారు. బదులుగా కలబంద గుజ్జును కాళ్లు చేతులు, ముఖానికి పట్టించి కాసేపున్నాక చల్లని నీటితో కడుక్కోవాలి. ఇది సహజమైన మాయిశ్చరైజర్‌లా పనికొస్తుంది.
మొటిమల్ని తగ్గిస్తాయి:
దీనిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వల్ల ఇది ముఖంపై వచ్చే మొటిమలు, పొక్కులను తగ్గిస్తుంది. కలబంద గుజ్జులో కొంచెం నిమ్మరసం చేర్చి రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి పట్టించాలి. ఉదయాన్నే లేచిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని మృదువుగా రుద్దుతూ కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం రంగు తేలుతుంది. హైపర్ పిగ్మంటేషన్, తామర లాంటి సమస్యలనూ ఇది తగ్గిస్తుంది.