Akshaya Tritiya 2023 । అక్షయ తృతీయ ఎప్పుడు, బంగారం కొనుగోలుకు శుభ సమయాలు చూడండి!
20 April 2023, 18:11 IST
- Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ 2023 ఈ సంవత్సరం ఏప్రిల్ 22న వస్తుంది. ఈరోజు చేయాల్సిన పనులు శుభ ముహూర్తం, నగరాల వారీగా పూజ సమయాలు, బంగారం కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం గురించి తెలుసుకోండి.
Akshaya Tritiya 2023
Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ పండుగ దగ్గరలో ఉంది. ఇది ముఖ్యంగా హిందువులు, జైనులు జరుపుకునే పండగ. హిందూ క్యాలెండర్‌లో వైశాఖ చాంద్రమాన శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయగా జరుపుకుంటారు. వైశాఖమాసంలో అమావాస్య తర్వాత మూడవ రోజును అక్షయ తృతీయగా గుర్తిస్తారు.ఈరోజున లక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పవిత్రమైన రోజున విలువైనది ఏది ఇంటికి తెచ్చుకుంటే అది అక్షయం అవుతుంది అనే ఒక నమ్మకం ఉంది. అంటే ఇంట్లో ఎల్లప్పుడూ తరిగిపోని సంపద ఉంటుందని అర్థం. అందుకే చాలా మంది ఈరోజున అత్యంత విలువైన బంగారంను కొనుగోలు చేస్తారు.
జైనమతంలో మొదటి తీర్థంకరుడు అయిన రిషభనాథుని స్మరిస్తూ ఈ పండగ జరుపుకుంటారు. రిషభనాథుడు దోసిట పోసిన చెరుకు రసాన్ని సేవించి, తన సన్యాసాన్ని ముగించిన సందర్భం అక్షయ తృతీయరోజు జరిగింది. అందుకే జైనులు ఈరోజును పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు.
దృక్ పంచాంగ్ ప్రకారం, అక్షయ అంటే 'ఎప్పటికీ తరగదు'. ఈ రోజున చేసే యజ్ఞం, జపం, దానము, పుణ్యం వంటి కార్యాలు ఎప్పటికీ తరిగిపోని ఫలాలను అందించగలవు అనే భావనను సూచిస్తుంది. వివాహాలు, కొత్త పెట్టుబడులు లేదా వెంచర్లు, బంగారంలో పెట్టుబడి పెట్టడం, వ్యాపారాలు ప్రారంభించడం వంటి వాటికి ఈ పండుగ శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది. అక్షయ తృతీయ రోజున రోజున ప్రారంభించేవి ఏవైనా సంవత్సరం పొడవునా గొప్ప విజయాలు, లాభాలు పొందేటువంటి ఆశీర్వాదం లభిస్తుంది. వారికి ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంతుందని నమ్ముతారు.
Akshaya Tritiya 2023 Date- 2023లో అక్షయ తృతీయ ఎప్పుడు?
ఈ సంవత్సరం, అక్షయ తృతీయ ఏప్రిల్ 22 లేదా ఏప్రిల్ 23న వస్తుందా అనే గందరగోళం ఉంది. దృక్ పంచాంగ్ ప్రకారం, పండుగ ఏప్రిల్ 22 శనివారం వస్తుంది. అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 22 ఉదయం 7:49 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 23న 7:47 కి ముగుస్తుంది.
Akshaya Tritiya 2023 Shubha Muhurtham- అక్షయ తృతీయ శుభ ముహూర్తం
అక్షయ తృతీయ పూజకు శుభ ముహూర్తం ఏప్రిల్ 22న శనివారం నాడు ఉదయం 7:49 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది. అదనంగా, చోగడియా ముహూర్తం ఏప్రిల్ 22న ఉదయం 7:49 గంటలకు ప్రారంభమై 9:04 గంటలకు ముగుస్తుంది. అలాగే ఏప్రిల్ 23న ఉదయం 7:26 గంటలకు ప్రారంభమై 7:47 గంటలకు ముగుస్తుంది.
భారతదేశంలో వివిధ నగరాల వారీగా అక్షయ తృతీయ పూజా సమయాలు
న్యూఢిల్లీ - ఉదయం 7:49 నుండి మధ్యాహ్నం 12:20 వరకు
పూణే - ఉదయం 7:49 నుండి మధ్యాహ్నం 12:33 వరకు
చెన్నై - ఉదయం 7:49 నుండి మధ్యాహ్నం 12:08 వరకు
కోల్‌కతా - ఉదయం 5:10 నుండి 07:47 వరకు
హైదరాబాద్ - ఉదయం 7:49 నుండి మధ్యాహ్నం 12:15 వరకు
అహ్మదాబాద్ - ఉదయం 7:49 నుండి మధ్యాహ్నం 12:38 వరకు
నోయిడా - ఉదయం 7:49 నుండి మధ్యాహ్నం 12:19 వరకు
జైపూర్ - ఉదయం 7:49 నుండి మధ్యాహ్నం 12:26 వరకు
ముంబై - ఉదయం 7:49 నుండి మధ్యాహ్నం 12:37 వరకు
గుర్గావ్ - ఉదయం 7:49 నుండి మధ్యాహ్నం 12:21 వరకు
బెంగళూరు - ఉదయం 7:49 నుండి మధ్యాహ్నం 12:18 వరకు
చండీగఢ్ - ఉదయం 7:49 నుండి మధ్యాహ్నం 12:22 వరకు
అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి మంచి సమయం:
అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు శుభ ముహూర్తం ఏప్రిల్ 22న ఉదయం 7:49 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 23న ఉదయం 5:48 గంటలకు ముగుస్తుందని దృక్ పంచాంగ్ చెబుతోంది. ఏప్రిల్ 23న ఉదయం 7:49 నుంచి 5:48 వరకు బంగారం కొనుగోలు చేయవచ్చు.